RK : మోదీకి కేసీఆర్‌ సరెండర్‌?

ABN , First Publish Date - 2023-06-04T02:01:33+05:30 IST

రాజకీయాలలో ఏదైనా సాధ్యమేనంటారు. అయితే ఇలా కూడా జరుగుతుందా? హౌ? అనిపించే విధంగా ఢిల్లీ స్థాయిలో చోటుచేసుకున్న రాజకీయం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా...

RK : మోదీకి కేసీఆర్‌ సరెండర్‌?

రాజకీయాలలో ఏదైనా సాధ్యమేనంటారు. అయితే ఇలా కూడా జరుగుతుందా? హౌ? అనిపించే విధంగా ఢిల్లీ స్థాయిలో చోటుచేసుకున్న రాజకీయం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా కొన్ని నెలలపాటు జైలులో ఉండి బెయిలుపై బయటకు వచ్చిన అరబిందో ఫార్మాకు చెందిన శరత్‌ చంద్రారెడ్డి అదే కేసులో అప్రూవర్‌గా మారారు. ఒక నిందితుడు అప్రూవర్‌గా మారడం కొత్త కాదు. వింత అంతకంటే కాదు. వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేయడానికి అంగీకరించిన దస్తగిరి అప్రూవర్‌గా మారారు కదా. అయితే హంతకుల్లో ఒకరైన దస్తగిరి వాంగ్మూలాన్ని ఎలా ప్రామాణికంగా తీసుకుంటారని జగన్మోహన్‌ రెడ్డి అండ్‌ కో వాపోతున్నారనుకోండి.. అది వేరే విషయం.

శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం వెనుక మాత్రం పెద్ద కథే నడిచింది. ఒక వ్యాపారవేత్త అప్రూవర్‌గా మారడం అసాధారణం. ఎందుకంటే అలా అప్రూవర్‌గా మారిన వారిని అధికారంలో ఉండేవారు భవిష్యత్తులో నమ్మరు. వారితో ఎటువంటి లావాదేవీలకూ ఇష్టపడరు. అయినా శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారంటే దాని వెనుక పెద్ద తలకాయలు ఉండకుండా ఉంటాయా? ఆయన అప్రూవర్‌గా మారడాన్ని న్యాయస్థానం ఆమోదించగానే.. ఇంకేముందీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు చేయబోతున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే కవితను అరెస్టు చేయబోవడం లేదు.. ఆమె సేఫ్‌గానే ఉంటారు. ఇదే రానున్న రోజుల్లో సాక్షాత్కారం కానున్న ట్విస్ట్‌. శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడంలో ఈ అంశం కూడా కీలకం అన్న విషయం తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. నిందితుడు అప్రూవర్‌గా మారిన సందర్భాలలో వారికి శిక్ష పడకపోవచ్చు. పడినా శిక్షా కాలం తక్కువగా ఉంటుంది. శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం వెనుక జరిగిన డ్రామా తెలిస్తే ఎవరికైనా హౌ? అనే అనిపిస్తుంది.

కవితను అరెస్టు చేయకుండా ఉండటానికే ఇంత తతంగం నడిచిందా? అనే అనుమానం కలుగకమానదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొంతకాలంగా భారతీయ జనతా పార్టీపై కత్తులు దూస్తున్నారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేసుకున్న ఆయన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని ప్రతిజ్ఞలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ కుటుంబాన్ని కేసులలో ఇరికించే అవకాశం వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు వదులుకుంటుంది? అన్న అనుమానం సహజంగానే వస్తుంది. కానీ జరగబోయేది ఇదే! మద్యం కేసులో అప్రూవర్‌గా మారడానికి శరత్‌చంద్రారెడ్డిని ఒప్పించవలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై కేంద్ర పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్టు కొద్ది వారాల క్రితమే చెప్పాను. అప్రూవర్‌గా మారడానికి శరత్‌ను ఒప్పిస్తే జగన్‌కు లాభమేమిటో? కేంద్ర ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఏమిటో? మధ్యలో కవిత సేఫ్‌ ఎలా అవుతారు? వంటి ప్రశ్నలు మిమ్మల్ని తొలుస్తున్నాయి కదా! అలా సందేహాలు రావడం కూడా సహజమే. ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే శరత్‌ అప్రూవర్‌గా మారడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఏమిటి అన్నది ముందుగా తెలుసుకుందాం.


కేజ్రీ ఇన్‌.. కవిత సేఫ్‌!

మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా సీబీఐ అధికారులు విచారించారు. కవితను కూడా విచారించారు. శరత్‌ అప్రూవర్‌గా మారితే ఈ ఇద్దరినీ దెబ్బ కొట్టవచ్చు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటారు కదా! కానీ జరగబోతున్నది వేరు. ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న తంతు గురించి తెలుసుకున్న కేసీఆర్‌ తన బిడ్డ కవితను రక్షించుకోవడానికి రంగంలోకి దిగారు. తన మాట జవదాటని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వద్దకు దూతలను పంపారు. వివేకా హత్య కేసులో అరెస్టు కాకుండా ఎంపీ అవినాశ్‌ రెడ్డిని కాపాడుకోవాలని అనుకుంటున్నట్టుగానే కవిత జోలికి కూడా రావొద్దని కేంద్ర పెద్దలకు నచ్చజెప్పవలసిందిగా జగన్‌కు సూచించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

తెలంగాణలో తన ఆర్థిక ప్రయోజనాల రీత్యా కేసీఆర్‌తో స్నేహం అవసరం కనుక జగన్‌ కూడా ఈ సూచనకు అంగీకరించారని తెలిసింది. అంతే, తెర వెనుక కథ సాఫీగా జరిగిపోయింది. అవినాశ్‌ రెడ్డి, కవిత జోలికి రాకుండా ఉండటానికి అంగీకరిస్తే అప్రూవర్‌గా మారడానికి శరత్‌ను ఒప్పించడంలో తన వంతు పాత్ర పోషిస్తానని కేంద్ర పెద్దలకు జగన్‌ హామీ ఇచ్చారట. తెలంగాణలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీకి దీని వల్ల ప్రయోజనం ఏమిటి? అనే సందేహం సహజంగానే వస్తుంది. అయితే మద్యం కేసులో కేంద్ర పెద్దల ప్రథమ టార్గెట్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మాత్రమే. శరత్‌ అప్రూవర్‌గా మారితే ఈ కేసులో కేజ్రీవాల్‌ను పకడ్బందీగా ఇరికించవచ్చు. ఉత్తరాది రాష్ర్టాలలో, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీకి కంటిలో నలుసులా కేజ్రీవాల్‌ మారారు. మద్యం కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే కలిగే ప్రయోజనం ముందు కవితను వదిలిపెట్టడం వల్ల జరిగే నష్టం స్వల్పం అన్న అంచనాకు కేంద్ర పెద్దలు కూడా వచ్చారట. అంతే, కేంద్రంలోని పెద్దలు, తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడబలుక్కున్నారు. శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిపోవడం జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది కేజ్రీవాల్‌ అరెస్టు మాత్రమే. మద్యం కేసులో కవిత మాత్రం సేఫ్‌గా ఉండబోతున్నారు.

కవితను వదిలేయడం వల్ల తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్టే కదా? అంటే అవుననే చెప్పక తప్పదు. భారతీయ జనతా పార్టీ పెద్దలకు కేంద్రంలో అధికారంలోకి రావడం ముఖ్యం. ఆ క్రమంలో సొంత పార్టీకి చెందిన రాష్ట్ర నేతల రాజకీయ ఆకాంక్షలు బలైనా పట్టించుకోరని భావించాలి. జాతీయ పార్టీల ఆలోచనా సరళి ఇలాగే ఉంటుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీతో జట్టు కట్టడానికి కేజ్రీవాల్‌ సిద్ధపడుతున్నారు. అదే జరిగితే 2024 ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుంది. నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఈ కలయిక జరగకూడదు. అందుకే అరవింద్‌ కేజ్రీవాల్‌ను ప్రథమ టార్గెట్‌గా ఎంచుకున్నారు. తెలంగాణలో ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు వస్తాయి. అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కేసీఆర్‌ను తమ దారిలోకి ఎప్పుడైనా తెచ్చుకోవచ్చునన్నది కేంద్ర పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. కవిత జైలుకు వెళ్లకుండా క్షేమంగా ఉండాలంటే బీజేపీ పెద్దలతో చేతులు కలపక తప్పని పరిస్థితిలో కేసీఆర్‌ కూడా ఉన్నారు. మధ్యలో మధ్యవర్తిగా జగన్మోహన్‌ రెడ్డి ఉండనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌ను ఇరికించడానికి పకడ్బందీ వ్యూహ రచన జరిగిపోయింది. తమ పార్టీ కేంద్ర పెద్దల ఆలోచనలు తెలియక బండి సంజయ్‌ లాంటి నాయకులు కేసీఆర్‌తో ఢీ అంటున్నారు. జైలుకు కూడా వెళ్లొచ్చారు.

బీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య నిజంగానే పోరు జరుగుతోందని నమ్ముతున్న కార్యకర్తలు చొక్కాలు చించుకుంటున్నారు. రాజకీయ క్రీడలో నాయకులు ఎప్పుడూ సేఫ్‌గానే ఉంటారు. బలయ్యేది కార్యకర్తలు మాత్రమే. మద్యం కేసులో కవితను అరెస్టు చేయకపోవడం వల్ల భారత రాష్ట్ర సమితి–భారతీయ జనతా పార్టీ మధ్య అవగాహన కుదిరిందని ప్రజలు అనుమానిస్తున్నారని ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి వంటి వారు మనసులో మాట కక్కేశారు కూడా. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయలేకపోయారంటే అది వారి చేతగానితనం మాత్రం కాదు.

బళ్లారిలో గాలి జనార్దన్‌ రెడ్డి కోటలోకి ప్రవేశించి తెల్లారేసరికి అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన సీబీఐ అధికారులకు అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయడం కష్టం కాదు కదా? అంతా జగన్మాయ! అవినాశ్‌ రెడ్డి అరెస్టు కాకుండా అదృశ్య శక్తి అడ్డుపడుతూనే ఉంటుంది. నిజానికి వివేకా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు పకడ్బందీగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు వారి చేతులు కట్టేస్తున్నారు. దీంతో ప్రతిష్ఠాత్మక సీబీఐ మొదటిసారిగా అంతులేని అప్రతిష్ఠను మూటగట్టుకుంది. అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయడానికి ఇప్పటిదాకా మీకు అడ్డులేదు కదా? ఎందుకు అరెస్టు చేయలేదు? అని అతడికి ముందస్తు బెయిలు మంజూరు చేసిన న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలో ఔచిత్యం ఉంది. వివేకా కేసును ఇంతకుముందు దర్యాప్తు చేసిన అధికారి రామ్‌సింగ్‌పై ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కేసు పెట్టి వేధించినా కేంద్రం పట్టించుకోలేదు. సీబీఐకి ఇప్పుడు కొత్త డైరెక్టర్‌ వచ్చాక పరిస్థితి మరింత క్షీణించింది. అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయవచ్చునని అధికారికంగా ఆదేశిస్తున్నారు. అరెస్టు ప్రయత్నాలు మొదలుపెట్టగానే ‘స్టాప్‌ ప్లీజ్‌’ అని మౌఖికంగా చెబుతున్నారట. ఈ డ్రామా నడుస్తుండగానే అవినాశ్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌ లభించింది. ప్రస్తుతానికి కథ కంచికి చేరింది. ఒక్క శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం వల్ల ఎంత మందికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయో అర్థమవుతోందా? జైలుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడకుండా అవినాశ్‌ రెడ్డి కాలర్‌ ఎగరేసి తిరుగుతున్నారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు కావాల్సిన కవిత క్షేమంగా ఉండటమే కాకుండా రాజకీయ ప్రక్రియల్లో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అది చేస్తాను–ఇది చేస్తాను అని తొడలు చరిచిన కేసీఆర్‌ ఇప్పుడు గుంభనంగా ఉంటున్నారు.

పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాల సమావేశానికి కూడా బీఆర్‌ఎస్‌ దూరంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన జగన్మోహన్‌ రెడ్డి ఎప్పటిలాగే చక్కటి చిరునవ్వులు చిందిస్తున్నారు. అయితే కేజ్రీవాల్‌ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోతోంది. అంటే ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేజ్రీవాల్‌ మాత్రమే బకరా కాబోతున్నారన్న మాట! రాజకీయాలా – మజాకానా!

మోదీ సైతం..

కేసీఆర్‌ను జైలుకు పంపుతామని జబ్బలు చరుచుకుంటూ వచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పుడు మద్యం కేసులో ఇరుక్కున్న కవితను కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఒక్క వ్యక్తి అప్రూవర్‌గా మారడం వెనుక ఇంత పెద్ద కథ నడిచిందంటే నమ్మడం కష్టంగానే ఉంటుంది. రానున్న రోజుల్లో కూడా కవిత క్షేమంగా ఉంటే ఈ కథనం వాస్తవమని నమ్మక తప్పదు. అవినాశ్‌ రెడ్డి అరెస్టు కాకుండా ఉన్నంత వరకు అంతా స్ర్కిప్టు ప్రకారమే జరిగింది. ఇక కవిత, కేజ్రీవాల్‌ వ్యవహారమే తేలాల్సి ఉంది. రానున్న రోజుల్లో కేజ్రీవాల్‌ను మాత్రమే అరెస్టు చేస్తే ఈ కథనంలో ఎక్కడా అవాస్తవం లేదని భావించవచ్చు. నిజానికి శరత్‌ అప్రూవర్‌గా మారడం రాత్రికి రాత్రి జరగలేదు. గడచిన కొన్ని మాసాలుగా తెర వెనుక కథ నడుస్తోంది. మద్యం కేసులో విచారణకు హాజరైన కవితను ఈడీ అధికారులు అరెస్టు చేస్తారని అప్పట్లోనే అందరూ భావించారు.

అయితే కేసీఆర్‌ తరఫున జగన్మోహన్‌ రెడ్డి రంగంలోకి దిగి తనకు అత్యంత ఆప్తుడైన అవినాశ్‌ రెడ్డిని కూడా కాపాడుకోవచ్చునన్న ఉద్దేశంతో శరత్‌ చంద్రారెడ్డిని ఒప్పించడంలో తన వంతు పాత్ర పోషించారు. గాడిదకు వెనకాల, ఎద్దుకు ముందూ నడవకూడదు అంటారు. అలాగే కేసులు ఉన్నవాడితో సహవాసం చేస్తే ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ పడుతుందని ఇప్పుడు శరత్‌ చంద్రారెడ్డి విషయంలో రుజువైంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా ఎంతకైనా రాజీపడే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం మినహాయింపు కాదని ఇప్పుడు ఎవరైనా అంగీకరించాల్సిందే. అలా కాని పక్షంలో చేతికి చిక్కిన రాజకీయ శత్రువు కేసీఆర్‌ను వదులుకుంటారా? ఇక కేసీఆర్‌ విషయానికి వస్తే అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే బిడ్డ కోసం ప్రతిపక్షాలకు దూరంగా జరుగుతున్నారు. ఈడీ లేదు బోడీ లేదు– మహా అయితే అరెస్టు చేసి జైలుకు పంపుతారు అంతేగా? అని బీరాలు పోయిన కేసీఆర్‌, బిడ్డ కోసం రాజీ పడబోతున్నారు.

ఈ పరిణామం తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపుతుందా? లేదా? అన్నది కాంగ్రెస్‌ పార్టీ పనితీరును బట్టి ఉంటుంది. అంది వచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి. ఈ మొత్తం వ్యవహారంలో నీతి ఏమిటంటే, మా నాయకుడు తోపంటే మా నాయకుడు తోపు అని కార్యకర్తలు చొక్కాలు చించుకోకూడదు. నాయకులు ఉభయకుశలోపరిగానే ఆలోచిస్తారు. అందుకే వారు క్షేమంగా ఉంటారు. కేసుల్లో ఇరుక్కొని బాధపడేది కార్యకర్తలు మాత్రమే. తండ్రి హత్యకు కారకులైన వారికి శిక్ష పడాలని ఒంటరి పోరాటం చేస్తున్న డాక్టర్‌ సునీత వంటి వారు పోరాడుతూనే ఉండాల్సి వస్తోంది.

ఎవరో అనడం కాదు.. స్వయంకృతం!

ఇప్పుడు న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతోందని తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్య విషయానికి వద్దాం. ‘ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి’తో పాటు మరో చానల్‌లో జరిగిన చర్చలో పాల్గొన్న ఒకరిద్దరు చేసిన కామెంట్స్‌పై నొచ్చుకున్న న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అవినాశ్‌ రెడ్డికి ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పులో భాగంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అనుకోకుండా ఒకరిద్దరు చేసిన వ్యాఖ్యలు న్యాయమూర్తిని నొప్పించి ఉండవచ్చు. అయితే అది న్యాయ వ్యవస్థపై ఉద్దేశపూర్వంగా చేసిన దాడి మాత్రం కాదు. న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత జగన్‌ అండ్‌ కో తరఫున నీలి మీడియా, కూలి మీడియా రెచ్చిపోయాయి. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా గతాన్ని మరచి నోరు పారేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయమూర్తులపై ఇదే ముష్కర మూక ముప్పేట దాడి చేసినప్పుడు ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్‌’ చానల్‌ రక్షణ కవచంలా నిలిచాయన్న విషయం మరువకూడదు. న్యాయమూర్తులకు కులాలు కూడా అంటగట్టి మరీ దాడి చేసిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారు. అవినాశ్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌ లభించి ఉండకపోతే వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారని ఇదే అసుర మూక విరుచుకుపడేది. గతంలో అలాగే చేశారు కదా! ఇప్పుడు న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతోందని న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల విషయానికి వద్దాం. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను బయటివాళ్లు దెబ్బతీయాల్సిన పనిలేదు. న్యాయవ్యవస్థలో ఉన్నవారే తమ తీర్పుల ద్వారా న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసుకుంటున్నారన్న వాదనా ఉంది.

న్యాయమూర్తులు మానవ పరిమితులకు అతీతులు కారు. సమాజంలో ఉన్న అవలక్షణాలకు భిన్నంగా న్యాయ వ్యవస్థ మాత్రం ఎలా ఉంటుంది? ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రెండు తీర్పుల గురించి చెప్పుకోవాలి. ముందస్తు బెయిల్‌ కోసం ఇంతకు ముందు అవినాశ్‌ రెడ్డి పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సీబీఐ విచారణ ఎలా ఉండాలో నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై దాఖలైన అప్పీల్‌ను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఆదేశాలు దారుణం(అట్రాషియస్‌), ‘ఇలాంటి ఆదేశాలను ఆమోదించలేమ’ని వ్యాఖ్యానించడమే కాకుండా సదరు తీర్పును కొట్టివేయలేదా? వివేకా కేసులోనే మరో నిందితుడైన గంగిరెడ్డికి బెయిల్‌ రద్దు చేస్తూనే ఫలానా తేదీన డిఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేయాలని ఇచ్చిన ఆదేశాలను చూసి భారత ప్రధాన న్యాయమూర్తి తల పట్టుకోలేదా? సదరు ఆదేశాలను కొట్టేయలేదా? ఈ రెండు సందర్భాలలో న్యాయ వ్యవస్థ పరువే కదా పోయింది? ఇందులో మా కుట్ర లేదు కదా? న్యాయ సమీక్షకు నిలువని తీర్పులతో న్యాయమూర్తులే న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసుకుంటున్నారు.

మిగతా వ్యవస్థలలో వలె సమీక్షలో తేలిపోయే తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులపై చర్యలు ఉండవు. సదుద్దేశంతో కల్పించిన ఈ వెసులుబాటు దుర్వినియోగం కావటం లేదా? తీర్పులు తమకు న్యాయంగా అనిపించకపోయినా అప్పీళ్లకు వెళ్లడం మినహా పౌరులకు మరో మార్గం లేదు. ఇదేమి తీర్పు అని ఆగ్రహం వ్యక్తంచేసిన సందర్భాలలో ఉన్నత న్యాయస్థానాలు కూడా సదరు తీర్పు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. మన దేశంలోని ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. We, the people of India అంటూ మన రాజ్యాంగ పీఠిక మొదలవుతుంది. అంటే రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అయినప్పటికీ ప్రజల తరఫున అని ఆయనే పేర్కొన్నారు. అంటే పౌరులే సుప్రీం. పౌరులు రూపొందించిన రాజ్యాంగంలో పౌరులకు లేని హక్కులు మరెవరికైనా ఎలా ఉంటాయి? అవినాశ్‌ రెడ్డికి ముందస్తు బెయిలు మంజూరు చేసిన న్యాయస్థానం విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యల గురించి చర్చించుకుందాం. వివేకానంద రెడ్డి భౌతిక కాయంపై గాయాలు ఉన్నాయా? అని న్యాయస్థానం ప్రశ్నించగా, ఉన్నాయని సీబీఐ తరఫు న్యాయవాది చెప్పారు. అయితే అది హత్య అని చెప్పడానికి ఆధారాలు ఉన్నప్పటికీ, భౌతికకాయం వద్ద ఉన్న రక్తం మరకలను తుడిచినంత మాత్రాన నష్టం ఏమిటి అని న్యాయస్థానం ప్రశ్నించడం దిగ్ర్భాంతి కలిగించక మానదు.

ఎవిడెన్స్‌ యాక్ట్‌ ప్రకారం నేరం జరిగిన ప్రదేశంలో మార్పులు చేర్పులు చేయకూడదు. దర్యాప్తు అధికారి వచ్చి అన్నీ పరిశీలించి నోట్‌ చేసుకొనే వరకు ఎవరూ నేరం జరిగిన ప్రాంతానికి వెళ్లకూడదు. అయినా రక్తం మరకలు తుడిచినంత మాత్రాన అది హత్య కాకుండా పోతుందా? అని న్యాయస్థానం ఎలా అంటుంది? బెయిలు కేసుల విచారణ సందర్భంగా కేసుల మెరిట్‌లోకి వెళ్లకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో సూచించింది. ప్రస్తుత కేసులో న్యాయస్థానం ఈ సూచనను ఉల్లంఘించింది. అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు కర్నూలు వెళ్లగా ఆయన అనుచరులు వారిని అడ్డుకోలేదా? సీబీఐ అధికారులనే తరిమి కొట్టగలిగిన వారు సాక్షులను బెదిరించకుండా వదిలిపెడతారా? హైదరాబాద్‌లో ‘ఏబీఎన్‌’ ప్రతినిధులపై అవినాశ్‌ రెడ్డి మనుషులు దాడి చేసి గాయపరచలేదా? అవినాశ్‌ తల్లికి యాంజియోప్లాస్టీ మాత్రమే జరిగింది. ఒకరోజు కంటే ఎక్కువగా ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదు.

అయినా నిందితుడి తల్లి, చెల్లి, భార్య లేదా మరో దగ్గరి బంధువుకు చికిత్స జరిగితే బెయిల్‌ లేదా ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తారా? అలా అయితే ఈ దేశంలో పేదలు మినహా మిగతా వర్గాలకు చెందిన ఒక్క నేరస్థుడిని కూడా జైలుకు పంపలేరు. ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం జైల్లో ఉన్న సత్యేంద్ర జైన్‌ 35 కిలోల బరువు తగ్గడమే కాకుండా, జారిపడి గాయపడినా అనారోగ్య కారణాలపై ఆయనకు బెయిల్‌ ఇవ్వడాన్ని సీబీఐ వ్యతిరేకించింది. ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపి పరీక్షలు చేయించాలని సీబీఐ కోరింది. అవినాశ్‌ రెడ్డి విషయంలో సీబీఐ అలా ఎందుకు కోరలేదు? అవినాశ్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బెయిల్‌ మంజూరులో అవినీతి, అవకతవకలు చోటుచేసుకుంటున్న విషయాన్ని సుప్రీంకోర్టు సైతం పలు సందర్భాలలో ఎత్తిచూపినది నిజం కాదా? అంతెందుకు ఓబుళాపురం మైనింగ్‌ కేసులో గాలి జనార్దన్‌ రెడ్డికి బెయిలు మంజూరు చేయడానికి సీబీఐ కోర్టు న్యాయమూర్తి పట్టాభి రామారావు ఐదు కోట్లు తీసుకుంటున్నారని సీబీఐ ఫిర్యాదు చేయగానే ఇదే తెలంగాణ హైకోర్టు(అప్పుడు ఉమ్మడి హైకోర్టు) సదరు న్యాయమూర్తి అరెస్టుకు అనుమతి ఇవ్వలేదా? వ్యవస్థలోని లొసుగులు, వెసులుబాట్లను ఉపయోగించుకొని నిందితులు, నేరస్థులు న్యాయ వ్యవస్థతో ఆడుకుంటున్నారు.

ఇలాంటి సందర్భాలలో నేరస్థులు, నిందితుల ఆటలు సాగకుండా న్యాయ వ్యవస్థ వ్యవహరించాలని పౌర సమాజం కోరుకోవడంలో తప్పేముంది? ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విషయమే తీసుకుందాం. అవినీతి కేసులలో చిక్కుకున్న ప్రజాప్రతినిధుల కేసులలో విచారణ ఏడాదిలోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ ఉన్నప్పుడు స్పష్టంగా ఆదేశించారు. ఆయన పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత జస్టిస్‌ లలిత్‌ కూడా పదవీ విరమణ చేశారు. జగన్‌పై కేసుల విచారణకు అతీగతీ లేదు. విచారణ జాప్యం చేయడానికి ఇన్ని వెసులుబాట్లు ఉన్నప్పుడు ఏడాదిలోపే విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించి ఉండాల్సింది కాదు. మరో ఏడాది గడిస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డికి ఐదేళ్ల పదవీ కాలం ముగుస్తుంది. ఆ తర్వాత తీరిగ్గా ఎప్పుడో తీర్పు వచ్చి జగన్‌ నేరస్థుడని నిర్ధారణ అయితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాన్ని ఒక ఆర్థిక నేరస్థుడు పరిపాలించినట్టే కదా? నిజానికి న్యాయ వ్యవస్థను పౌరులు ఎవరూ కించపరచడం లేదు. నేరస్థులే న్యాయ వ్యవస్థతో ఆడుకుంటున్నారు. కొందరు న్యాయమూర్తులే న్యాయ వ్యవస్థకు కళంకం తెస్తున్నారు.

అవినాశ్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పు లోపభూయిష్టంగా ఉందని పలువురు న్యాయ నిపుణులే అభిప్రాయపడుతున్నారు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో తన పిటిషన్లపై విచారణ సందర్భంగా డబ్బుకు వెనుకాడకుండా పేరు మోసిన లాయర్లను నియమించుకున్న అవినాశ్‌ రెడ్డి, ఇప్పుడు ఒక జిల్లా కోర్టు న్యాయవాదిని నియమించుకోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయా వ్యవస్థలు, అధికారంలో ఉన్న వాళ్లు ఎవరి ఆట వారు ఆడుకుంటున్నారు. న్యాయం కోసం పోరాడుతున్న డాక్టర్‌ సునీతకు ఇప్పుడు దేవుడే దిక్కు. వివేకా కేసులో సీబీఐ సేకరించిన ఆధారాల ప్రకారం చాలా మంది పునాదులు కదులుతాయి. అయితే ప్రస్తుతానికి సీబీఐ అధికారుల చేతులు కట్టేశారు. కనుక అసలు నిందితులు ప్రస్తుతానికి కులాసాగా ఉంటారు. వ్యవస్థలలో అన్యాయం జరిగినప్పుడు పౌరులు ఆశ్రయించేది న్యాయస్థానాలనే. న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో ఇప్పటికీ గొప్ప విశ్వాసముంది. ఈ ఉత్కృష్ట బాధ్యతను న్యాయ వ్యవస్థ విస్మరించకూడదు.

ఆర్కే

Updated Date - 2023-06-04T10:14:13+05:30 IST