Karnataka Elections : ఫస్ట్ టార్గెట్ కర్ణాటక అన్న కేసీఆర్ పత్తా లేరేం.. కుమారస్వామితో చెడిందా.. ఇద్దరి మధ్య పెద్ద కథే నడిచిందా..!?

ABN , First Publish Date - 2023-05-06T21:11:15+05:30 IST

టీఆర్ఎస్‌ను (TRS) బీఆర్ఎస్‌గా (BRS) మార్చిన తర్వాత కొన్ని రోజులపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) యమా యాక్టివ్‌గా ఉన్నారు. జాతీయ స్థాయి నేతలతో..

Karnataka Elections : ఫస్ట్ టార్గెట్ కర్ణాటక అన్న కేసీఆర్ పత్తా లేరేం.. కుమారస్వామితో చెడిందా.. ఇద్దరి మధ్య పెద్ద కథే నడిచిందా..!?

టీఆర్ఎస్‌ను (TRS) బీఆర్ఎస్‌గా (BRS) మార్చిన తర్వాత కొన్ని రోజులపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) యమా యాక్టివ్‌గా ఉన్నారు. జాతీయ స్థాయి నేతలతో, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వరుస సమావేశాలు, భారీ బహిరంగ సభలు, చేరికలతో ప్రగతి భవన్ ఎప్పుడూ కిటకిటలాడుతుండేది. అయితే ఈ మధ్య ఎందుకో ‘కారు’లో స్పీడ్ తగ్గినట్లుగా అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా.. బీజేపీ ముక్త్ భారత్‌లో (BJP Mukt Bharat) భాగంగా కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) ప్రచారానికి వెళ్తానని.. ఫస్ట్ టార్గెట్ ఇదేనని చెప్పిన కేసీఆర్ ఎందుకో వెనకడుగేశారు. అంతేకాదు.. జేడీఎస్ (JDS) తరఫున ప్రచారం చేస్తారని గులాబీ బాస్ మాటివ్వడంతో మాజీ సీఎం కుమారస్వామి (Kumara Swamy) ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ‘సారొస్తున్నారు..’ అని పలుమార్లు మీడియా ముందు కుమారన్న చెప్పారు కూడా. అయితే ఎన్నికల ప్రచారానికి మరో రెండ్రోజులు మాత్రమే గడువు ఉంది.. కానీ ఇంతవరకూ బాస్ పత్తాలేకుండా పోయారు. అది చేస్తాం.. ఇది చేస్తామన్న కేసీఆర్ కన్నడ నాట ఎన్నికల సమరానికి ఎందుకు వెళ్లలేదు..? కుమారన్నకు మాటిచ్చి తప్పారెందుకు..? బాస్ వెనకడుగు వేయడానికి కారణాలేంటి..? కుమారన్నతో కేసీఆర్‌కు చెడిందా లేకుంటే బీజేపీ అంటే భయపడ్డారా..? అసలు కేసీఆర్ గురించి అటు కర్ణాటకలో.. ఇటు తెలంగాణలో (Telangana) ఏమనుకుంటున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం..

KCR-2.jpg

ఏమైంది.. ఎందుకిలా..!?

కన్నడ నాటు కాషాయ జెండా పాతాలని బీజేపీ.. ‘హస్త’గతం చేసుకోవాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రెండు జాతీయ పార్టీల మధ్యలో జేడీఎస్ కూడా కింగ్ మేకర్ కావాలని శతవిధాలుగా ప్రయత్నాలు షురూ చేసింది. ఒకటా రెండా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, కౌంటర్లు.. ఆఖరికి వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి మాట్లాడుకున్నారు. ముఖ్యంగా ‘ముస్లిం రిజర్వేషన్’, ‘బజరంగ్‌దళ్’.. ఈ రెండు విషయాలు ఎప్పుడైతే తెరపైకి వచ్చాయో సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకూ కాంగ్రెస్‌కే గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలు చెప్పగా.. సడన్‌గా ఒకట్రెండు సన్నివేశాలతో రివర్స్ అయ్యింది. ఇప్పుడంతా ఓటర్లు బీజేపీకి ఓటేసి గెలిపించేస్తున్నారనే ప్రచారం, సర్వేలు జోరందుకున్నాయి. ఎన్నికల్లో ప్రచారం కోసం కాషాయదళం మొత్తం కర్ణాటకలో వాలిపోయింది. ఇక కాంగ్రెస్ నుంచి కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాగా.. రేపో మాపో ఫైనల్ టచ్ ఇవ్వడానికి సోనియా గాంధీ కూడా విచ్చేస్తారట. ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా ఇరు పార్టీల నేతల ప్రచారం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా బండి సంజయ్, రేవంత్ రెడ్డి, రఘువీరా రెడ్డి లాంటి కీలక నేతలు వెళ్లి ప్రవాసాంధ్రులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పర్యటించి ఓటర్లను అభ్యర్థించారు. ఆఖరికి కమెడియన్ బ్రహ్మానందం కూడా తెలుగు ప్రజలు ఉండే నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో.. అటు కర్ణాటకలో.. ఇటు తెలంగాణలో కేసీఆర్ పేరు మోత మోగుతోంది.

Kumara.jpg

- అవును.. దేశం రూపురేఖలు మార్చేస్తా.. బీజేపీ ముక్త భారత్‌గా ముందుకెళ్తా.. ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ (Abki Baar Kisan Sarkar).. ఇవీ ఆ మధ్య కేసీఆర్ నోట ప్రతీ సభలో వచ్చిన మాటలు. యుద్ధం కర్ణాటకతో మొదలవుతుందని కుమారస్వామి సాక్షిగా కేసీఆర్ పదే పదే చెప్పారు. కుమార పార్టీ గెలుపుకోసం సాయశక్తులా తాను, బీఆర్ఎస్ కృషి చేస్తుందని గులాబీ బాస్ మాటిచ్చారు. ఆయన మాటలతో కుమారన్నలో ఎనలేని ఉత్సాహం. ఇదంతా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు మాట. అయితే షెడ్యూల్ వచ్చింది.. మరో రెండ్రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియవచ్చినా ఇంతవరకూ బాస్ ఎక్కడా కనిపించలేదు. పోనీ ఆయన వెళ్లకపోయినా బీఆర్ఎస్ నేతలు ఎక్కడైనా కనిపించారా అంటే అబ్బే అస్సలే లేదు. ఇవన్నీ కాదు కనీసం ఎన్నికలకు సంబంధించి చిన్నపాటి ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం. ఆయన ఎందుకు వెళ్లలేదో తెలియట్లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో విమర్శలు , కౌంటర్లు వినిపిస్తున్నాయ్.

Kumaranna.jpg

కర్ణాటకలో అడుగుపెట్టకపోవడానికి..!

అదేదో పాట ఉందిగా.. ‘అంతన్నడు ఇంతన్నాడే..’ అన్నట్లుగా అన్నేసి మాటలు చెప్పిన కేసీఆర్ కర్ణాటకలో ఎందుకు ప్రచారానికి వెళ్లలేదు..? యుద్ధం అని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కేసీఆర్ కనీసం కత్తి పట్టుకోవడానికి కూడా ఎందుకు సాహసించలేదు..? ఆదిలోనే కేసీఆర్ ఎందుకిలా చేశారు..? ఎన్నో ఆశలు పెట్టుకున్న కుమారన్నకు బాస్ ఎందుకు హ్యాండిచ్చారు..? అనే విషయాలపైనే ఇప్పుడు ఎక్కడ చూసినా రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే జేడీఎస్ కింగ్ మేకర్ కావడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది గనుక పొరపాటున తెలంగాణ నుంచి వెళ్లి ప్రచారం చేస్తే ఆ పార్టీ దెబ్బతింటే పరిస్థితేంటి..? అప్పుడు అసలుకే ఎసరు వచ్చి పడినట్లు ఉంటుందని బాస్ భావించారని అందుకే అటువైపు అడుగుకూడా పెట్టలేదని టాక్ నడుస్తోంది. అంతేకాదు.. ఈ మధ్య మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలోని భోకర్‌ తాలూకాలో ఉన్న ప్రఖ్యాత భోకర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ 18 డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు జరగ్గా బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఘోరాతి ఘోరంగా పరాజయంపాలయ్యారు. ఈ దెబ్బతో ప్రస్తుతానికి ఇతర రాష్ట్రాల జోలికి వెళ్లకూడదని కేసీఆర్ ఫిక్స్ అయ్యారని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి.

Modi.jpg

అసలు కారణం ఇదేనా..!

ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఊహించని రీతిలోనే బలపడిందని రానున్న ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నట్లుగా కమలనాథులు చెప్పుకుంటున్నారు. బీజేపీ నేతలు ఈ మాటలు అన్నప్పుడల్లా బీఆర్ఎస్‌ పెద్దలకు జీహెచ్ఎంసీ ఎన్నికలే గుర్తొస్తున్నాయట. ఇక కర్ణాటక సంగతి అటుంచి మొదట తెలంగాణలో బీజేపీని ఢీకొట్టి ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాక.. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణకు వ్యూహాలు రచించాలన్నది బాస్ ఆలోచనట. వాస్తవానికి రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న రాయచూర్‌, గుల్భర్గా, బీదర్‌, గంగావతి, కొప్పోల్‌తో సహా తెలుగు మాట్లాడే ఓటర్లు అధికంగా ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో జరిపే ఎన్నికల బహిరంగ సభల్లో కుమారస్వామితో కలిసి వేదిక పంచుకోవాలని, ముఖ్యంగా బెంగళూరు మహానగరంలో నిర్వహించే ప్రచార కార్యక్రమాలు రోడ్‌ షోలలో భాగస్వామ్యం కావాలని గులాబీ బాస్ నిర్ణయించారట. అయితే.. సడన్‌గా ఏమైందో కానీ అందుకే రెడీ చేసుకున్న షెడ్యూల్‌ను కూడా కేసీఆర్ రద్దు చేసుకున్నారని టాక్.

Kumara-swamy.jpg

ఇద్దరికీ చెడిందా..?

మరోవైపు.. అదేమీ లేదు కన్నడనాట ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవచ్చు కానీ కుమారన్నకు ఆర్థికంగా అన్ని విధాలుగా కేసీఆర్ అండగా ఉన్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. అంతేకాదు ఎప్పటికప్పుడు కుమారన్నతో టచ్‌లో ఉంటూ ఐడియాలు కూడా గులాబీ బాస్ ఇస్తున్నారట. ఆ మధ్య కర్ణాటక బీఆర్ఎస్ వ్యవహారాలన్నీ నటుడు ప్రకాష్ రాజు చూసుకుంటారని టాక్ కూడా నడిచింది. ఒకవేళ బీఆర్ఎస్ బరిలోకి దిగితే కీలక అసెంబ్లీ లేదా పార్లమెంట్ స్థానం నుంచి ప్రకాష్‌ను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ భావించిందట. అయితే ఇది ఎన్నికల తర్వాత చూసుకోవాలని ప్రస్తుతం జేడీఎస్‌కు సపోర్టు చేయాలని అవన్నీ పక్కనెట్టారట.

Amith-Shah.jpg

ముఖ్యంగా.. కేసీఆర్-కుమారన్న మధ్య సంబంధాలు చెడాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్నికల ప్రకటనకు ముందే 93 మంది అభ్యర్థుల జాబితాను జేడీఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. కలిసి ముందడుగు వేద్దాం అనుకున్నప్పుడు ఇలా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటిస్తే ఎలా..? అని కేసీఆర్ గుస్సా అయ్యారట. తనను తలచకుండానే ఇలా చేస్తున్న కుమారకు అసలు ఎందుకు విజయానికి పని చేయాలి..? ఆ అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారట. అందుకే కన్నడనాట ఇంత జరుగుతున్నా కనీసం పొల్లెత్తి మాట కూడా ప్రస్తావించలేదట. ఎన్నికల తర్వాత ఒంటరిగానే బీఆర్ఎస్‌ను బలోపేతం చేసుకోవాలనే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నారట. అయితే బీఆర్ఎస్‌తో కలిసి వెళ్తే భవిష్యత్తులో ఆ పార్టీనే బలపడుతుందని అప్పుడు అసలుకే ఎసరు వస్తుందని కుమారస్వామి భావించారనే చర్చ కూడా జరుగుతోంది. అసెంబ్లీ సంగతి అటుంచినా పార్లమెంట్ ఎన్నికల్లో అయితే కలిసే ముందుకెళ్లాలని కేసీఆర్-కుమారస్వామి నిర్ణయానికి వచ్చారనే రూమర్స్ లేకపోలేదు. అంటే కర్ణాటక ఫలితాలపై బీఆర్ఎస్-జేడీఎస్ భవిష్యత్ ఆధారపడి ఉందన్న మాట.

మొత్తానికి చూస్తే.. కర్ణాటకలో కాస్త పరిస్థితులు అటు ఇటు అయితే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ మాత్రమేనన్న విషయం జగమెరిగిన సత్యమే. ఓ వైపు కర్ణాటకలో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే.. తెలంగాణలో ఏ విధంగా గెలవాలనే దానిపై ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం ప్లాన్ చేస్తోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నడనాట కాషాయ జెండా ఎగరటానికి వీళ్లేదని కేసీఆర్ కంకణం కట్టుకున్నారట. ఇందుకోసం తనవంతుగా చేయాల్సినదంతా గులాబీ బాస్ చేస్తున్నారట. కేసీఆర్ ఎందుకు వెళ్లలేదో అసలు కారణం తెలియట్లేదు కానీ చిత్రవిచిత్రాలుగా రూమర్స్ మాత్రం వచ్చేస్తున్నాయ్. ఈ పరిస్థితుల్లో ఎవరు పంతం నెగ్గించుకుంటారో.. ఫలితాలు ఎలా ఉంటాయో.. రిజల్ట్స్ తర్వాత ఎవరి నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియాలంటే మే-10 వరకు వేచి చూడాల్సిందే మరి.

CM-KCR.jpg

Updated Date - 2023-05-06T21:29:10+05:30 IST