Share News

Chandrababu Naidu: చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు కామెంట్స్..

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:37 PM

వైసీపీ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. కావలి, బనగానపల్లిలో నిర్వహించిన సభల్లో సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Chandrababu Naidu: చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు కామెంట్స్..

వైసీపీ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. కావలి, బనగానపల్లిలో నిర్వహించిన సభల్లో సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సభలకు వచ్చిన జనాన్ని చూసి జగన్ కు రాత్రి నిద్ర కూడా పట్టదని ఎద్దేవా చేశారు. చేసిన పాపాలు ఊరికే పోవని సైకో జగన్ ను చిత్తుచిత్తుగా ఓడించే రోజులు దగ్గర పడ్డాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. టీడీపీ ( TDP ) ఆవిర్భవించి సుపరిపాలన అందించిన ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడూ తమపైనే ఉంటాయని.. 42 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో తెలుగు జాతికి గుర్తింపు తీసుకువచ్చామని చంద్రబాబు వివరించారు. ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయడానికే ప్రజాగళం యాత్రలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.

దుర్మార్గుడి పాలనలో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేశారన్నారు. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అని మండిపడ్డారు. జాబు కావాలంటే బాబు రావాలని చెప్పారు. కూలీలకు ఉపాది దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకూ జీతాలు రావడం లేదని, ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు జగన్ ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యతిరేక తుపాను తాకిడికి ఫ్యాన్ కొట్టుకుపోతుందన్నారు. తన జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని కానీ జగన్ లాంటి ముఖ్యమంత్రి వస్తాడని ఊహించలేదని చంద్రబాబు వివరించారు.

Elections 2024: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు.. ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు అందాయంటే..


రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. జగన్ కు ప్రజాస్వామ్యం, వ్యవస్థలపై నమ్మకం లేదు. చట్టాలపై గౌరవం లేదు. తెలిసిందంతా దోపిడీ చేసి దోచుకోవడమే. పేటిఎం బ్యాచ్ ను తయారు చేసి జనం మీదకు వదులుతున్నారు. జగన్ ను ఎదురించి మాట్లాడితే వాళ్లను సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడు. కేసు పెట్టి జైలులో వేస్తారు. చంపేందుకూ ప్రయత్నిస్తారు. రాష్ట్రంలో స్వేచ్చగా బతికే పరిస్థితి లేదు. సొంత బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చారు. తన నాన్నను చంపిన వారిపై కేసులు పెట్టాలని సొంత చెల్లెలు అడిగితే ఆమె పైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించి ఆయనను రాజకీయాల్లో లేకుండా చేస్తేనే అందరూ బాగుపడతారు. మహిళకు ఆస్తిలో సమాన వాటా ఇచ్చిన పార్టీ టీడీపీ. మేము అధికారంలోకి వస్తే ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తాం. దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. రైతులకు సంవత్సరానికి రూ.20 వేలు ఇస్తాం.

- చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

నిన్నటి వరకు పరదాలు కట్టుకుని తిరిగిన సీఎం జగన్ ఇప్పుడు బుల్లెట్ ఫ్రూఫ్ బస్సులో తిరుగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 12 లక్షల టిడ్కో ఇళ్లు కడితే పేదలకు ఇవ్వకుండా రూ. 500 కోట్లతో రుషికొండలో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించారు. తాను సైకో జగన్ లాంటి వాడిని కాదని పేద పిల్లలను చదివించిన పార్టీ టీడీపీ అని గుర్తు చేసుకున్నారు. దేశంలో ధనిక ముఖ్యమంత్రిగా పేరున్న ఆంధ్రప్రదేశ్ నిండా పేదలే ఉన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టేందుకు ప్రజలు సిద్దమయ్యారన్న చంద్రబాబు ప్రస్తుత సీఎం ఇక ఇంటికే అని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 06:38 PM