Share News

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2024కు సూర్యకుమార్ యాదవ్ దూరం?

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:51 PM

ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు సూర్య దూరం కావడం ఖాయమైపోయింది.

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2024కు సూర్యకుమార్ యాదవ్ దూరం?

ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు సూర్య దూరం కావడం ఖాయమైపోయింది. సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లు ఆడడంపై కూడా సందేహాలు నెలకొన్నాయి. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఒకవేళ టోర్నీ మొత్తానికి దూరమైతే ముంబైకి అది కోలుకోలేని దెబ్బ అవుతుంది. సౌతాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ చీలమండ గాయానికి గురయ్యాడు. దీంతో త్వరలో అఫ్ఘానిస్తాన్‌తో ప్రారంభం కానున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇంతలోనే సూర్యకుమార్‌ను మరో అనారోగ్య సమస్య చుట్టుముట్టింది. ప్రస్తుతం సూర్య చీలమండ గాయంతోపాటు స్పోర్ట్స్ హెర్నియాతో కూడా బాధపడుతున్నాడు.


దీంతో ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో ఉన్న సూర్య ఇందుకు సంబంధించిన శస్త్ర చికిత్స కోసం మరో రెండు మూడు రోజుల్లోనే జర్మనీ వెళ్లనున్నాడు. జర్మనీలోని మ్యూనిచ్‌లో స్పోర్ట్స్ హెర్నియాకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. శస్త్ర చికిత్స అనంతరం సూర్యకు 3 నెలలపాటు విశ్రాంతి అవసరం ఉంటుంది. దీంతో రాబోయే రంజీ సీజన్‌తోపాటు ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచ్‌లకు కూడా సూర్యకుమార్ యాదవ్ దూరం కానున్నాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. దీంతో రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తే సూర్య ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలున్నాయి. నేరుగా టీ20 ప్రపంచకప్‌లోనే బరిలోకి దిగనున్నాడు. అయితే స్పోర్ట్స్ హెర్నియా అనేది భారత ఆటగాళ్లలో కొత్తేం కాదు. గత సంవత్సరం కేఎల్ రాహుల్ కూడా జర్మనీ వెళ్లి ఇందుకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దీంతో 2 నెలలపాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. కాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఐపీఎల్ 2024 నాటికి హార్దిక్ అందుబాటులో ఉంటాడని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య కూడా దూరం కావడం ముంబైకి పెద్ద దెబ్బే అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 12:51 PM