Rammohan Naidu: పులివెందుల పంచాయతీలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: రామ్మోహన్ నాయుడు

ABN , First Publish Date - 2023-09-18T20:16:39+05:30 IST

లోక్‌సభలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఖండించారు. పార్లమెంట్ అన్నది కూడా మరిచిపోయి పులివెందుల పంచాయతీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rammohan Naidu: పులివెందుల పంచాయతీలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: రామ్మోహన్ నాయుడు

ఢిల్లీ: లోక్‌సభలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఖండించారు. పార్లమెంట్ అన్నది కూడా మరిచిపోయి పులివెందుల పంచాయతీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగౌరవపరిచే విధంగా మిథున్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. తోటి పార్లమెంటు సభ్యుడనే గౌరవాన్ని కూడా లెక్కచేయకుండా, స్థానాన్ని లెక్కచేయకుండా, ఎక్కడ మాట్లాడుతున్నామో అది కూడా లెక్కచేయకుండా ఈ రకంగా మాట్లాడడం అనేది వైసీపీ పార్టీకి, వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలకే చెల్లుతుందని ఆయన అన్నారు. ‘‘లోక్‌సభలో చేపట్టిన చర్చలో పాల్గొన్నాం. జాతీయ స్థాయిలో టీడీపీ పాత్ర ఎలా ఉందో చర్చ సందర్భంగా చెప్పాము. చంద్రబాబు నాయుడుపై ఏపీలో ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి, అరెస్ట్ చేశారనే అంశాన్ని సభలో ప్రస్తావించాము. చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే వైసీపీ ఎంపీలు, వారి సీట్ల కింద కుంపటి పెట్టినట్టు ఎగిరారు. చంద్రబాబు నాయుడు పేరు చెబితే వైసీపీ నేతల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని చెబితే వైసీపీ ఎంపీలు మాట్లాడినివ్వకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఏపీ అసెంబ్లీలోనే ఇలాంటి పద్దతి చూసే వాళ్ళం. కానీ ఇప్పుడు పార్లమెంట్‌లో కూడా చూస్తున్నాం. పార్లమెంట్‌లో ఎంపీలకు ఉన్న గౌరవాన్ని అగౌరవ పరిచే విధంగా మాట్లాడారు.’’ అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.


‘‘మేము వైసీపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నాము. నిధుల మళ్లింపు ఎక్కడ జరిగిందో చెప్పాలి. చంద్రబాబు నాయుడికి, ఆయన కుటుంబ సభ్యులకి, ఆయనకు సంబంధించిన వ్యక్తులకి నిధులు అందితే ఆధారాలు చూపించండి. ఒక్క అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమవుతుందని జగన్మోహన్ రెడ్డి అనుకునే వారు. చంద్రబాబు నాయుడుకు 45 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది. బాబుపై అవినీతి ఆరోపణలు ఏ రోజు రాలేదు. మొట్ట మొదటిసారిగా ఈ ఒక్క కేసును తెచ్చి బలవంతంగా రుద్దుతున్నారు. చంద్రబాబును అవినీతిపరుడుగా చూపించాలని వైసీపీ వాళ్లు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఈ రోజు బట్టబయలైంది. డైరెక్ట్‌గా ఛాలెంజ్ చేస్తున్నా.. నిధుల మళ్లింపు ఎక్కడ జరిగిందో చెప్పాలి. ఢిల్లీలో ఏ వేదికకు రమ్మన్నా సరే మేము సిద్ధంగా ఉన్నాం.’’ అని మిధున్ రెడ్డికి రామ్మోహన్ నాయుడు సవాల్ విసిరారు.

Updated Date - 2023-09-18T20:16:39+05:30 IST