Share News

World Cup: సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. కీలక మ్యాచ్‌కు కెప్టెన్ దూరం!

ABN , First Publish Date - 2023-10-21T16:11:46+05:30 IST

గత మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ చేతిలో అనూహ్య రీతిలో ఓడి షాక్‌లో ఉన్న సౌతాఫ్రికాకు ఇంతలోనే మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ఆ జట్టు కెప్టెన్ తెంబా బవుమా దూరమయ్యాడు.

World Cup: సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. కీలక మ్యాచ్‌కు కెప్టెన్ దూరం!

ముంబై: గత మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ చేతిలో అనూహ్య రీతిలో ఓడి షాక్‌లో ఉన్న సౌతాఫ్రికాకు ఇంతలోనే మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ఆ జట్టు కెప్టెన్ తెంబా బవుమా దూరమయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న బవుమా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆడడం లేదు. దీంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బవుమా స్థానంలో సౌతాఫ్రికాకు కెప్టెన్‌గా ఎయిడెన్ మాక్రమ్ వ్యవహరిస్తున్నాడు. అలాగే బవుమా స్థానంలో హెడ్రిక్స్ జట్టులోకి వచ్చాడు. తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఆస్ట్రేలియాపై ఘనవిజయాలు నమెదు చేసిన సఫారీలు.. మూడో మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయారు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు బవుమా తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నప్పటికీ బ్యాటర్‌గా మాత్రం రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో 8, 35, 11 పరుగులు మాత్రమే చేశాడు. కాగా ఈ ప్రపంచకప్ టోర్నీలో అనారోగ్య సమస్యలు, గాయాలు పలు జట్లకు ఇబ్బందిగా మారాయి. డెంగ్యూ బారిన పడిన టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా గాయం బారిన పడిన హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్‌తో జరగబోయే తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. న్యూజిలాండ్ జట్టు కూడా గాయం కారణంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ సేవలను కోల్పోయింది. గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న విలియమ్సన్.. ఒకే ఒక మ్యాచ్ ఆడి మరో రెండు, మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తాజాగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఇక పాకిస్థాన్ జట్టులో కూడా పలువురు అనారోగ్యం బారిన పడ్డారు.

Updated Date - 2023-10-21T16:11:46+05:30 IST