IND vs AUS 2nd ODI: 3 వేల సిక్సులతో చరిత్ర సృష్టించిన టీమిండియా!

ABN , First Publish Date - 2023-09-24T21:22:11+05:30 IST

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫోర్లు, సిక్సులతో పరుగుల వరద పారించారు. దాదాపు ప్రతి బ్యాటర్ సిక్సులు బాదాడు.

IND vs AUS 2nd ODI: 3 వేల సిక్సులతో చరిత్ర సృష్టించిన టీమిండియా!

ఇండోర్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫోర్లు, సిక్సులతో పరుగుల వరద పారించారు. దాదాపు ప్రతి బ్యాటర్ సిక్సులు బాదాడు. టీమిండియా ఆటగాళ్లంతా కలిసి ఈ మ్యాచ్‌లో ఏకంగా 18 సిక్సులు బాదారు. ఇందులో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే 6 సిక్సులు కొట్టాడు. శుభమన్ గిల్ 4 సిక్సులు కొట్టగా.. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మూడేసి సిక్సులు కొట్టారు. ఇషాన్ కిషన్ రెండు సిక్సులు కొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో కొట్టిన 18 సిక్సుల ద్వారా భారత క్రికెట్ జట్టు వన్డేల్లో 3 వేల సిక్సులను పూర్తి చేసుకుంది. ఈ ఘనత ఇప్పటివరకు ఏ జట్టు సాధించలేదు. దీంతో వన్డేల్లో ఈ మార్కు అందుకున్న తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.


ఇక ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగారు. శ్రేయస్ అయ్యర్(105), శుభమన్ గిల్(104) సెంచరీలతో దుమ్ములేపారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సూర్యకుమర్ యాదవ్, కేఎల్ రాహుల్(52) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. సూర్యకుమార్ యాదవ్ అయితే తన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో టీ20 స్టైల్‌లో చెలరేగాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవర్‌లో అయితే వరుసగా 4 సిక్సులు బాదాడు. దీంతో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 6 ఫోర్లు, 6 సిక్సులతో 37 బంతుల్లోనే 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో మొత్తంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

Updated Date - 2023-09-24T21:28:43+05:30 IST