Share News

Hyderabad: మండలిలో ఆకర్ష్‌!

ABN , Publish Date - Jun 17 , 2024 | 03:15 AM

ఏపీ శాసనసభలో ఆమోదం పొందిన మూడు రాజధానుల బిల్లు.. మండలికి వచ్చే సరికి ఆగిపోయింది. కారణం.. అప్పట్లో ఏపీ శాసనమండలిలో మెజారిటీ సభ్యులు టీడీపీకి చెందినవారు కావడమే. ఆ తర్వాత అది అనేక మలుపులు తిరిగి.. చివరికి జగన్‌ ప్రభుత్వం అభాసుపాలు కావడం వేరే విషయం.

Hyderabad: మండలిలో ఆకర్ష్‌!

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్‌ గురి

  • కనీసం 14 మందిని చేర్చుకునేందుకు యత్నాలు

  • మండలి చైర్మన్‌ గుత్తాపై బీఆర్‌ఎస్‌

  • ‘అవిశ్వాసం’ పెట్టనుందన్న వార్తలతో అప్రమత్తం

  • గతంలో ఇలాగే కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలను చేర్చుకున్న

  • బీఆర్‌ఎస్‌.. నాటి సీన్‌ రివర్స్‌ అయ్యే చాన్స్‌

    4 copy.jpg

హైదరాబాద్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ఏపీ శాసనసభలో ఆమోదం పొందిన మూడు రాజధానుల బిల్లు.. మండలికి వచ్చే సరికి ఆగిపోయింది. కారణం.. అప్పట్లో ఏపీ శాసనమండలిలో మెజారిటీ సభ్యులు టీడీపీకి చెందినవారు కావడమే. ఆ తర్వాత అది అనేక మలుపులు తిరిగి.. చివరికి జగన్‌ ప్రభుత్వం అభాసుపాలు కావడం వేరే విషయం. అలాగే లోక్‌సభలోనూ పలు బిల్లులకు ఆమోదం లభించి.. రాజ్యసభలో పెండింగ్‌ పడడమూ చూశాం. ఆయా ప్రభుత్వాలకు దిగువ సభల్లో తిరుగులేని బలమున్నా.. పెద్దల సభల్లో లేకపోవడంతో అనుకున్న చట్టాలను సకాలంలో అమల్లోకి తేలేని పరిస్థితి అధికార పార్టీలది. తెలంగాణలోనూ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి శాసనసభలో తిరుగులేని బలం ఉన్నా.. మండలిలో మాత్రం బీఆర్‌ఎస్‌ పార్టీదే పైచేయిగా ఉంది. ఇది పలు కీలక బిల్లుల ఆమోదం, ఇతర అంశాల్లో అడ్డంకిగా మారే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో శాసనమండలిలో ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’కు తెరలేపేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది.


బీఆర్‌ఎ్‌సకు చెందిన 14 మందిని కాంగ్రె్‌సలోకి లాగేందుకు ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. అంతా కుదిరితే బడ్జెట్‌ సమావేశాల్లోపే మండలిలో ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి శాసనమండలిపై ఇప్పటికిప్పుడే దృష్టి సారించాలన్న ఆలోచన కాంగ్రెస్‌ పెద్దలకు లేదు. అయితే మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారన్న వార్తలు రావడంతో కాంగ్రెస్‌ నాయకత్వం అప్రమత్తమైంది. ఆయన ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నా ఇటీవలి కాలంలో పలుమార్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా బీఆర్‌ఎస్‌ రాజకీయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్‌ నేతలతో సన్నిహితంగానూ వ్యవహరిస్తున్నారు. అలాగే సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరి.. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపునకు పనిచేశారు కూడా. ఈ నేపథ్యంలో సుఖేందర్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ను పదవి నుంచి దించేయాలన్న చర్చ ఇటీవల బీఆర్‌ఎస్‌ నేతల్లో జరిగింది.


అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో నెగ్గడం ద్వారా అధికార కాంగ్రె్‌సను ఇరకాటంలో పడేయవచ్చునన్న చర్చా చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్‌.. మండలిలో ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌‘కు తెరలేపాలన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకున్నా దాన్ని ప్రశ్నించే పరిస్థితి బీఆర్‌ఎ్‌సకు ఉండబోదని కాంగ్రెస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో శాసనసభలో బీఆర్‌ఎ్‌సకు తిరుగులేని బలం ఉన్నా.. శాసనమండలిలో మాత్రం కాంగ్రెస్‌ సభ్యులదే పైచేయిగా ఉండేదని గుర్తు చేస్తున్నాయి. అప్పటి అధికార బీఆర్‌ఎస్‌... మండలిలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీల్లో మెజారిటీ సభ్యులను వారి పార్టీలో చేర్చుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న ఎంఎస్‌ ప్రభాకర్‌, భానుప్రసాద్‌ కూడా కాంగ్రెస్‌ నుంచి వెళ్లినవాళ్లేనంటున్నాయి. కాగా, 14 మందికి తగ్గకుండా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలను కాంగ్రె్‌సలో చేర్చుకునేందుకు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.


ప్రస్తుతం సభలో బీఆర్‌ఎ్‌సకు నామినేటెడ్‌ సభ్యులతో కలుపుకుని 26 మంది ఉన్నారు. కాంగ్రె్‌సకు ఆరుగురు ఉన్నారు. బీజేపీ, ఎంఐఎంలకు ఇద్దరు చొప్పున, టీచర్‌ ఎమ్మెల్సీలు ఇద్దరు ఉన్నారు. మరో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. బడ్జెట్‌ సమావేశాల సమయంలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ అవిశ్వాస తీర్మానం పెడితే ఆ పార్టీకి ఉన్న సంఖ్యాబలంతో తేలికగా నెగ్గుతుంది. సభలో బీఆర్‌ఎస్‌ ఆధిపత్యాన్ని గండి కొట్టాలంటే ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ను అమలు చేయడం తప్ప వేరే మార్గం లేదని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి 14మంది ఎమ్మెల్సీలను చేర్చుకుంటే మండలిలో కాంగ్రెస్‌ సంఖ్యాబలం 20కి చేరుకుంటుందని, ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పోస్టులూ భర్తీ చేస్తే మరింత మద్దతు పెరుగుతుందని అంటున్నాయి

Updated Date - Jun 17 , 2024 | 03:15 AM