Share News

Hyderabad: ‘గొర్రెల’ అక్రమాల వెనక ఎవరున్నారు?

ABN , Publish Date - Jun 11 , 2024 | 03:54 AM

గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల కుంభకోణం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న తెలంగాణ స్టేట్‌ లైవ్‌స్టాక్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ మాజీ సీఈవో రాంచందర్‌తోపాటు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాజీ ఓఎస్డీ జి.కల్యాణ్‌ కుమార్‌ను ఏసీబీ అధికారులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు.

Hyderabad: ‘గొర్రెల’ అక్రమాల వెనక ఎవరున్నారు?

  • దారి మళ్లిన సొమ్ములో ఎవరి వాటా ఎంత?

  • రాంచందర్‌, కల్యాణ్‌కు ఏసీబీ ప్రశ్నలు

  • కీలక ప్రశ్నలకు జవాబివ్వని నిందితులు

  • ‘గొర్రెల’ అక్రమాల వెనుక

  • అండదండలెవరివి?

  • మళ్లించిన సొమ్ములో ఎవరి వాటా ఎంత?

  • రాంచందర్‌, కల్యాణ్‌కు ఏసీబీ ప్రశ్నలు

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల కుంభకోణం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న తెలంగాణ స్టేట్‌ లైవ్‌స్టాక్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ మాజీ సీఈవో రాంచందర్‌తోపాటు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాజీ ఓఎస్డీ జి.కల్యాణ్‌ కుమార్‌ను ఏసీబీ అధికారులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. రూ.2.10 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఈ కేసు దర్యాప్తు ప్రారంభం కాగా.. మొత్తం రూ. 700 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా రాంచందర్‌, కల్యాణ్‌ను వేర్వేరుగా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద ఉన్న సమాచారంతో ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించి, వారి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.


మొదటి రోజు విచారణలో కేసుకు సంబంధించిన ప్రాథమిక అంశాలపైనే దర్యాప్తు అధికారులు ఎక్కువగా దృష్టి సారించారు. వందల కోట్ల రూపాయల అక్రమాల వెనక ఎవరి అండదండలు ఉన్నాయి? నకిలీ బిల్లులు, ఓచర్లతో ప్రైవేటు వ్యక్తుల ఖాతాలో జమ చేసిన సొమ్ము ఎవరెవరు ఎంత పంచుకున్నారు? అనే కోణంలో ప్రశ్నించినట్లు తెలిసింది. ఏసీబీ విచారణలో వ్యక్తిగత సమాచారం, ఉద్యోగం, ఆస్తులకు సంబంధించిన వివరాలు వెల్లడించిన రాంచందర్‌, కల్యాణ్‌... కేసుకు సంబంధించిన కీలక ప్రశ్నలకు జవాబు చెప్పకుండా మౌనం వహించినట్లు తెలిసింది. గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం, అక్రమాల వ్యూహాలు, వచ్చిన సొమ్ములో వాటాలు, నిధుల దారిమళ్లింపు ఇలా కేసు దర్యాప్తునకు అవసరమైన అన్ని అంశాలపై రాంచందర్‌, కల్యాణ్‌ను విచారించి వివరాలు రాబట్టే ప్రయత్నంలో దర్యాప్తు అధికారులున్నారు. అక్రమాల్లో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల పాత్ర ఏంటన్న కోణంలోనూ ప్రశ్నించనున్నారు.


అలాగే, కేసుకు సంబంధించిన కీలక నిందితుల్లో ఒకరైన ప్రైవేటు వ్యక్తి మొహిదొద్దీన్‌ గురించి కస్టడీలో రాంచందర్‌, కల్యాణ్‌ నుంచి సమాచారం రాబట్టేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నారు. గొర్రెల పథకంలో ‘లోలోన’ సంస్థ ప్రమేయం ఏమిటీ, ఓ ప్రైవేటు వ్యక్తి కనుసన్నల్లో ప్రభుత్వ అధికారులు పనిచేసేలా ఎందుకు మౌకిక ఆదేశాలు ఇచ్చారనే విషయంపైనా వీరి నుంచి సమాధానాలు రాబట్టనున్నారు. కేసుకు ముందు, తర్వాత మొహిదొద్దీన్‌తో జరిగిన సంప్రదింపులు, అతడి అనుచరుల సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నారు. కాగా, మూడు రోజుల కస్టడీలో భాగంగా ఇద్దరు నిందితులను ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి, విచారణ అనంతరం తిరిగి సాయంత్రం జైలుకు తరలిస్తున్నారు. మంగళ, బుధ వారాల్లోనూ ఇదే తీరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించనున్నారు.

Updated Date - Jun 11 , 2024 | 03:54 AM