Share News

Budget Session: 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు.. మహిళా రైతులకు శుభవార్త?

ABN , Publish Date - Jan 11 , 2024 | 01:44 PM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజులపాటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

Budget Session: 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు.. మహిళా రైతులకు శుభవార్త?

ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను (Parliament Budget Session) నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజులపాటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సమావేశాల మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీజేపీ ప్రభుత్వం రెండో దఫా పరిపాలనలో ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు కావడం గమనార్హం. ఈ సారి సమావేశాల్లో పెదగా చట్ట సవరణలు ఉండకపోవచ్చు. కానీ ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా రైతులకు శుభవార్త చెప్పే అవకాశాలున్నాయి. మహిళా రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం(PM Kisan Samman Nidhi scheme) ద్వారా ప్రస్తుతం ఇచ్చే డబ్బులను రెట్టింపు చేసే అవకాశాలున్నాయి. ఈ దఫా సమావేశాలో ఇది కీలకం కానుంది. ఇటీవల జాతీయ మీడియాలో వెలువడిన కథనాల ప్రకారం భూ యజమానులైన మహిళా రైతులకు సంవత్సరానికి చెల్లిస్తున్న రూ.6 వేలను రూ.12 వేలకు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.12 వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.


ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ (ఓటాన్ అకౌంట్ బడ్జెట్)ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అందులో ఈ అంశాన్ని పొందపరచడంతోపాటు బడ్జెట్‌లో నిధులను కేటాయించే అవకాశాలున్నాయి. దీంతో రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళా రైతులకు సాధికారత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పుకోవచ్చు. తద్వారా రానున్న ఎన్నికల్లో లబ్ది పొందొచ్చనేది బీజేపీ వ్యూహాంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే 2047 నాటికి భారతదేశం 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. దీంతో మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచడానికి, మరింత ఉపాధిని సృష్టించడానికి ప్రభుత్వం తన మూలధన వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది. రాబోయే మధ్యంతర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అయితే చిన్నచిన్న సవరణలను తోసిపుచ్చలేము. భారతదేశాన్ని ప్రపంచంలోని ఉత్పాదక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అనుగుణంగా ప్రతిష్టాత్మకమైన ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కూడా ఊపందుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇలాంటి మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 02:12 PM