Share News

AP Elections 2024: సిట్టింగ్‌లపై వ్యతిరేకత.. ఈసారి శ్రీకాకుళం లెక్క మారుతుందా..

ABN , Publish Date - Mar 21 , 2024 | 09:55 AM

ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాల్లో ఒకటి శ్రీకాకుళం. గ్రామీణ వాతావరణం ఎక్కువుగా ఉండే ఈ జిల్లాలో ఇప్పటికీ వెనుకబాటు తనం ఎక్కువే. ఇంకా సరైన రహదారులు లేని గ్రామాలు శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో కనిపిస్తుంటాయి.

AP Elections 2024: సిట్టింగ్‌లపై వ్యతిరేకత.. ఈసారి శ్రీకాకుళం లెక్క మారుతుందా..

ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాల్లో ఒకటి శ్రీకాకుళం. గ్రామీణ వాతావరణం ఎక్కువుగా ఉండే ఈ జిల్లాలో ఇప్పటికీ వెనుకబాటుతనం ఎక్కువే. ఇంకా సరైన రహదారులు లేని గ్రామాలు శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో కనిపిస్తుంటాయి. ఈ జిల్లా ఎంతో కొంత అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం కింజరాపు ఎర్రన్నాయుడు. ఈ కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగుదేశం పార్టీ (TDP) వ్యవస్థాపకులు దివంగత నేత ఎన్టీఆర్ ఈ జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఇది గతం. ప్రస్తుతం శ్రీకాకుళం రాజకీయాలు చూస్తే.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో 6 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిస్తే.. 2 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఒక్క అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి ఘన విజయాన్ని అందించారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని 6 చోట్ల వైసీపీ అభ్యర్థులను గెలిపించారు.

ఇచ్చాపురం, టెక్కలిలో టీడీపీ అభ్యర్థులు బెందాళం అశోక్, కింజరాపు అచ్చెన్నాయుడు గెలుపొందారు. పలాస, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస, ఎచ్చెర్ల, నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే మరొకరు స్పీకర్‌గా ఉన్నారు. అయితే గత 5 ఏళ్లలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి ఇక్కడి నేతలు చేసిన కృషి ఏమి లేదనే ప్రచారం సాగుతోంది.

అభివృద్ధి ఎక్కడ..

శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం గురించి చెప్పాల్సిన పనేలేదు. ఇప్పటికీ బస్సు ఎక్కాలంటే తమ గ్రామం నుంచి రెండు, మూడు కిలోమీటర్లు నడిచి రావాల్సిన పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. విద్య, వైద్య సౌకర్యాలు ఆశించిన స్థాయిలో లేవు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్దగా సౌకర్యాలు లేవని ఇక్కడికి వచ్చే రోగులు ఆరోపిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం విశాఖపట్టణం వెళ్లాల్సిన పరిస్థితి. జిల్లాలో పేరుకు విశ్వవిద్యాలయం ఉన్నా.. తగిన స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించడం లేదు.

రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం..

స్వచ్ఛ భారత్‌లో భాగంగా బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన లక్ష్యంగా ప్రతి కుటుంబం స్వచ్ఛాలయాలు నిర్మించుకునేందుకు నిధులు ఇస్తుంది. ఇవి కట్టించే బాధ్యతను రాష్ట్రప్రభుత్వానికి అప్పగించింది. శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో స్వచ్ఛాలయాల నిర్మాణం జరగలేదు. శ్రీకాకుళం పట్టణానికి సమీపంలో ఉండే గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.

ఈసారి లెక్క మారుతుందా..

ఐదేళ్ల వైసీపీ పాలనను చూసిన తర్వాత ఇక్కడి ప్రజలు స్థానిక ఎమ్మెల్యేలపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. తమ ప్రాంతాలను అభివృద్ధి చేయలేదని, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించలేకపోయారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆరుగురికి వైసీపీ తిరిగి ఈ ఎన్నికల్లో టికెట్లు కేటాయించింది. దీంతో వీళ్లంతా ఈసారి గెలవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవచ్చని, గతంలో వచ్చిన ఫలితాలు రివర్స్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. ఆముదాలవలస, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లో అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ గెలిచే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ఎమ్మెల్యేలపై ప్రజలు విసుగెత్తి పోయి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో ఈసారి లెక్క మారుతుందనే ప్రచారం జరుగుతోంది.

AP Elections 2024: ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. కష్టమేగా జగన్!!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 21 , 2024 | 10:59 AM