Share News

Nalgonda: తప్పుడు పత్రాలతో రుణాలు..

ABN , Publish Date - Jun 09 , 2024 | 03:51 AM

అమాయకుల ఆధార్‌ కార్డులను సేకరించి వాటిలో చిరునామా మార్చడంతోపాటు వారి పేరిట తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి శనివారం తెలిపారు.

Nalgonda: తప్పుడు పత్రాలతో రుణాలు..

  • అమాయకుల ఆధార్‌ కార్డులు వాడుకున్న నిందితులు

  • ముగ్గురు నిందితుల అరెస్ట్‌.. రిమాండ్‌కు తరలింపు

  • నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి వెల్లడి

నల్లగొండ క్రైం, జూన్‌ 8: అమాయకుల ఆధార్‌ కార్డులను సేకరించి వాటిలో చిరునామా మార్చడంతోపాటు వారి పేరిట తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి శనివారం తెలిపారు. నిందితుల నుంచి 27 ఆధార్‌కార్డులు, రూ.1,32,600 నగదు, 44 సెల్‌ఫోన్లు, రెండు కార్లు, 83 పాన్‌కార్డులు, 18 సిమ్‌కార్డులు, 92 డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, 64 రబ్బర్‌ స్టాంపులు, 3 ల్యాప్‌టాప్‌లు, కలర్‌ ప్రింటర్‌, 9 బోగస్‌ సంస్థల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు.


నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం కురమర్తి గ్రామానికి చెందిన కాశమల్ల క్రాంతికుమార్‌ హైదరాబాద్‌లో సొంతంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టాడు. నష్టాలురావడంతో మూసేశాడు. అదే కంపెనీలో పనిచేసిన సిలివేరు సతీష్‌తో కలిసి సంపాదించాలనే దురుద్దేశంతో కొత్త దందాకు తెరలేపారు. సతీ్‌ష బాబాయి కాశమల్ల నాగరాజుకు తెలిసిన, చదువురాని అమాయకుల ఆధార్‌ కార్డులు తెప్పించుకున్నారు. వారికి కొంత డబ్బు ఇస్తామన్నారు. ఆధార్‌కార్డులో ఫొటోషా్‌పలో చిరునామాలను మార్చారు. వారి ఆధార్‌కార్డులతో పాన్‌కార్డులు తీసుకున్నారు. ఫోన్‌ నంబర్లను లింక్‌ చేసేందుకు కొత్త సిమ్‌కార్డులు తీసుకున్నారు. వాటితో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి పాసు పుస్తకాలు, చెక్‌ బుక్‌లు, ఏటీఎం కార్డులు తీసుకుని వారి వద్దనే ఉంచుకున్నారు.


తప్పుడు పత్రాలు సృష్టించి వీరంతా హైదరాబాద్‌లో ఉద్యోగస్తులని, వారి ఆదాయం అధికంగా చూపేందుకుకొన్ని లావాదేవీలు జరిపి సిబిల్‌ స్కోర్‌ పెరిగాక రుణాలు తీసుకున్నారు. క్రెడిట్‌ కార్డులూ తీసుకుని జల్సాలు చేశారు. బ్యాంకులకు తిరిగి సొమ్ము కట్టలేదు. దుప్పలపల్లికి చెందిన ఓ యువకుడు ఇచ్చిన సమాచారంతో నల్లగొండ పట్టణం చైతన్యపురి కాలనీకి చెందిన కాశమల్ల నాగరాజు, హైదరాబాద్‌ మణికొండలోని మాదాపూర్‌కు చెందిన ఆఫ్‌సాఫ్ట్‌ ఐటీ సొల్యూషన్స్‌ సీఈవో కాశమల్ల క్రాంతి, అదే కంపెనీకి చెందిన ఉద్యోగి సతీ్‌షను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

Updated Date - Jun 09 , 2024 | 03:51 AM