Share News

Shubman Gill: ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించిన శుభ్‌మన్ గిల్.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను అధిగమించి..

ABN , First Publish Date - 2023-11-08T14:57:52+05:30 IST

ICC ODI Rankings: టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ చరిత్ర స‌ృష్టించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌ బ్యాటర్‌గా అవతరించాడు. 24 ఏళ్ల వయసులోనే నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 951 రోజులుగా నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా కొనసాగిన పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ అధిపత్యానికి తెరదించాడు. మొత్తంగా అత్యధిక కాలం వన్డే నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ ఆరో స్థానంలో ఉన్నాడు.

Shubman Gill: ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించిన శుభ్‌మన్ గిల్.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను అధిగమించి..

టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ చరిత్ర స‌ృష్టించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌ బ్యాటర్‌గా అవతరించాడు. 24 ఏళ్ల వయసులోనే నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 951 రోజులుగా నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా కొనసాగిన పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ అధిపత్యానికి తెరదించాడు. మొత్తంగా అత్యధిక కాలం వన్డే నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ ఆరో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న గిల్ ఖాతాలో 830 రేటింగ్ పాయింట్లు ఉండగా.. 824 రేటింగ్ పాయింట్లతో బాబర్ అజామ్ రెండో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో గిల్ రాణిస్తుండగా.. బాబర్ అజామ్ మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. దీంతో ర్యాంకింగ్స్‌లో బాబర్ ఒక స్థానం దిగజారాడు. గిల్ మొదటి స్థానానికి దూసుకుపోయాడు.


మొత్తంగా వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు. గిల్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్, విరాట్ కోహ్లీ కూడా గతంలో ఐసీసీ నంబర్ వన్ వన్డే బ్యాటర్లుగా నిలిచారు. కాగా తక్కువ ఇన్నింగ్స్‌ల పరంగా వేగంగా ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ ధోని మొదటి స్థానంలో ఉన్నాడు. ధోని 38 ఇన్నింగ్స్‌ల్లోనే నంబర్ వన్ బ్యాటర్‌గా నిలవగా.. గిల్ 41 ఇన్నింగ్స్‌ల్లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు మహ్మద్ సిరాజ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సిరాజ్ ఖాతాలో 709 రేటింగ్ పాయింట్లున్నాయి. ఇక వన్డే టీమ్ విభాగంలోనూ భారత జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత జట్టు ఖాతాలో 121 రేటింగ్ పాయింట్లున్నాయి. దీంతో ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో టీమిండియా అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే టెస్ట్, టీ20 ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియానే మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్థానంలో ఉండగా.. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా నంబర్ టెస్టు ఆల్ రౌండర్‌గా తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో సత్తా చాటుతున్న టీమిండియా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటారు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ ఆరో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఖాతాలో 770 రేటింగ్ పాయింట్లు, రోహిత్ ఖాతాలో 739 రేటింగ్ పాయింట్లున్నాయి.

Updated Date - 2023-11-08T14:57:55+05:30 IST