Share News

IND vs PAK: రోహిత్-కోహ్లీ ప్లాన్ వేశారు.. సిరాజ్ అమలు చేశాడు.. అందుకే పవర్ ప్లే కింగ్ సిరాజ్ మియా!

ABN , First Publish Date - 2023-10-14T15:27:03+05:30 IST

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ సిరాజ్ మియా సత్తా చాటాడు. తన సహజ శైలికి అనుగుణంగా పవర్ ప్లేలోనే వికెట్ తీసి పాకిస్థాన్‌ను దెబ్బకొట్టాడు. పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ను 8వ ఓవర్ చివరి బంతికి మహ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు.

IND vs PAK: రోహిత్-కోహ్లీ ప్లాన్ వేశారు.. సిరాజ్ అమలు చేశాడు.. అందుకే పవర్ ప్లే కింగ్ సిరాజ్ మియా!

అహ్మదాబాద్: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ సిరాజ్ మియా సత్తా చాటాడు. తన సహజ శైలికి అనుగుణంగా పవర్ ప్లేలోనే వికెట్ తీసి పాకిస్థాన్‌ను దెబ్బకొట్టాడు. పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ను 8వ ఓవర్ చివరి బంతికి మహ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అబ్దుల్లాను సిరాజ్ లెగ్‌ బైస్‌లో ఔట్ చేశాడు. దీంతో 41 పరుగుల వద్ద పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఈ ఓవర్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ కాసేపు మాట్లాడుకున్నారు. వికెట్ ఎలా సాధించాలనే విషయమే ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా కనిపించింది. ఆ తర్వాతి ఓవర్లోనే సిరాజ్ వికెట్ తీశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు రోహిత్-కోహ్లీ ప్లాన్ వేస్తే సిరాజ్ అమలు చేశాడని అంటున్నారు. అంతేకాకుండా సిరాజ్‌ను పవర్ ప్లే కింగ్ అంటూ ప్రశంసిస్తున్నారు. కాగా ఈ ఏడాది వన్డేల్లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసింది సిరాజే కావడం గమనార్హం. నిజానికి ఈ మ్యాచ్ మొదటి ఓవర్లోనే సిరాజ్ 3 ఫోర్లు ఇచ్చాడు. ఆ ఓవర్ మొదటి 4 బంతుల్లోనే పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ 3 ఫోర్లు బాదాడు. కానీ వెంటనే పుంజుకున్న సిరాజ్ అబ్దుల్లాను పెవిలియన్ చేర్చాడు.


ఇక అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేస్తామని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో ఒక మార్పు జరిగింది. ముందుగా ఊహించినట్టుగానే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. దీంతో ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని, గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తెలిపారు.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజాం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్

Updated Date - 2023-10-14T15:27:03+05:30 IST