Share News

Delhi: కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నేడు ఆప్ నిరసనలు..

ABN , Publish Date - Mar 22 , 2024 | 07:23 AM

ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆమాద్మీ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆప్ నేతలు గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్, సందీప్ పాఠక్, అతిషి మర్లీనా వెల్లడించారు.

Delhi: కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నేడు ఆప్ నిరసనలు..

ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆమాద్మీ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆప్ (AAP) నేతలు గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్, సందీప్ పాఠక్, అతిషి మర్లీనా వెల్లడించారు. వీధుల నుంచి న్యాయస్థానం వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సుదీర్ఘ పోరాటం, త్యాగాల తర్వాత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, రాజ్యాంగం దేశంలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే హక్కును కల్పించిందన్నారు. కేజ్రీవాల్‌కు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని రాజకీయ కుట్రలో భాగంగా అరెస్ట్ చేశారని ఆప్ నేతలు ఆరోపించారు. ఎవరైనా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తామనేలా కేంద్రప్రభుత్వం తీరు ఉందని ఆప్ నేతలు ఆరోపించారు. బీజేపీ రాజకీయ కుట్రలకు పాల్పడటం ద్వారా కోట్లాదిమంది ప్రజలను అవమానించిందన్నారు.

Delhi CM: కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా, కొత్త సీఎం వస్తారా?

నేడు బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన

అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ ద్వారా.. ఆప్‌ను నాశనం చేస్తామనే సంకేతాలు ఇవ్వడం ద్వారా ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆప్ నేతలు పేర్కొన్నారు. అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా ప్రజాస్వామ్య వాదులంతా కలిసి పోరాటం చేస్తామన్నారు. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఈరోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలపాలని నిర్ణయించామని, దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతాయని ఆప్ నేతలు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2024 | 07:23 AM