ODI World Cup: ఏడుగురు బ్యాటర్లు, నలుగురేసి చొప్పున స్పిన్నర్లు, పేసర్లు.. టీమిండియా వరల్డ్‌కప్ టీం ఇదే?

ABN , First Publish Date - 2023-08-09T17:15:28+05:30 IST

సరిగ్గా మరో 2 నెలల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఇందుకోసం టోర్నీలో పాల్గొనే జట్లు 15 మందితో కూడిన తమ తొలి స్క్వాడ్‌ వివరాలను ఐసీసీకి సెప్టెంబర్ 5 లోపు అందివ్వాలి. తుది స్వ్కాడ్ వివరాలు సెప్టెంబర్ 27లోపు తెలపాల్సి ఉంటుంది. ఈ లోపు ముందుగా ప్రకటించిన స్క్వాడ్‌లో ఎన్ని మార్పులైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ODI World Cup: ఏడుగురు బ్యాటర్లు, నలుగురేసి చొప్పున స్పిన్నర్లు, పేసర్లు.. టీమిండియా వరల్డ్‌కప్ టీం ఇదే?

సరిగ్గా మరో 2 నెలల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఇందుకోసం టోర్నీలో పాల్గొనే జట్లు 15 మందితో కూడిన తమ తొలి స్క్వాడ్‌ వివరాలను ఐసీసీకి సెప్టెంబర్ 5 లోపు అందివ్వాలి. తుది స్వ్కాడ్ వివరాలు సెప్టెంబర్ 27లోపు తెలపాల్సి ఉంటుంది. ఈ లోపు ముందుగా ప్రకటించిన స్క్వాడ్‌లో ఎన్ని మార్పులైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఒకటే చర్చ నడుస్తోంది. అది ఏంటంటే రానున్న వన్డే ప్రపంచకప్‌నకు టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండబోతుంది? 15 మంది స్క్వాడ్‌లో ఎవరెవరికీ చోటు దక్కబోతుందని చర్చించుకున్నారు. అయితే విశ్లేషకులు అంచనా ప్రకారం ప్రపంచకప్‌నకు ముందు జరిగే ఆసియా కప్‌, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టునే ప్రపంచకప్ బరిలో నిలిపే అవకాశాలున్నాయి. కాగా ఆసియాకప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం 18 లేదా 19 మందితో కూడిన టీమిండియా స్క్వాడ్‌ను సెలెక్టర్లు ఈ నెల 16 లేదా 17న ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. సెప్టెంబర్ 27న జరిగే మూడో వన్డేతో ఆస్ట్రేయాతో టీమిండియా సిరీస్ ముగియనుంది. అదే రోజున ప్రపంచకప్ ఆడే తుది జట్టు వివరాలు ఐసీసీకి అందిచడానికి చివరి అవకాశం కావడం గమనార్హం.


ప్రపంచకప్‌నకు టీమిండియా 15 మందితో కూడిన స్క్వాడ్ ఎలా ఉండబోతుందనే విషయానికొస్తే.. ముందుగా బ్యాటింగ్ విషయంలో గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న కీలక ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. రాహుల్ కోలుకున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. అతను బ్యాటింగ్, కీపింగ్ చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే శ్రేయస్ గాయంపై మాత్రం ఎలాంటి అప్‌డేట్స్ లేవు. కాగా వీరిద్దరు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోనే కోలుకుంటున్నారు. దీంతో వీరు ఆసియాకప్‌లో ఆడే అవకాశాలున్నాయి. ఇక రోహిత్, గిల్, కోహ్లీ స్థానాలకు ఢోకా లేదు. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. కిషన్‌కు సబ్‌స్ట్యూట్‌గా సంజూ శాంసన్‌ను కూడా ఎంపిక చేసిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అయితే రాహుల్ కూడా కీపింగ్ చేయగలడనే సంగతి తెలిసిందే. దీంతో రాహులే కీపింగ్ బాధ్యతలు చేపడితే ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో అవకాశం రాకపోవచ్చు.

ఇక పేస్ డిపార్ట్‌మెంట్ విషయానికొస్తే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఎంపిక ఖాయమనే చెప్పుకోవాలి. గాయం కారణంగా చాలా కాలంగా క్రికెట్‌‌కు దూరంగా ఉన్న బుమ్రా ఇటీవల కోలుకున్నాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో సైతం బుమ్రా బరిలోకి దిగుతున్నాడు. వీరి ముగ్గురితోపాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా నాలుగో పేసర్‌గా ఉపయోగపడనున్నాడు. అయితే వీరితోపాటు ఆసియాకప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు శార్దూల్ ఠాకూర్ లేదా ముఖేష్ కుమార్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇద్దరికీ కూడా అవకాశం రావొచ్చు. అయితే బ్యాటింగ్ కూడా చేయగలడం శార్దూల్‌కు ప్లస్ పాయింట్ అవనుంది. ఇక స్పిన్ కోటాలో ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఖాయం కాగా.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఉంటాడు. అయితే మరో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్, చాహల్‌కు పోటీ నెలకొననుంది. బ్యాటింగ్ చేయగలడం అక్షర్ పటేల్‌కు ప్లస్ పాయింట్ కాగా.. సీనియర్ స్పిన్నర్ కావడం చాహల్‌కు ప్లస్ పాయింగ్‌గా చెప్పుకోవచ్చు. దీంతో ఆసియాకప్‌నకు వీరిద్దరిని ఎంపిక చేసినా.. వరల్డ్‌కప్‌నకు ఇద్దరిలో ఒకరికే అవకాశం ఉండొచ్చు. దీంతో ఎవరినీ ఎంపిక చేయాలనేది సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి. అయితే ఇద్దరినీ ఎంపిక చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.

అయితే ప్రపంచకప్‌నకు ఆసియాకప్ టీం నుంచే 15 మందిని ఎంపిక చేసినప్పటికీ.. మిగిలిని వారిని నెట్ ప్రాక్టీస్ ఆటగాళ్లుగా టీం వెంటనే ఉంచొచ్చు. మొత్తంగా ఐదుగురు బ్యాటర్లు, ఇద్దరు వికెట్ కీపర్లు, నలుగురు పేసర్లు, నలుగురు స్పిన్నర్లతో కూడిన భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇందులోనే ఇద్దరు ఆల్‌రౌండర్లు కూడా ఉండనున్నారు. ఇద్దరు వికెట్ కీపర్లు బ్యాటింగ్ కూడా చేస్తారు. కాబట్టి మొత్తంగా ఏడుగురు బ్యాటర్లు ఉండే అవకాశాలున్నాయి. వీరికి తోడు ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు.

ప్రపంచకప్‌నకు ఎంపికయ్యే భారత జట్టు(అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యజుర్వేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్/సంజూ శాంసన్.

ఇక ఆసియాకప్‌నకు వీరితోపాటు ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్‌, సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-08-09T18:16:22+05:30 IST