Central Minister Amit Shah : మోదీ కొండంత అండ
ABN , Publish Date - Jan 20 , 2025 | 02:57 AM
‘రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం గురించి చింతించొద్దు. ఏపీ అభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొండంత అండగా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు
చంద్రబాబు-మోదీ నాయకత్వాన మూడింతల అభివృద్ధి ఖాయం: షా
వైసీపీ విధ్వంసాన్ని మర్చిపోండి
6 నెలల్లోనే ఏపీకి 3 లక్షల కోట్లు
అమరావతి నిర్మాణానికీ నిధులు
2028 నాటికి పోలవరం నీళ్లు పారిస్తాం
విశాఖ ఉక్కుకు ఊతమిచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచాం
ప్రకృతి విపత్తుల నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ రక్షణ
మానవ విధ్వంసాల నుంచి ఎన్డీయే అండ
ఎన్డీఆర్‌ఎఫ్ వేడుకల్లో అమిత్ షా
అభివృద్ధికి అద్భుత అవకాశాలున్న ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో సర్వ నాశనమైంది. రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు రేయింబవళ్లూ శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ కొండంత అండగా ఉంటారు.
- కేంద్ర హోం మంత్రి అమిత్ షా
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం గురించి చింతించొద్దు. ఏపీ అభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొండంత అండగా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. ఇద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మూడింతల ప్రగతి సాధిస్తుంది’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆదివారం విజయవాడ సమీపంలోని కొండపావులూరు వద్ద జరిగిన ఎన్డీఆర్‌ఎఫ్ 20వ వ్యవస్థాపక వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ ప్రాంగణంలో నిర్మించిన ఎన్‌ఐడీఎం దక్షిణ సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో మోదీ, చంద్రబాబుపై విశ్వాసంతో ఎన్డీయే కూటమిని గెలిపించిన ప్రతి ఒక్కరికీ నమస్కారాలు. నేను తెలుగులో మాట్లాడలేక పోతున్నందుకు క్షమించండి(మోదీ ఏపీకి వస్తే తెలుగులో ప్రసంగం మొదలు పెడతారు). నా ప్రసంగాన్ని పురందేశ్వరి మీకు తెలుగులో అనువదిస్తారు’ అని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ వస్తుందని, మానవ విధ్వంసం నుంచి కాపాడేందుకు ఎన్డీయే ముందుంటుందని వ్యాఖ్యానించారు.
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల రూపాయల సహకారం అందించామన్నారు. అమరావతి నిర్మాణానికి నిధులిచ్చామని, 2028 నాటికి పోలవరం ప్రాజెక్టు నీళ్లు రాష్ట్రంలోని పొలాల్లో పారిస్తామన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రైల్వే జోన్ ఏర్పాటైందని, తాజాగా విశాఖ ఉక్కుకు ఊతమిచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచామని అమిత్ షా పేర్కొన్నారు.
ఎన్డీఆర్‌ఎఫ్ సేవలు భేష్
‘విపత్తుల నిర్వహణ సంస్థలు ఒకే చోట ఉంటే విపత్కర పరిస్థితుల్లో సమన్వయం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. గ్రామ స్థాయిలో ఎన్‌సీసీ ప్రతినిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం వరకూ అన్నీ సమన్వయం చేసుకుంటేనే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. గతంలో ఒడిశాలో తుఫాన్లు వస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల రెండు సార్లు తుఫాన్లు వచ్చినా ముందస్తు ప్రణాళికతో ఎదుర్కోవడం వల్ల ఒక్క ప్రాణం కూడా పోలేదు. గతంలో ఝఉపశమనం తప్ప ముందు జాగ్రత్త చర్యలు ఉండేవి కావు. మోదీ పాలనలో జీరో క్యాజువాలిటీ లక్ష్యం నిర్దేశించుకుని పని చేస్తున్నాం. దేశ, విదేశాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ ఎన్నో విజయాలు సాధించింది. విపత్తుల్లో చిక్కుకున్న ప్రజలు ఎన్డీఆర్‌ఎఫ్ యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తుల్ని చూడగానే ధైర్యం వచ్చిందని నాకు చాలా చోట్ల చెప్పారు. జపాన్, నేపాల్, మయన్మార్, టర్కీ తదితర దేశాల అధ్యక్షులు సైతం ఎన్డీఆర్‌ఎఫ్ సేవల్ని కొనియాడారు’ అని అమిత్ షా వివరించారు.
ఢిల్లీలోనూ గెలుస్తాం
‘గత ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు ఇటీవల మహారాష్ట్రలో భారీ విజయం సాధించాం. అదే తరహాలో త్వరలో జరిగే ఢిల్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయాన్ని సాధించబోతోంది’ అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు
220 కోట్ల రూపాయల ఖర్చుతో కేంద్రం చేపట్టిన పలు పనులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో యాభై ఎకరాల్లో నిర్మించిన ఎన్‌ఐడీఎం భవనాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రారంభించారు. సుపాల్ తొమ్మిదో బెటాలియన్‌లోని రీజినల్ రెస్పాన్స్ సెంటర్(ఆర్‌సీసీ)తో పాటు హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్‌పీఏ)లో ప్రొబెషనరీ ఐపీఎ్‌సలకు శిక్షణ ఇచ్చే ఇంటిగ్రేటెడ్ ఇండోర్ షూటింగ్ రేంజ్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేశా రు. అలాగే తిరుపతిలోని ప్రాం తీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.జాతీయ, ప్రాంతీయ భాష ల్లో రూపొందించిన ఎన్‌డీఆర్‌ఎఫ్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. విశిష్ఠ ప్రతిభ కనబరిచిన తొమ్మిది మందికి రాష్ట్రపతి పోలీసు సేవా పతకాలు అందజేశారు. ప్రకృతి విపత్తుల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ అందించే సేవలకు సంబంధించిన మాక్ డ్రిల్‌ను తిలకించి, ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మం త్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఏపీకి సహకరిస్తాం
‘అభివృద్ధి, సుపరిపాలనతో పాటు ఆర్థిక నిర్వహణలో మంచి అనుభవం ఉన్న చంద్రబాబు కష్టానికి కేంద్రం తోడ్పాటు ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిన రాజధాని అమరావతికి గడిచిన ఆరు నెలల్లోనే 27 వేల కోట్ల రూపాయల భరోసాతో ఏపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచాం. ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా ఎయిమ్స్ ప్రారంభమైంది. రాష్ట్రంలో రూ.1.20 లక్షల కోట్లతో జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు’ అని అమిత్ షా వెల్లడించారు.