Share News

AP Politics: ఊరు చిన్నదే.. అందరూ రాజకీయ ఉద్ధండులే..

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:15 AM

నియోజకవర్గంలోని ఓ చిన్న గ్రామం బందలాయి చెరువు(Bandalaicheruvu). పేరుకి చిన్నదే అయినా రాజకీయ చైతన్యానికి కొదవలేదు. అవనిగడ్డ(Avanigadda) శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం నుంచి దివంగత మాజీమంత్రి సింహాద్రి సత్య నారాయణరావు(Simhadri Satyanarayana Rao) వరుసగా మూడు సార్లు అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు

AP Politics: ఊరు చిన్నదే.. అందరూ రాజకీయ ఉద్ధండులే..
Andhra Pradesh

అవనిగడ్డ, ఏప్రిల్ 18: నియోజకవర్గంలోని ఓ చిన్న గ్రామం బందలాయి చెరువు(Bandalaicheruvu). పేరుకి చిన్నదే అయినా రాజకీయ చైతన్యానికి కొదవలేదు. అవనిగడ్డ(Avanigadda) శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం నుంచి దివంగత మాజీమంత్రి సింహాద్రి సత్య నారాయణరావు(Simhadri Satyanarayana Rao) వరుసగా మూడు సార్లు అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. అలాంటి గ్రామం నుంచి వచ్చే ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండటం, అదీ ఒకే ఇంటి పేరు వారవటం విశేషం. ఎమ్మెల్యేగా ఉన్న రమేష్‌ బాబు మరోమారు ఎన్నికల బరిలోకి దిగుతుండగా, మాజీ మంత్రి దివంగత సింహాద్రి సత్యన్నారాయణ తనయుడు, ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ రావు మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.


ఇక హైదరాబాద్‌లో నివాసముంటున్న ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి వచ్చే ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పవన్‌ కల్యాణ్‌పై పోటీ చేయనున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచారు. వీరేకాక ఇదే గ్రామంలో పుట్టి బాల్యంలో ఇక్కడే గడిపిన మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి, ఆయన సోదరుడు అంబటి మురళి పొన్నూరు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. వారి తల్లి స్వగ్రామం బందలాయి చెరువు కావటంతో వారు ఇక్కడే పుట్టడం, బాల్యం గడపటంతో ఈ గ్రామం నుంచి వచ్చే ఎన్నికల్లో మొత్తం ఐదుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్టయింది.


వీరిలో సింహాద్రి రమేష్‌ బాబు, డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌, తమన్నా సింహాద్రి పూర్తిగా ఇక్కడివారే. కాగా మిగిలిన ఇద్దరూ తమ బాల్యాన్ని ఇక్కడ గడిపిన వారవటంతో ఈ చిన్న శివారు గ్రామం తమ నేతల కర్మాగారమని స్థానికులు సరదాగా పక్క గ్రామాల వారితో చతురులాడుతూ ఉంటారు. వీరిలో నలుగురు వైసీపీ నుంచే పోటీ చేస్తుండగా తమన్నా సింహాద్రి మాత్రం ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈ గ్రామం నుంచి వచ్చిన పర్చూరి అశోక్‌ బాబు ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేసి అనంతరం టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇదండీ పట్టుమని 200 గడపలు కూడా లేని బందలాయి చెరువు గ్రామ రాజకీయ ప్రాశస్త్యం.


ఇవికూడా చదవండి:

మస్త్ కిక్ ఇస్తున్న బెజవాడ బ్రదర్స్ పొలిటికల్ వార్.. గెలుపెవరిది?!

జగన్ బస్సు యాత్ర ఉంటే.. ఆ ఏరియాలో ఎవరూ బతకొద్దా?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 18 , 2024 | 11:15 AM