వంటలు: వడపిందెల ఊరుగాయ
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:59 AM
మామిడికాయ పిందెగా పుట్టినప్పటి నుంచి పచ్చికాయగా, పలకబారిన కాయగా, టెంకె పట్టిన కాయగా, చివరకు పండుగా మారే వరకూ దాని పరిమళం, రుచి, గుణాలు రోజు రోజుకీ మారుతుంటాయి.
మామిడికాయ పిందెగా పుట్టినప్పటి నుంచి పచ్చికాయగా, పలకబారిన కాయగా, టెంకె పట్టిన కాయగా, చివరకు పండుగా మారే వరకూ దాని పరిమళం, రుచి, గుణాలు రోజు రోజుకీ మారుతుంటాయి. లేతమామిడికాయని ‘వడపిందె’ అంటారు. వగరుగా కొంచెం పుల్లగా ఉంటాయి. టెంకె పట్టే దశకు వచ్చేసరికి వగరు తగ్గి పులుపు పెరుగుతుంది. టెంకె పట్టాక పులుపే ప్రధానమవుతుంది.
రఘునాథసూరి భోజనకుతూహలంలో పులుపుగా, వగరుగా ఉండే వడపిందె ‘‘కంఠా మయోగ్నికరశ్చ బాలః’’ కంఠవ్యాధులను తగ్గించి జఠరాగ్నిని పెంచుతుందన్నాడు. మావిచిగురు లాగానే వడపిందెలూ, గొంతుని శ్రావ్యంగా చేస్తాయని!
శరీరంలో వేడిని తగ్గిస్తుందని దీన్ని వడ పిందె అన్నారు. వడకు ఇది రాలిపోతుందని వడపిందె అన్నారని మరో అర్థం ఉంది. ‘‘రాలెడు వడపిందె నీదు రాజ్యం బనఁగన్’’ అని కవిప్రయోగం కూడా ఉంది. సూర్యరాయాంధ్ర నిఘంటువు మరో అడుగు ముందుకేసి, వడ పిందె అంటే, లేతమామిడి కాయతో పెట్టిన ఊరుగాయ అనే అర్థాన్నిచ్చింది.
వడపిందెల ఊరుగాయ: వడ పిందెలను ముక్కలుగా తరిగి ఉప్పు, పసుపు కలిపి ఊరబెట్టి రసం పిండేసి ఎండబెట్టి, మిరియాలపొడి కలిపి తాలింపు పెట్టిన ఊరుగాయ ఇది. ఆవ కాయ, మాగాయలకన్నా ముందే ఈ వడపిందెల ఊరుగాయ సిద్ధం అయ్యేది పూర్వం రోజుల్లో!
బాలకృష్ణుడు యమునా నది ఒడ్డున గోపబాలురతో కలిసి పద్మాకారంలో కూర్చుని చంకలో తగిలించుకున్న ఉట్టిలో ఉన్న కుండ లోంచి పెరుగన్నం తీసుకుని ఈ వడపిందెల ఊరుగాయ ముక్కను వేళ్ల సందున పెట్టుకుని నంజుకుంటూ తిన్నాడని రుతుచర్య అనే పుస్తకంలో వర్ణన ఉంది. భాగవతంలో పోతన ఊరుగాయ ముక్క అని వదిలేస్తే, రుతుచర్య అది వడపిందె ఊరుగాయ అంది!
శ్రీనాథుడు ‘‘అరుణగభస్తిబింబ ముదయాద్రి పయిం బొడతేర గిన్నెలలఁ బెరుగును వంట కంబు వడపిందెలునుం గుడువంగఁ బెట్టి...’’ అంటే, సూర్యోదయం అవుతుండగానే గిన్నెలో పెరుగన్నాన్ని, వడపిందెల ఊరుగాయను సిద్ధం చేసిన దృశ్యాన్ని వర్ణిస్తాడు. బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిన తెలుగు సంప్రదాయం అది!
వడంబలి: వడపిందెల ముక్కలు వేసి కాచిన రాగి లేదా జొన్నంబలిని వడంబలి అంటారు. ఇది వేసవిలో వడ కొట్టనీయదు!
వడపిందెల కూర: వగరు, పులుపు రుచులతో ఉండే వడపిందెల్ని తరిగి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర వంటి సుగంధద్రవ్యాలను కలిపి ఇగురుకూర వండుకోవచ్చు.
ఉగాది పచ్చడి: ఆరు రుచుల ఉగాది ప్రసాదంలో వగరు రుచి కోసం లేతమామిడి వడపిందెల ముక్కల్ని, చేదు కోసం వేప పూలను, పులుపు కోసం కండ పట్టిన మామిడి ముక్కల్ని తీపి కోసం చెరకు రసం లేదా బెల్లాన్ని కొద్దిగా ఉప్పునీ కలుపుతారు.
వడపిందెల పచ్చడి: వడపిందెలతో కూడారోటి పచ్చడి చేసుకోవచ్చు. ఇందులో పులుపు కోసం టెంకె పట్టిన మామిడికాయ ముక్కలు కలిపి నూరి తాలింపు పెట్టుకుంటే కమ్మని పచ్చడి తయారవుతుంది.
ఇంకా... పప్పు, పులుసు, ముక్కల పచ్చడి వంటి అనేక వంటల్లోనూ వడపిందెను ఉపయోగించుకోవచ్చు.
వైద్యచింతామణి అనే తెలుగువైద్యగ్రంథంలో ధేనుకోండ కేశవామాత్యుడు ‘‘వడపిందె బిల్వ రసమును/గొడిశయును సుకోష్టుకమునుగూర్చి కపాయం/బిడ నతిసారజ్వరములు/నుడుగును కులిశమున నగము లొరలిన మాడ్కిన్’’ అంటే, వడపిందెలు, మారేడుకాయ, కొడిశపాల (కుటజ) వీటిని గుజ్జుగా నూరి నీళ్ళలో వేసి మరిగించి వడగట్టి ఒక కప్పు మోతాదులో తాగితే వజ్రాయుధానికి కొండలు లొంగినట్టు కలరా లాంటి భయంకర అతిసార వ్యాధులు, జ్వరం తగ్గుతాయట.
వడపిందెల్లో ‘సి’ విటమిన్ ఉంటుంది.పెక్టిన్ వంటి పీచు పదార్థాలు పేగుల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు జీవకణాలపైన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. చక్కెర చాలా తక్కువగా వీటిలో ఉంటుంది కాబట్టి, కండబట్టిన మామిడికన్నా వడపిందెలు షుగరు రోగులకు మేలు చేస్తాయి. పుల్లని రుచిని కలిగించే సహజ ఆమ్లాలు కూడా కొద్ది కొద్దిగానే ఉంటాయి కాబట్టి ఇవిఊరుగాయలకు గానీ ఇతర వంటకాలకు గానీ అనువైనవి. చెట్టు నుండి కోయాల్సిన పని లేదు. రాలిపడిన వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాం అంతే!
డా. జి.వి పూర్ణచందు, 94401 72642