Voters: 2009లో కాంగ్రెస్‌, 2014లో టీడీపీ, 2019లో వైసీపీని గెలిపించిన ఓటర్లు..ఈసారి ఏ పార్టీని గెలిపిస్తారో..?

ABN , First Publish Date - 2023-03-25T11:12:23+05:30 IST

ఏలూరు జిల్లాలోని ఎస్టీ నియోజకవర్గం పోలవరం... ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఒకే పార్టీకి కొమ్ముకాయడం అక్కడ ఓటర్లకు అలవాటు లేదు. ప్రతీసారి భిన్నమైన తీర్పు...

Voters: 2009లో కాంగ్రెస్‌, 2014లో టీడీపీ, 2019లో వైసీపీని గెలిపించిన ఓటర్లు..ఈసారి ఏ పార్టీని గెలిపిస్తారో..?

ఏజెన్సీలో అత్యంత కీలకమైన నియోజకవర్గం.. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గం కూడా అదే. ఏ పార్టీ అక్కడ నుంచి పోటీ చేసినా.. గెలవడానికి గిరిపుత్రుల ఆశీస్సులు ఉండాల్సిందే. అటువంటి నియోజకవర్గంలో ఓటర్లను, ప్రజలను తనవైపు తిప్పకోవడానికి తెలుగుదేశం రూటు మార్చింది. గత ఎన్నికల్లో ఓటమి భారాన్ని వదిలేసి, ప్రజలకు కావాల్సిన సేవలు, అవసరమైన పనులు చేస్తూ.. వారందరిని తమవైపు తిప్పుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యింది... ఆ నియోజకవర్గం ఏలూరు జిల్లాలో ఉన్న పోలవరం.. అసలు అక్కడ టీడీపీ పరిస్థితి, ఇతర పార్టీల పరిస్థితి ఎలా ఉందో ఏబీఎన్ ఇన్ సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-1054.jpg

2014లో టీడీపీని, 2019లో వైసీపీని గెలిపించిన ఓటర్లు

ఏలూరు జిల్లాలోని ఎస్టీ నియోజకవర్గం పోలవరం... ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఒకే పార్టీకి కొమ్ముకాయడం అక్కడ ఓటర్లకు అలవాటు లేదు. ప్రతీసారి భిన్నమైన తీర్పు ఇస్తూ, ఎమ్మెల్యేలుగా వివిధ పార్టీల అభ్యర్ధులను గెలిపిస్తూ ఎప్పుడూ వైవిధ్యం ప్రదర్శిస్తుంటారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత, నియోజకరవర్గ ప్రజలు ఎక్కువగా ఆ పార్టీకే పట్టం కట్టినా, కీలక సమయాల్లో ఇతర పార్టీల అభ్యర్ధులను గెలిపించిన దాఖలాలు ఉన్నాయి... 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను. 2012 ఉపఎన్నికల్లో వైసీపీని, 2014లో టీడీపీని, 2019లో వైపీపీని గెలిపించారంటే, ఇక్కడి ఓటర్లు చూపిస్తున్న వైవిధ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అటువంటి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో తిరిగి విజయఢంకా మోగించడానికి తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలోనే కసరత్తు మొదలుపెట్టింది.

Untitled-3547.jpg

అప్పటికే అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారం చేపట్టిన వైసీపీ

2019 ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గంలో టీడీపీ భారీ తేడాతోనే ఓటమి పాలైంది. దానికి ప్రధాన కారణం ఆఖరి నిమిషంలో అభ్యర్ధిగా బొరగం శ్రీనివాస్‌ను ఖరారుచేయడం. అప్పటికే వైసీపీ తన అభ్యర్ధిని ఖరారు చేసి ప్రచారం చేయించడం మొదలుపెట్టేసింది. అది అధికార వైసీపీకి కలిసొచ్చింది. ఓడిపోయిన తర్వాత అందుకు కారణాలను టీడీపీ విశ్లేషించగా, ఆర్థికపరమైన కారణాలతోపాటు ఇవన్నీ బయటపడ్డాయి. ఈ నేపధ్యంలో నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ పగ్గాలను మళ్లీ బొరగం శ్రీనివాస్‌కే అప్పగించి, పార్టీని బలోపేతం చేయాలని సూచించింది.

Untitled-421.jpg

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం

పోలవరం నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీ తప్పుల మీద తప్పులు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం, నిర్వాసితులకు పూర్తి స్ధాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం, నిర్వాసితులను బలవంతంగా వారి గ్రామాల నుంచి ఖాళీ చేయించడం, గోదావరి వరదల సమయంలో బాధితులను పట్టించుకోకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో వైసీపీ నియోజకవర్గ ఓటర్లకు దూరమైంది. ఈ పరిణామాలను టీడీపీ తనకు అనుకూలంగా మలచుకుంది. ముఖ్యంగా బొరగం శ్రీనివాస్‌తోపాటు, మరికొందరు నాయకులు వైసీపీ తప్పిదాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లడం వారికి బాగా కలిసొచ్చింది. ఆ ప్రభావం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి.

Untitled-6454.jpg
అధినేత ప్రశంసలతో నియోజకవర్గ నేతల్లో ఊపు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి మంచి ఫలితాలు రాకున్నా.. విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లో మంచి ఫలితాలు సాధించింది. దానికి అక్కడ నాయకులు చేసిన కృషి, నియోజకవర్గం ఇన్ ఛార్జ్ బొరగం శ్రీనివాస్ పర్యవేక్షణ బాగా కలిసొచ్చింది... స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లడం, ఆయన వారిని అభినందించడం జరిగింది. స్వయంగా అధినేతే ప్రశంసించడంతో నియోజకవర్గ నేతల్లో మంచి ఊపు వచ్చింది. అదేకాకుండా గోదావరికి వరదలు వచ్చినప్పుడు అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు బాధిత ప్రాంతాలకు వెళ్లక ముందే, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడ పర్యటించడం, బాధితులకు సహాయ సహకారాలు అందించడం పార్టీకి మంచి పేరు తీసుకువచ్చింది.

Untitled-5054.jpg

బాదుడే బాదుడుతో పార్టీకి మంచి పేరు

ముఖ్యంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొరగం శ్రీనివాస్, పార్టీ నేతల సహాయంతో, వేలాది మంది బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు అందించడం వల్ల అక్కడి ప్రజల్లో టీడీపీ పట్ల సానుభూతి పెరిగేలా చేసింది. ఈ తరుణంలోనే టీడీపీ నిర్వహించిన బాదుడే బాదుడు, ఇతర పార్టీ కార్యక్రమాలకు సైతం పార్టీకి మంచి పేరు వచ్చేలా చేసింది. ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీకి పోలవరం నియోజకవర్గంలో పూర్వ వైభవం వచ్చిందనేది తెలుగుతమ్ముళ్ల నమ్మకం. అందుకు ప్రధాన కారణం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బొరగం శ్రీనివాస్‌తోపాటు ఇతర నాయకుల పనితీరేనని పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి. మొత్తం మీద పోలవరం నియోజకవర్గంలో టీడీపీకి మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది.

Updated Date - 2023-03-25T11:12:23+05:30 IST