Share News

టమాటాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు

ABN , Publish Date - Mar 04 , 2026 | 07:17 AM

టమాటా ధరలు కొద్ది రోజుల నుంచి రూ.2 నుంచి రూ.3లు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం వివిధ మార్కెట్లకు రైతులు తీసుకువస్తున్న టమాటాలు హోల్‌సేల్‌గా మాత్రమే ధర లభిస్తున్నది. దీంతో పెట్టుబడి కాదు కదా, కనీసం కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టమాటాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు
Tomato

  • టమాటాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు

  • ధర పడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే ఉత్తమం

  • కెచప్, జామ్ తయారీతో ఆదాయం

  • ఆర్ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథరావు

అనకాపల్లి అగ్రికల్చర్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): టమాటా ధరలు (Tomato price) కొద్ది రోజుల నుంచి రూ.2 నుంచి రూ.3లు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం వివిధ మార్కెట్లకు రైతులు తీసుకువస్తున్న టమాటాలు హోల్‌సేల్‌గా మాత్రమే ధర లభిస్తున్నది. దీంతో పెట్టుబడి కాదు కదా, కనీసం కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటువంటి తరుణంలో రైతులు దిగులు పడకుండా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి విక్రయించడం ద్వారా నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్) ఫోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీవీకే జగన్నాథరావు సూచిస్తున్నారు. టమాటాలతో నిల్వ పచ్చడి, కెచప్, జామ్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారీ గురించి ఆయన వెల్లడించిన సమాచారం.


నిల్వ పచ్చడి(ఊరగాయ)..

కావాల్సిన పదార్థాలు: కిలో పండిన టమాటాలు, 500 మిల్లీలీటర్ల నూనె, 300 గ్రాముల చింతపండు, 150 గ్రాముల ఉప్పు, 150 గ్రాముల కారం సిద్ధం చేసుకోవాలి. తాలింపునకు ఒక టీ స్పూన్ అవాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, 50 గ్రాముల చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, 12 ఎండు మిరపకాయలు, 100 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు, అవసరం మేరకు కరివేపాకు, కొద్దిగా ఇంగువు, చెంచాడు మెంతిపొడి.

తయారీ విధానం:

టమాటాలను బాగి కడిగి తడి వస్త్రంతో తుడవాలి. లేదంటే తడి ఆరే వరకు అరబెట్టుకోవాలి. తర్వాత మధ్యష్ట పరిమాణంలో ముక్కలుగా కోసి, చింతపండు వేసి నానబెట్టాలి. ఓ మూకుడులో నూనె పోసి వేడిచేసి పోపు సామాన్లు మాడకుండా ఒక్కొక్కటిగా వేయాలి. అనంతరం పొయ్యి మీద నుంచి దించి, చల్లారిన తర్వాత గ్రైండర్‌లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. దీనికి మెంతి పొడి కలుపుకోవాలి తర్వాత ముందుగా కలుపుకున్న టమాటా, చింతపండుకు ఉప్పు, కారంపొడి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం పోపు వేసి బాగా కలుపుకోవాలి. పింగాణి లేదా గాజుతో చేసిన జాడీల్లోకి మార్చి, మూత గట్టిగా పెట్టి భద్రపరచుకోవాలి. రెండు, మూడు రోజులు తర్వాత ఒకసారి రుచి చూసి, అవసరమైతే ఉప్పు కలుపుకోవాలి.


టమాటా జామ్..

కావాల్సిన పదార్థాలు:

బాగా ఎరుపు రంగులో ఉన్న కిలో టమాటాలు, అరకిలో పంచదార, మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, అర స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు.

తయారీ విధానం:

టమాటాలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి నీళ్లు పోయకుండా మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి. ఓ మూకుడులో ఈ మిశ్రమాన్ని మోస్తరు మంట మీద ఉడికించాలి. ఇందులోని నీరు ఆవిరై మిశ్రమం సగానికి తగ్గే వరకు ఉడికించాలి. తర్వాత పంచదార, ఉప్పు, వేసి బాగా కలుపుకోవాలి. పంచదార కరిగాక మిశ్రమం పల్చబడుతుంది దీనిని కలుపుతూనే నిమ్మరసం యాలుకులపొడి చేర్చాలి. మిశ్రమం చిక్కబడి మెరిసేలా మారేవరకు పది నుంచి పదిహేను నిమషాలపాటు ఉడికించాలి. ఒక ప్లేట్‌లోకి కొద్దిగా జామ్ తీసుకుంటే అది పక్కకు ప్రవహించకుండా గట్టిగా ఉండాలి. అప్పుడు జామ్ తయారైనట్లుగా భావించి స్టవ్ ఆపేయాలి. జామ్ చల్లారిన తర్వాత తడిలేని, శుభ్రమైన గాజు సీసాలో భద్రపరచుకోవాలి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టుకొని రెండు నెలల వరకు వాడుకోవచ్చు. నెల నుంచి రెండు నెలల వరకు ఫ్రిజ్‌లో ఉంచి నిల్వ చేసుకోవచ్చు.


టమాటా కెచప్..

కావాల్సిన పదార్థాలు:

కిలో టమాటాలు, కొద్దిగా అల్లం, వెల్లుల్లి ముద్ద, ఒక పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా కారం పొడి, ఒక చెంచా యాలుకుల పొడి, అరచెంచా మిరియాల పొడి, రెండు చెంచాల పంచదార, చెంచా ఉప్పు, మూడు చెంచాల వెనిగర్.

తయారీ విధానం:

టమాటాలను శుభ్రంగా కడిగా, తడి లేకుండా వస్త్రంతో తుడుచుకోవాలి. టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి చెంచా పరిమాణంలో సన్నగా తరగాలి. ఉల్లిపాయను చిన్నగా తురిమి పక్కన ఉంచాలి. మిక్సీ జార్‌లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, వెల్లులి వేసుకొని గ్రైండ్ పట్టాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో టమాటా మిశ్రమాన్ని వేసి చిన్న మంటపై పది నిమిషాలపాటు కలుపుతూ ఉడకబెట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో చక్కెర, తగినంత ఉప్పు, వెనిగర్, కారంపొడి యాలుకుల పొడి, మిరియాల పొడి.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. తర్వాత తక్కువ మంట మీద మరో 10 నిమిషాలపాటు ఈ మిశ్రమాన్ని ఉడకనివ్వాలి. కాసేపటి తర్వాత ఈ మిశ్రమాన్ని వడగడితే కెచప్ తయారవుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

వినూత్న బోధనలో ఆ టీచర్ ఆదర్శంగా నిలిచారు: మంత్రి నారా లోకేశ్

హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 04 , 2026 | 08:36 AM