Share News

IND vs AFG: ధోని ఆల్‌టైమ్ రికార్డుపై రోహిత్ శర్మ గురి

ABN , Publish Date - Jan 10 , 2024 | 11:58 AM

భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ముందు పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా ఆడే చివరి ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడం గమనార్హం.

IND vs AFG: ధోని ఆల్‌టైమ్ రికార్డుపై రోహిత్ శర్మ గురి

మొహాలీ: భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ముందు పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా ఆడే చివరి ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడం గమనార్హం. దీంతో ప్రపంచకప్‌నకు ముందు తమ బలాబలాలను అంచనా వేసుకోవడానికి భారత్‌కు ఇదే చివరి అవకాశం. ఈ సిరీస్ ద్వారా టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. 14 నెలల తర్వాత ఈ సీనియర్లద్దరూ టీ20 జట్టులో కనిపించనున్నారు. దీంతో ఈ సిరీస్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మనే వ్యవహరించనున్నాడు.


ఈ సిరీస్ ద్వారా కెప్టెన్‌గా రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును సమం చేసే అవకాశాలున్నాయి. టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు ధోని 42 విజయాలు అందించాడు. కెప్టెన్‌గా భారత జట్టుకు రోహిత్ శర్మ 39 విజయాలు అందించాడు. దీంతో అఫ్ఘానిస్థాన్‌తో జరిగే సిరీస్‌లోని 3 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిస్తే కెప్టెన్‌గా ధోని రికార్డును రోహిత్ శర్మ సమం చేస్తాడు. కాగా ధోని 72 మ్యాచ్‌ల్లో 42 విజయాలు అందించగా.. ఇప్పటివరకు రోహిత్ శర్మ 51 మ్యాచ్‌ల్లోనే 39 విజయాలు అందించాడు. దీంతో టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా రోహిత్ విజయాల శాతం 76గా ఉంది. టీమిండియాకు అత్యధిక శాతంతో విజయాలు అందించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ ముందున్నాడు. 60 శాతంతో విజయాలు అందించిన విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. కాగా టీ20ల్లో టీమిండియాకు కోహ్లీ 50 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించగా 30 మ్యాచ్‌ల్లో గెలిచింది.

ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20లకు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్

Updated Date - Jan 10 , 2024 | 11:58 AM