Share News

BRS Vs Congress: ఫోన్‌ ట్యాపింగ్‌తో.. కారు సీట్లకే ఎసరు?

ABN , Publish Date - Apr 03 , 2024 | 06:23 AM

ఎన్నికల్లో అక్రమాలు అంటే.. కేవలం ఓటర్లకు డబ్బులు పంచడం, ప్రలోభాలకు గురిచేయడం, రిగ్గింగ్‌ వంటివే కాదు! అధికార దుర్వినియోగమూ దానికిందికే వస్తుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. అధికారులను ప్రభావితం చేసి ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేయడం,

BRS Vs Congress: ఫోన్‌ ట్యాపింగ్‌తో.. కారు సీట్లకే ఎసరు?

 • ప్రత్యర్థుల కదలికలు, సంభాషణలపై పోలీసులతో బీఆర్‌ఎస్‌ పార్టీ నిఘా

 • టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లో డబ్బు తరలింపు

 • పోలీసుల రిమాండ్‌ రిపోర్టులో వెల్లడి

 • ఈ చర్యలన్నింటితో ఎన్నికల్లో విపక్షాలకు

 • సమానావకాశాలు లేకుండా చేసిన వైనం

 • అధికార దుర్వినియోగంతో.. గెలిచే కుట్ర

 • గతంలో ఇలాంటి ఆరోపణలతోనే ఇందిరపై

 • అనర్హత వేటు వేసిన అలహాబాద్‌ హైకోర్టు

 • బీఆర్‌ఎస్‌ గెలిచినచోట ప్రత్యర్థులు కోర్టును

 • ఆశ్రయిస్తే అదే తరహా తీర్పులు వచ్చే చాన్స్‌!

 • పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం

చట్టవిరుద్ధంగా విపక్ష నేతల ఫోన్‌ ట్యాపింగ్‌ (Phone Tapping) .. తద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వారి కదలికలపై నిఘా పెట్టడం, వారి ఆర్థికమూలాలపై దాడి చేయడం(ఇల్లీగల్‌ ప్రాక్టీసెస్‌).. ఎన్నికల్లో గెలుపు కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం, సొంతపార్టీ నేతల నగదు రవాణాకు టాస్క్‌ఫోర్స్‌ వాహనాలను వినియోగించడం (కరప్ట్‌ ప్రాక్టీసెస్‌).. ఎన్నికల్లో ప్రత్యర్థులకు సమానావకాశాలు లేకుండా చేయడం..

..2014 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన నిర్వాకాలివి. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షాత్తూ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న వివరాలు. ఇవన్నీచేసింది దేనికి? ఎన్నికల్లో గెలవడానికి. అధికారం చేజిక్కించుకోవడానికి. కానీ.. ఇంత చేసినా వచ్చింది 39 సీట్లు. గెలిచినవారిలో ఇద్దరు ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. ఒక ఎమ్మెల్యే చనిపోయారు. మిగిలినవి 36 సీట్లు. ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బయటపడుతున్న వాస్తవాల ఆధారంగా.. ఆయా సీట్లలో ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చాలా మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఎన్నికే చెల్లకుండా పోయే అవకాశం ఉందని రాజకీయ, న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ గుట్టు.. ప్రభాకర్‌రావుకే ఎరుక!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో అక్రమాలు అంటే.. కేవలం ఓటర్లకు డబ్బులు పంచడం, ప్రలోభాలకు గురిచేయడం, రిగ్గింగ్‌ వంటివే కాదు! అధికార దుర్వినియోగమూ దానికిందికే వస్తుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. అధికారులను ప్రభావితం చేసి ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేయడం, మళ్లీ గెలిచేందుకు అధికారయంత్రాంగాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం.. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమే. రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు.. అంతకన్నా ముందు దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో.. జరిగింది ఇదేనని ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో తాజాగా బయటపడిన సంగతి తెలిసిందే. విపక్షనేతలు, ఎన్నికల్లో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్‌ చేసి.. వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయం.. అస్మదీయుల నగదు రవాణాకు టాస్క్‌ఫోర్స్‌ వాహనాలను, పోలీసులను వాడుకోవడం.. ఇవన్నీ ప్రజాప్రాతినిధ్య చట్టంలో పేర్కొన్న ‘కరప్ట్‌ ప్రాక్టీసెస్‌’ కిందికే వస్తాయని రాజకీయ, రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. 1971లో ఇందిరాగాంధీ గెలిచినప్పుడు.. అధికార దుర్వినియోగం ద్వారానే ఆమె విజయం సాధించారంటూ రాజ్‌నారాయణ ఆమెపై కోర్టులో కేసు వేయగా.. కోర్టు ఆమెపై అనర్హత వేటు వేసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

అప్పట్లో ఏం జరిగిందంటే..

1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 352 సీట్లతో అజేయశక్తిగా నిలిచింది. రాయ్‌బరేలీ నుంచి ఇందిరాగాంధీ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఆ సీటులో సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ అభ్యర్థిగా ఆమెతో పోటీ పడ్డ రాజ్‌నారాయణ్‌.. తన గెలుపుపై చాలా విశ్వాసంతో ఉన్నారు. కానీ, ఫలితం అందుకు విరుద్ధంగా రావడం ఆయనకు షాక్‌. ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దారుణంగా దుర్వినియోగం చేయడమే తన ఓటమికి కారణమని భావించిన ఆయన.. అలహాబాద్‌ హైకోర్టులో ‘ఎన్నికల పిటిషన్‌’ దాఖలుచేశారు. ఎన్నికల పిటిషన్‌ అంటే.. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 80 ప్రకారం.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి అవినీతి విధానాలను అవలంబించినా, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినా.. ఆ అభ్యర్థిని అనర్హుడిగా/అనర్హురాలిగా ప్రకటించాలంటూ సదరు అభ్యర్థితో పోటీపడిన ప్రత్యర్థిగానీ, ఆ నియోజకవర్గంలోని ఓటరుగానీ హైకోర్టును ఆశ్రయించి వేసే పిటిషన్‌. 1971 ఏప్రిల్‌ 24న రాజ్‌నారాయణ ఈ పిటిషన్‌ వేశారు. ఇందిరాగాంధీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని.. సాయుధ దళాలు సహా ఎన్నికల ప్రచారంలో ఆమెకు పలువురు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, స్థానిక పోలీసులు సహకరించారని తన అప్పీలులో పేర్కొన్నారు. భారత వైమానిక దళం ఆమెకు విమానాలను, హెలికాప్టర్లను సమకూర్చిందని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123 (7) ప్రకారం అలా చేయడం ‘కరప్ట్‌ ప్రాక్టీసెస్‌’ కిందకు వస్తుందని.. అది అనర్హతకు తగిన కారణమని గుర్తుచేశారు. అలాగే.. ఆమె తన ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలను వాడుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసును విచారించిన అలహాబాద్‌ హైకోర్టు.. ఎన్నికల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినందున ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 123 (7) ప్రకారం ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్‌ 12న తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో.. ఉన్న సీటును కోల్పోవడమే కాక, ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా ఆమె కోల్పోయారు. దీనిపై ఇందిర సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ.. దేశ అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్‌ హైకోర్టు తీర్పును కొట్టివేయలేదు. ఎగ్జిక్యూషనల్‌ స్టే మాత్రమే ఇచ్చింది. దరిమిలా ఆమె దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ట్యాపింగ్‌ వ్యవహారం సైతం అంతకుమించి అధికార దుర్వినియోగం కిందికి వస్తుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసు తీవ్రత చూస్తే ఎమర్జెన్సీకి దారితీసిన నాటి వ్యవహారం కంటే ఎక్కువేనని అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికీ చాన్స్‌..

ఫోన్‌ ట్యాపింగేఅక్రమం, చట్ట విరుద్ధం అయితే.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు చట్టబద్ధంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు తీసుకెళ్తున్న డబ్బు వివరాలను సైతం ట్యాపింగ్‌ ద్వారా విని, ఆ సొమ్మును అడ్డుకోవడం ఎన్నికల అక్రమం కిందకే వస్తుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. అలా చేయడమంటే.. ఎన్నికల్లో ప్రత్యర్థుల కాళ్లు, చేతులు కట్టేసినట్టేనని, వారి విజయావకాశాలను దెబ్బతీయడమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. విపక్షాలు న్యాయపరంగా తమకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ అవసరాల కోసం బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని వస్తుంటే.. ట్యాపింగ్‌ ద్వారా తెలుసుకుని పట్టుకున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే తన ఫోన్‌ ట్యాప్‌ చేశారని సిరిసిల్ల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన కేకే మహేందర్‌ రెడ్డి ఇటీవలే ఆరోపించారు. అలాగే ఎన్నికల సందర్భంగా తమ ఫోన్‌లు ట్యాప్‌ అయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పటి అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం ద్వారా తాము ఓడిపోయామని పేర్కొంటూ వీరంతా హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత నిర్ణీత కాలవ్యవధిలోనే హైకోర్టును ఆశ్రయించి ఎలక్షన్‌ పిటిషన్‌ వేయాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. కానీ, ట్యాపింగ్‌ గుట్టు రట్టయిందే ఇప్పుడు కనుక.. ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఇప్పటికైనా ఆశ్రయించవచ్చని, కోర్టు కూడా వారి వాదనను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, కేసును విచారించే అవకాశం ఉన్నదని కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ అంటే..

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123వ సెక్షన్‌లో ఈ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ గురించి ఉంది. దాని ప్రకారం.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగానీ, వారి తరఫున పనిచేసే ఏజెంట్లుగానీ, అభ్యర్థుల అనుమతితో మరెవరైనాగానీ..

 • గెజిటెడ్‌ అధికారులు

 • స్టైపెండరీ జడ్జిలు, మేజిస్ట్రేట్‌లు

 • సాయుధ దళాల సభ్యులు

 • పోలీసులు

 • ఎక్సైజ్‌ అధికారులు

రెవెన్యూ అధికారులు, తదితరుల సహాయం తీసుకోవడం, తీసుకోవడానికి ప్రయత్నించడం, తీసుకోవడానికి ప్రేరేపించడం అవినీతి విధానాల కిందికే వస్తుంది. గత ప్రభుత్వం తన గెలుపు కోసం పోలీసుల ‘సేవ’లను అడ్డగోలుగా వాడుకున్న నేపథ్యంలో విపక్షాలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది.

Updated Date - Apr 03 , 2024 | 07:53 AM