Share News

IND vs NZ Semi-Final: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. క్రిస్ గేల్ ప్రపంచ రికార్డులు బద్దలు

ABN , First Publish Date - 2023-11-15T15:38:54+05:30 IST

World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ సాధారణంగానే ఈ మ్యాచ్‌లోనూ తనదైన స్టైలులో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు.

IND vs NZ Semi-Final: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. క్రిస్ గేల్ ప్రపంచ రికార్డులు బద్దలు

ముంబై: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ సాధారణంగానే ఈ మ్యాచ్‌లోనూ తనదైన స్టైలులో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన మొదటి ఓవర్‌లోనే 2 ఫోర్లు బాదాడు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్‌లో సిక్సు బాదాడు. టిమ్ సౌథీ వేసిన 4వ ఓవర్లో ఓ ఫోర్, సిక్సు బాదాడు. బౌల్ట్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి మరో సిక్సర్ బాదిన రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 49 సిక్సులు కొట్టిన వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డును హిట్‌మ్యాన్ బద్దలుకొట్టాడు. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో 50 సిక్సులు కొట్టిన మొదటి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే రోహిత్ మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఒక వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 2015 ప్రపంచకప్‌లో 26 సిక్సులు కొట్టిన వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు హిట్‌మ్యాన్ 27 సిక్సులు కొట్టాడు. ఇలా ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ రెండు ప్రపంచరికార్డులను రోహిత్ బద్దలుకొట్టాడు. అలాగే ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా వన్డే ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ శర్మ 1,500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో వేగంగా ఈ మార్కు అందుకున్న బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.


కాగా సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు.4 ఫోర్లు, 4 సిక్సులతో 29 బంతుల్లోనే 47 పరుగులు బాదేశాడు. టిమ్ సౌథీ వేసిన 9వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్ శర్మ.. కేన్ విలియమ్సన్‌కు క్యాచ్ గా దొరికిపోయాడు. భారీ ఎత్తు నుంచి వచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద ఉన్న విలియమ్సన్ చక్కగా అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా ఈ ఎడిషన్‌లో రోహిత్ శర్మ 550 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక రోహిత్ శర్మ ఔట్‌తో 71 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. రోహిత్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఆరంభంలోనే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సౌథీ వేసిన 9వ ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూ విషయంలో న్యూజిలాండ్ రివ్యూకు వెళ్లింది. కానీ బంతి బ్యాట్‌కు తగలడంతో కోహ్లీ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అప్పటికీ కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయలేదు. అనంతరం కోహ్లీ, గిల్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 13వ ఓవర్‌లోనే 100 పరుగులు దాటింది. శుభ్‌మన్ గిల్ కూడా 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కాగా వన్డేల్లో గిల్‌కు ఇది 13వ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం 18 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 138/1గా ఉంది.

Updated Date - 2023-11-15T15:38:55+05:30 IST