Share News

AP Elections: ఎవరీ పద్మావతి.. కొడాలి నాని విషయంలో ఎందుకింత హైలైట్ అవుతున్నారు..!?

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:15 AM

ఎవరీ పద్మావతి.. ఇప్పుడీ ఈ పేరు ఒక్క గుడివాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె.. ఎందుకింతలా హైలైట్ అవుతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..

AP Elections: ఎవరీ పద్మావతి.. కొడాలి నాని విషయంలో ఎందుకింత హైలైట్ అవుతున్నారు..!?

  • నామినేషన్‌ టెన్షన్‌..!

  • అధికార, విపక్ష అభ్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు

  • గుడివాడలో కొడాలి నాని నామినేషన్‌పై ఫిర్యాదు

  • పట్టించుకోని రిటర్నింగ్‌ అధికారి.. ఫిర్యాదు స్వీకరణకు నో

  • మైలవరంలో వసంత నామినేషన్‌పై అభ్యంతరాలు

ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు నామినేషన్‌ పరిశీలన ప్రక్రియ టెన్షన్‌ పెట్టింది. గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌లో తప్పులున్నాయంటూ టీడీపీ నాయకులు ఆధారాల సహా ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్‌ అధికారి ఏకపక్షంగా వ్యవహరించి కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నానీని (Kodali Nani) ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించాలని రిటర్నింగ్‌ అధికారికి టీడీపీ నాయకుడు తులసి శుక్రవారం ఫిర్యాదు చేశారు. గుడివాడ మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్సులో కొడాలి నాని తన క్యాంప్‌ ఆఫీసు నిర్వహించారు. ఇటీవల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక క్యాంప్‌ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ నోటీసు ఇవ్వడంతో నాని క్యాంప్‌ ఆఫీసును ఖాళీ చేశారు. అయితే, నామినేషన్‌లో తాను ప్రభుత్వ వసతి ఉపయోగించుకోలేదని పేర్కొన్నారు. ఇలా పేర్కొనడం నిబంధనలకు విరుద్ధమని తులసి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ ఫిర్యాదును రిటర్నింగ్‌ అధికారి తీసుకోలేదు. ఆర్వో తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని అఫిడవిట్‌లో తప్పుడు సమాచారమిచ్చారని, తమకు అభ్యంతరాలు తెలిపే సమయం కూడా ఇవ్వకుండా ఆర్వో ఏకపక్షంగా వ్యవహరించారని, ఆమె వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకుడు, ఫిర్యాదుదారు కె.తులసీబాబు ఆరోపించారు. కొడాలి నాని నామినేషన్‌ పత్రాల్లో అసలు ఎటువంటి ప్రభుత్వ ఆస్తులను వినియోగించుకోలేదని పేర్కొన్నారని, కానీ, పాత మున్సిపల్‌ కార్యాలయాన్ని ఐదేళ్లుగా సొంత జాగీరులా వినియోగించుకున్నారని, ఈ విషయాన్ని అఫిడవిట్‌లో పేర్కొన లేదన్నారు. అలాగే, నానీపై ఉన్న ఐదు క్రిమినల్‌ కేసుల్లో మూడింటి సమాచారం మాత్రమే ఇచ్చారని, మరో రెండు కేసుల సమాచారాన్ని అసంపూర్తిగా పేర్కొన్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని స్క్రూటినీ సమయంలో తెలిపేందుకు ప్రయత్నించగా, ఆర్వో అసలు పట్టించుకోలేదన్నారు. తమపై నోరు పారేసుకున్నారని ఆరోపించారు. తాను సంతకం చేయక ముందే అభ్యంతరం తెలపాలని ఉచిత సలహా ఇచ్చారన్నారు.

Attack On Jagan: గులకరాయిలో రహస్యమేంటి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!?Padmavathi.jpg

ఆర్వో తీరుపై విమర్శలు

గుడివాడ ఆర్డీవో పి.పద్మావతి రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆమె తొలి నుంచి వైసీపీకి (YSR Congress) అనుకూల వైఖరితో ఉన్నారని టీడీపీ (Telugu Desam) నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న నాని ఇళ్ల పట్టాల విషయంలో ఆర్‌డీవోకు ఫోన్‌ చేయగా, వాట్సాప్‌ కాల్‌ చేయాలని ఆమె తెలిపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. గుడ్లవల్లేరు మండలం కుచ్చికాయలపూడి గ్రామానికి చెందిన దివ్యాంగుడు కొడాలి వెంకటేశ్వరరావు నామినేషన్‌ దాఖలు చేయడానికి వస్తే అతనిపై చిందులు తొక్కి, దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. క్రిమినల్‌ కేసు బనాయిస్తానని ఆర్డీవో తనను బెదిరించినట్లు కొడాలి వెంకటేశ్వరరావు ఆరోపించారు. తాజాగా కొడాలి నాని అఫిడవిట్‌లోని అభ్యంతరాలను మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కె.తులసీబాబులు లెవనెత్తేందుకు ప్రయత్నిస్తే కనీసం అవకాశం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా నాని నామినేషన్‌ పత్రాలు సవ్యంగా ఉన్నాయని సర్టిఫై చేయడం విమర్శలకు తావిస్తోంది.

ఓహ్.. ఇందుకేనా..?

ఇదిలా ఉంటే.. కొడాలి నానినే పద్మావతికి గుడివాడలో పోస్టింగ్ ఇప్పించారనే టాక్ గట్టిగానే నడుస్తోంది. అందుకే ఇలా నానిపై స్వామి భక్తి ప్రదర్శిస్తూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క నామినేషన్ విషయంలోనే కాదు.. పోస్టింగ్ వచ్చిన నాటి నుంచి అన్నీ వైసీపీకి అనుకూల నిర్ణయాలే తీసుకుంటున్నారనే చర్చ గుడివాడలో నడుస్తోంది. ఈ పరిస్థితులు ఈమెపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Kodali-And-Jagan.jpg

మరికొన్నిచోట్ల..

మైలవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌, ఆయన భార్య వేసిన నామినేషన్లను తిరస్కరిం చాలని న్యాయవాది, స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగపవన్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. ఆర్వో నాలుగు సెట్ల నామినేష న్లను మాత్రమే అనుమతిస్తామని చెప్పినా వసంత ఐదు సెట్లు వేశారని ఆరోపించారు. తనపై ఉన్న క్రిమినల్‌ కేసులు, ఆస్తుల వివరాలను కూడా దాచారని అభియోగం చేశారు. నోటరీ అఫిడవిట్‌లో తేదీలు లేవని పేర్కొన్నారు. వసంత సతీమణి శిరీష సైతం తప్పుగా నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారని తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను ఆర్వో తోసిపుచ్చారు. అలాగే, గన్నవరంలో వైసీపీ అభ్యర్థి వంశీ నామినేషన్‌పై టీడీపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా, వాటిని ఆర్వో తోసిపుచ్చారు. నందిగామలో స్వతంత్ర అభ్యర్థి తంగిరాల సౌమ్య నామినేషన్‌ తిరస్కరణకు గురైంది.

Read National News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 11:23 AM