Share News

CBN Vs Jagan: ఏపీ మూడ్ మారింది.. గెలుపెవరిదో తేలిపోయిందిగా!

ABN , Publish Date - Mar 19 , 2024 | 11:12 AM

ఏపీలో ఎన్నికల యుద్ధం మొదలైంది. షెడ్యూల్‌ విడుదలతో రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఐదేళ్ల తమ భవిష్యత్తును తామే రాసుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఏ పార్టీకి అధికారం వస్తుంది..? ఏపీ కాబోయే సీఎం (AP CM) ఎవరు..? ఇదే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ప్రజల మూడ్ మారినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనే విషయం అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

CBN Vs Jagan: ఏపీ మూడ్ మారింది.. గెలుపెవరిదో తేలిపోయిందిగా!

ఏపీలో ఎన్నికల యుద్ధం మొదలైంది. షెడ్యూల్‌ విడుదలతో రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఐదేళ్ల తమ భవిష్యత్తును తామే రాసుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఏ పార్టీకి అధికారం వస్తుంది..? ఏపీ కాబోయే సీఎం (AP CM) ఎవరు..? ఇదే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ప్రజల మూడ్ మారినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనే విషయం అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బటన్లు నొక్కుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు (Welfare schemes) అందిస్తున్నానంటూ వైసీపీ అధినేత జగన్ (Jagan) చెబుతున్నా.. ప్రజలు మాత్రం ఆయన పాలనపై వ్యతిరేకతతో ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు పల్లెల్లో ప్రజల మాటగా వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల మూడ్ తెలుసుకుంటున్న వైసీపీ నాయకులు సైతం షాక్ అవుతున్నారట. పైకి తాము గెలుస్తామని చెబుతున్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం వైసీపీ అభ్యర్థులపై సానుకూలత లేన్నట్లు తెలుస్తోంది.

ఐదేళ్లలో వైఫల్యాలు..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధిని పూర్తిగా మరిచిపోయిందని ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఎంపిక చేసుకున్న పథకాలు మినహా.. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు వంటి విషయాలను అసలు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త రహదారుల నిర్మాణం పక్కన పెడితే.. పాడైన రహదారులకు మరమ్మతులు చేయించేలేకపోయారనే అపవాదు వైసీపీ ప్రభుత్వంపై ఉంది. మరోవైపు ధరలు పెరుగుదల, ప్రజల ఆదాయం పెరగకపోవడం, కొనుగోలు స్థాయి పెరగకపోవడంతో ఓటర్లు జగన్ పాలనపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. చేసేది కొంచెం.. చెప్పుకునేది ఎక్కువ అనే రీతిలో ఈ ఐదేళ్ల పాలన సాగిందనే అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది.

విపరీతమైన అప్పులు..

ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల రాష్ట్రంగా మార్చేసిందనే ప్రధాన ఆరోపణను జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ప్రస్తుతం రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్లు దాటిందని.. ఉద్యోగుల జీతాలు ఇవ్వాలన్న అప్పులపైనే ఆధారపడాల్సిన పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పుకుంటున్నా.. జగన్‌పై ప్రజలు విశ్వాసంతో లేరనే విషయం అర్థమవుతోంది.

స్థానిక నేతల అరాచకాలు..

వైసీపీ స్థానిక నేతల తీరుపై ప్రజలు విసుగెత్తిపోయినట్లు తెలుస్తోంది. లోకల్ లీడర్లు సైతం ప్రభుత్వం అండ చూసుకుని పేద ప్రజల భూములు కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. మహిళలపై దాడులు పెరిగాయని, శాంతిభద్రతల విషయంలో వైసీపీ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహారిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ అంశం జగన్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇద్దరిలోనూ స్పష్టమైన తేడా..!

గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాలన చూసిన ఏపీ ప్రజలు ప్రస్తుత జగన్ పాలనపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేవారని, మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేసేవారని ఆయన పాలనను చూసిన ప్రజలు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడులో కనిపించే విజన్.. జగన్‌లో ఒక శాతం కూడా లేదని టీడీపీ నాయకులు అంటున్నారు. బాబు-జగన్‌కు అసలు పోలికే లేదని.. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తే.. జగన్ తన స్వార్థ ప్రయోజనాలు, అధికారం కోసం కాక్షించే వ్యక్తి అనే విమర్శలు ఉన్నాయి. దీంతో మరోసారి చంద్రబాబు పాలనను ఏపీ ప్రజలు చూడాలనే ఆశతో ఉన్నట్లు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది.

ప్రజల మూడ్‌లో మార్పు!

ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడ్‌లో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. వైసీపీకి అధికారం ఇస్తే గెలిచిన మరుసటి రోజు నుంచి అప్పుల కోసం కేంద్రప్రభుత్వం చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుందని, అదే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిస్తే.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను నేరుగా రాష్ట్రానికి తీసుకురాగలిగే చాతుర్యం చంద్రబాబు నాయకత్వానికి ఉందని ఏపీ ప్రజలు నమ్ముతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు గ్రామాల్లో చర్చ జరుగుతోంది. ఫైనల్‌గా ఏపీ ప్రజలు ఎటున్నారు..? ఎవర్ని సీఎం పీఠంపై కూర్చోబెడతారనే విషయం తెలియాలంటే జూన్-4 వరకూ వేచి చూడాల్సిందే మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 19 , 2024 | 12:45 PM