Share News

Plane: ఫ్రాన్స్ చెర నుంచి విముక్తి.. ముంబైలో ల్యాండ్ అయిన విమానం

ABN , Publish Date - Dec 26 , 2023 | 07:41 AM

మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్‌లో నాలుగు రోజులపాటు నిర్భంధంలో ఉన్న భారతీయ ప్రయాణికులతో కూడిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానానికి విముక్తి లభించింది. సోమవారం మధ్యాహ్నం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన విమానం మంగళవారం తెల్లవారుజామున ముంబైలో ల్యాండ్ అయింది.

Plane: ఫ్రాన్స్ చెర నుంచి విముక్తి.. ముంబైలో ల్యాండ్ అయిన విమానం

ముంబై: మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్‌లో నాలుగు రోజులపాటు నిర్భంధంలో ఉన్న భారతీయ ప్రయాణికులతో కూడిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానానికి విముక్తి లభించింది. సోమవారం మధ్యాహ్నం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన విమానం మంగళవారం తెల్లవారుజామున ముంబైలో ల్యాండ్ అయింది. మొత్తం 276 మంది ప్రయాణికులతో సదరు విమానం ముంబై చేరుకుంది. ఇద్దరు మైనర్లతోపాటు 25 మంది ప్రయాణికులు ఫ్రాన్స్‌లో ఉండడానికి ఆసక్తి చూపారు. దీంతో విమానం బయలుదేరడానికి కాస్త ఆలస్యం అయింది. ఫ్రెంచ్ అధికారుల అనుమతిలో వారు అక్కడే ఉండిపోయారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాట్రీ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది. 276 మంది ప్రయాణికులతో మంగళవారం తెల్లవారుజామున ముంబైలో ల్యాండ్ అయింది.


అసలు ఏం జరిగిందంటే.. రుమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం ఫ్రాన్స్‌లో చిక్కుకుపోయింది. 303 మంది ప్రయాణికులతో కూడిన విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో ఆగింది. అయితే మానవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో ఫ్రెంచ్ అధికారులు సదరు విమానాన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే స్పందించిన ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో చర్చించింది. ఫ్రెంచ్ నిబంధనల ప్రకారం పారిస్‌కు 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న వాట్రీ విమానాశ్రయంలో ఈ ఘటనపై న్యాయ విచారణ జరిగింది. నలుగురు న్యాయమూర్తుల ప్యానల్ చేపట్టిన బహిరంగ విచారణ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఓ కంపెనీ క్లయింట్ కోసం విమానాన్ని నడిపామని, మానవ అక్రమ రవాణా ఆరోపణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని లెజెండ్ ఎయిర్‌లైన్స్ న్యాయవాది స్పష్టం చేశారు.

303 మందిని విడివిడిగా విచారించాలని భావించిన న్యాయమూర్తులు, అసలు ఈ ప్రక్రియే అస్తవ్యస్తంగా ఉందటూ మొత్తం కేసునే రద్దు చేశారు. విమానం బయలుదేరేందుకు అనుమతులు కూడా వచ్చాయి. యూఎస్ కస్టమ్స్, బోర్డర్ పెట్రోల్ (సీబీపీ) నుంచి వచ్చిన డేటా ప్రకారం, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించే భారతీయుల సంఖ్య గణనీయయంగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 96,917 మంది అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడ్డారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 51.61 శాతం ఎక్కువగా ఉంది. కాగా ఫ్రాన్స్ చట్టాల ప్రకారం మానవ అక్రమ రవాణా రుజువైతే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

Updated Date - Dec 26 , 2023 | 07:42 AM