Share News

World cup: రెండు సెమీస్ బెర్త్‌ల కోసం 5 టీంల మధ్య తీవ్ర పోటీ.. ఎక్కువ అవకాశాలున్న జట్లివే!

ABN , First Publish Date - 2023-11-07T11:20:39+05:30 IST

భారత్ వేదికగా ఆసక్తికరంగా సాగుతున్న వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలు ముగింపునకు చేరుకున్నాయి. జట్లన్నింటికీ మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా జట్లకు సెమీస్ బెర్త్‌లు కూడా ఖరారు అయ్యాయి.

World cup: రెండు సెమీస్ బెర్త్‌ల కోసం 5 టీంల మధ్య తీవ్ర పోటీ.. ఎక్కువ అవకాశాలున్న జట్లివే!

భారత్ వేదికగా ఆసక్తికరంగా సాగుతున్న వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలు ముగింపునకు చేరుకున్నాయి. జట్లన్నింటికీ మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా జట్లకు సెమీస్ బెర్త్‌లు కూడా ఖరారు అయ్యాయి. దీంతో సెమీస్ చేరేందుకు మరో రెండు జట్లకు మాత్రమే అవకాశం ఉంది. బంగ్లాదేశ్, ఇంగ్లండ్, శ్రీలంక జట్లు ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో మిగిలిన రెండు సెమీస్ బెర్త్‌ల కోసం 5 జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రెండు నాకౌట్ స్థానాలను దక్కించుకునేందుకు ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, నెదర్లాండ్స్ జట్లకు అవకాశాలున్నాయి. నెదర్లాండ్స్‌ను పక్కన పెడితే ప్రధానంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య పోటీ నెలకొంది. ఇందులో ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్ జట్లు సెమీస్‌లో అడుగుపెట్టేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. దీంతో మిగిలిన ఒక స్థానం కోసం మూడు జట్ల మధ్య రేసు ఉండనుంది.

ఆస్ట్రేలియా

ఇప్పటివరకు 7 మ్యాచ్‌లాడిన ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడి 5 గెలిచింది. 10 పాయింట్లతో ప్రస్తుతం టేబుల్‌లో ఆసీస్ మూడో స్థానంలో ఉంది. కంగారులు ప్రారంభ రెండు మ్యాచ్‌లను ఓడినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నారు. వరుసగా 5 మ్యాచ్‌ల్లో గెలిచారు. కంగారులు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో తలపడనున్నారు. ఈ రెండింటిలో కనీసం ఒక మ్యాచ్ గెలిచిన సెమీస్‌కు అర్హత సాధిస్తారు. ఒక వేళ రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానానికి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకు ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోవాల్సి ఉంటుంది. కాగా సఫారీలు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అప్ఘానిస్థాన్‌తో తలపడనున్నారు. ఒక వేళ ఆస్ట్రేలియా మిగిలిన రెండు మ్యాచ్‌లో ఓడిపోయినా చివరి వరకు మెరుగైన రన్ రేటు సెమీస్ చేరే అవాకాశాలున్నాయి. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా నెట్ రన్ రేటు +0.924గా ఉంది.

F9gQzYiXoAAwbcW.jpg

న్యూజిలాండ్

టోర్నీ ఆరంభంలో వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ రేసులో వెనుకబడింది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా నాకౌట్ పోరుకు అర్హత పొందేందుకు కివీస్‌కు మంచి అవకాశాలున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న బ్లాక్ క్యాప్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనున్నారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే 5 విజయాలతో సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా ప్రస్తుతం న్యూజిలాండ్ మంచి నెట్ రన్ రేటు‌ను కల్గి ఉంది. కివీస్ ప్రస్తుతం రన్ రేటు +0.398గా ఉంది. కానీ కివీస్‌కు అప్ఘానిస్థాన్, పాకిస్థాన్ నుంచి తీవ్ర పోటీ ఎదురుకానుంది. ఈ రెండు జట్లు కూడా ఐదేసి విజయాలు సాధించే అవకాశాలున్నాయి. ఒకవేళ వాటి రన్ రేటు కివీస్‌కు కన్నా మెరుగ్గా ఉంటే వాటికే నాకౌట్ బెర్త్ దక్కుతుంది. దీంతో ముందు జాగ్రత్తగా కివీస్ రన్ రేటును మరింత మెరుగుపరచుకోవడం మేలని విశ్లేషకులు అంటున్నారు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే అప్ఘానిస్థాన్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒకవేళ ఆ రెండు మ్యాచ్‌ల్లో అఫ్ఘానిస్తాన్ గెలిస్తే రన్ రేటుతో సంబంధం లేకుండా 12 పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెడుతుంది. పైగా ప్రస్తుతం 4 విజయాలు సాధించి సెమీస్ రేసులో ఉన్న జట్లలో అఫ్ఘానిస్థాన్‌కు మాత్రమే రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. దీంతో కివీస్ చివరి మ్యాచ్‌లో గెలిచి సెమీస్ చేరాలంటే అఫ్ఘానిస్థాన్ తమ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ కచ్చితంగా ఓడిపోవాల్సి ఉంటుంది.

NZvsSADream111698760221294.jpg


అఫ్ఘానిస్థాన్

ఈ ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతున్న అఫ్ఘానిస్థాన్ జట్టు అంచనాలకు మించి రాణిస్తూ పెద్ద పెద్ద టీంలను సైతం ఓడించి సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచిన అఫ్ఘానిస్థాన్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఆ జట్టుకు సెమీస్ రేసులో ఉన్న న్యూజిలాండ్, పాకిస్థాన్‌తో సమానంగా పాయింట్లున్నాయి. అప్ఘానిస్థాన్ జట్టుకు టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సెమీస్ రేసులో ఉన్న జట్లలో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నది అఫ్ఘానిస్థాన్‌కు మాత్రమే. దీంతో ఆ రెండు మ్యాచ్‌ల్లో అఫ్ఘానిస్థాన్ గెలిస్తే నెట్ రన్ రేటుతో సంబంధం లేకుండా 12 పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెడుతుంది. అయితే అది అంత సులువుగా అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే అఫ్ఘానిస్థాన్ జట్టు తమ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో బలమైన, ఈ టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో తలపడనుంది. దీంతో ఈ రెండు మ్యాచ్‌లు గెలవడం అఫ్ఘాన్ జట్టుకు అంత తేలిక కాదు. కానీ నెట్ రన్ రేటును మెరుగుపరచుకుని ఈ రెండింటిలో ఒక మ్యాచ్ గెలిచినా అప్ఘానిస్థాన్ జట్టు సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్ నెట్ రన్ రేటు -0.330గా ఉంది.

2haqrtq8_team-afghanistan-afp_625x300_24_August_23.jpg

పాకిస్థాన్

ఈ టోర్నీలో పాకిస్థాన్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ ఆ తర్వాత ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఏకంగా 4 ఓడిపోయింది. ముఖ్యంగా అఫ్ఘానిస్థాన్ చేతిలో కూడా ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో కాస్త వెనుకబడింది. దీంతో పాక్ సెమీస్ అవకాశాలు కాస్త సంక్లిష్టంలో పడినప్పటికీ ఇప్పటికీ అవకాశాలున్నాయి. లీగ్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన పాకిస్థాన్ 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. నెట్ రన్ రేటు విషయంలో కివీస్‌తో పోల్చుకుంటే వెనుకబడినప్పటికీ ప్లస్(+)లోనే ఉంది. దీంతో ఇంగ్లండ్‌తో ఆడబోయే చివరి మ్యాచ్‌లో గెలవడంతోపాటు రన్ రేటును మెరుగుపరచుకుంటే పాక్ సెమీస్ చేరే అవకాశాలున్నాయి. అదే సమయంలో అప్థానిస్థాన్ జట్టు తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒకటి కచ్చితంగా ఓడిపోవాలి. కాగా ప్రస్తుతం పాకిస్థాన్ నెట్ రన్ రేటు +0.036గా ఉంది.

pakistan-vs-south-africa-head-to-head-featured-1698304307.jpg

నెదర్లాండ్స్

ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచిన నెదర్లాండ్స్ పాయింట్ల పట్టికలో ఏకంగా 9వ స్థానంలో ఉంది. ఆ జట్టు అధికారికంగా నాకౌట్ పోరు నుంచి తప్పుకోనప్పటికీ.. సెమీస్ బెర్త్ దక్కే అవకాశాలు దాదాపుగా లేవు. ఒకవేళ నెదర్లాండ్స్ సెమీస్ చేరాలంటే ఏదైనా అద్భుతమే జరగాలి. పైగా ప్రస్తుతం ఆ జట్టు రన్ రేటు కూడా బాగాలేదు. -1.398గా ఉంది. దీంతో నెదర్లాండ్స్ జట్టు సెమీస్ చేరాలంటే రన్‌రేటును మెరుగుపరచుకుని ఇంగ్లండ్, భారత్ జట్లతో ఆడే తమ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో న్యూజిలాండ్, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ జట్లు తమ తర్వాతి మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. కానీ ఇది జరగడం అంత సులువు కాదు.

untitled-design-2023-09-07t135730-1694075366.jpg

Updated Date - 2023-11-07T11:20:41+05:30 IST