World cup: షమీ లేదా అశ్విన్.. అఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

ABN , First Publish Date - 2023-10-11T11:10:36+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పసికూన అఫ్ఘనిస్థాన్‌తో నేడు టీమిండియా తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

World cup: షమీ లేదా అశ్విన్.. అఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

ఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పసికూన అఫ్ఘనిస్థాన్‌తో నేడు టీమిండియా తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. కింగ్ విరాట్ కోహ్లీకి ఇది హోంగ్రౌండ్ కావడంతో అతను మరోసారి చెలరేగే అవకాశాలున్నాయి. అటు అభిమానులు సైతం మైదానంలో కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గతంలో ఇక్కర 7 వన్డేలు ఆడిన కోహ్లీ 6 ఇన్నింగ్స్‌ల్లో 44 సగటుతో 222 పరుగలు చేశాడు. అందులో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా అఫ్ఘనిస్థాన్‌పై అన్ని విభాగాల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ముఖ్యంగా ఆసీస్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. పైగా ఢిల్లీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇక్కడ ఇంతకుముందు సౌతాఫ్రికా, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదైన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా బ్యాటర్లైతే పండుగ చేసుకున్నారు. ఏకంగా ముగ్గురు బ్యాటర్ల సెంచరీలు చేశారు. దీంతో ఆ జట్టు ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక స్కోర్ 428ని నమోదు చేసింది. చేజింగ్‌లో శ్రీలంక బ్యాటర్లు కూడా 326 పరుగులు చేసి సత్తా చాటారు. అయితే ఇక్కడ ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ సార్లు గెలిచాయి. ఢిల్లీలో జరిగిన గత 6 వన్డే మ్యాచ్‌లను పరిశీలిస్తే ఇదే తెలుస్తుంది. ఆరింట్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే ఐదు సార్లు గెలిచాయి. ఇక ప్రత్యర్థి చిన్నదే అయినప్పటికీ తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్ బలంగా ఉంది. రషీద్ ఖాన్, ముజీబ్, ఫారూఖీల రూపంలో అఫ్ఘనిస్థాన్‌లో మంచి బౌలర్లున్నారు. అలాగే నబీ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్ కూడా ఉన్నాడు.


ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనే విషయానికొస్తే.. శుభ్‌మన్ గిల్ డెంగ్యూ నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మకు జతగా ఇషాన్ కిషనే ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. మూడు, నాలుగు స్థానాల్లో ఆడే కింగ్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌పై ఈ మ్యాచ్‌లో భారీ అంచనాలున్నాయి. కోహ్లీకి ఇది హోంగ్రౌండ్ కావడంతో భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశాలున్నాయి. శ్రేయస్ కూడా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఈ గ్రౌండ్‌లో అనేక మ్యాచ్‌లు ఆడాడు. దీంతో ఈ పిచ్‌ గురించి శ్రేయస్‌కు బాగా తెలుసు. ఇక ఐదో స్థానంలో కేఎల్ రాహుల్, ఆరు, ఏడు స్థానాల్లో ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఆడనున్నారు. ఈ పిచ్‌ నుంచి స్పిన్నర్లు సహకారం లభించే అవకాశాలు లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ను ఆడించకపోవచ్చు. అతని స్థానంలో పేసర్ మహ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. దీంతో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో కలిసి షమీ పేస్ డిపార్ట్‌మెంట్‌ను పంచుకోనున్నాడు. అయితే షమీ కాకుండా బ్యాటింగ్ కూడా చేయగలడనే ఉద్దేశ్యంతో శార్దూల్ ఠాకూర్‌ను ఆడించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీరికితోడు నాలుగో పేసర్‌గా ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఉండనే ఉన్నాడు. ఇక ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ కొనసాగున్నాడు. అతనికి తోడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో ఒకటి మినహా పెదగా మార్పులు ఉండే అవకాశాలు లేవు.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్‌, విరాట్ కోహ్లీ‌, శ్రేయాస్ ‌అయ్యర్, కేఎల్ రాహుల్‌, హార్దిక్ పాండ్యా‌, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌, మహ్మద్ షమీ/ రవిచంద్రన్ అశ్విన్‌, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌.

Updated Date - 2023-10-11T11:10:36+05:30 IST