రావిచెట్టు... ఔషధ విలువలు
ABN , Publish Date - Mar 29 , 2026 | 01:06 PM
రావిచెట్టు - శాంతి, ఆయురారోగ్యాలకు సంకేతం అంటుంది అధర్వణ వేదం. వృక్షాల్లో అశ్వత్థవృక్షాన్ని నేనేననీ, ఈ మహావృక్షం మూలాలు ఊర్ధ్వలోకాల్లో ఉన్నాయని, ఇది దివ్యవృక్షం అనీ గీతాకారుడు నొక్కి చెప్పాడు.
రావిచెట్టు - శాంతి, ఆయురారోగ్యాలకు సంకేతం అంటుంది అధర్వణ వేదం. వృక్షాల్లో అశ్వత్థవృక్షాన్ని నేనేననీ, ఈ మహావృక్షం మూలాలు ఊర్ధ్వలోకాల్లో ఉన్నాయని, ఇది దివ్యవృక్షం అనీ గీతాకారుడు నొక్కి చెప్పాడు. ఇందులో అతిశయోక్తి లేదని తాజా పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అశ్వత్థం నీడన ధ్యానం వలన బ్రహ్మజ్ఞానం కలుగుతుందనటం వెనుక శాస్త్రీయత ఉంది.
సిద్ధార్థుడనే రాకుమారుడు ఈ చెట్టు కిందే కూర్చుని జ్ఞానబుద్ధుడయ్యాడని, రావి చెట్టుని బోధివృక్షం అని, జ్ఞానవృక్షం అనీ బౌద్ధులు మతపరమైన నమ్మకంతో అన్నది కాదు... అది మెదడు పనితీరుని పెంచే ఔషధ విలువలు కలిగిన వృక్షం అని ఇప్పుడు రుజువయ్యింది. అధికంగా ఆక్సిజన్ విడుదలచేసే పర్యావరణ మిత్ర వృక్షాల్లో అశ్వత్థ ముఖ్యమైంది కూడా! ప్రతి ఊరికీ 8 దిక్కులా రావిచెట్లు ఉండాలన్నది నియమం కావాలి.
న్యూరోఇన్‌ఫ్లమేషన్ (నరాల్లో వాపు), ఆక్సిడే టివ్ ఒత్తిడి, కణసంకేత మార్గాల నియంత్రణ ఇవి ఆధునిక న్యూరోసైన్స్‌లో ప్రధాన అంశాలు. రావి ఆకుల్లోనూ, పండ్లలోనూ సెరటోనిన్ సహా న్యూరోరసాయన మార్గాలను ప్రభావితం చేసే రసాయనాలున్నాయి. అవి ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి, మెదడు కణాలకు రక్షణనిస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరచే న్యూరోప్రొటెక్టివ్ గుణాలు వీటికున్నాయి!
న్యూరాన్లనే మెదడు కణాల సంఖ్యలో పెరుగుదల, కణనిర్మాణ నాణ్యతల్ని గమనించారు. అమ్నీషియాని తగ్గించి, జ్ఞాపక శక్తిని మెరుగుపరచే గుణాలపైన, ఆల్జీమర్స్, పార్కిన్‌సోనిజంలాంటి న్యూరోడిజెనరేటివ్ వ్యాధులపైన దీని ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారిప్పుడు. మెదడుపైన విషదోషం (న్యూరోటాక్సిసిటీ) ప్రభావాన్ని తగ్గిస్తుందనేది సారాంశం. మన పూర్వులు జ్ఞానానికి ప్రతీకగా భావించిన రావిచెట్టుకి మెదడుని ఉత్తేజితం చేసే గుణాలున్నాయని కనుగొనటం గొప్ప పరిణామం.
‘మెకానిస్టిక్ ఇన్సైట్స్ ఇన్ టు ది న్యూరోప్రొటెక్టివ్ పొటెన్షియల్ ఆఫ్ సేక్రెడ్ ఫికస్ ట్రీ’’ అనే పరిశోధనా వ్యాసం ఎన్నో అద్భుత పరిశోధనాంశాల్ని అందించింది.
జ్వరం, గ్యాస్ట్రిక్ అల్సర్ల నివారణ, క్యాన్సర్ నిరోధక శక్తి, మధుమేహ నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గింపు గుణాలు రావి బెరడుకి, ఆకులకి, పండ్లకి ఉన్నాయనే అంశం పైన ఇప్పుడు పరిశోధనలు సాగుతున్నాయి. దగ్గు, ఆస్తమా, హృద్రోగాలున్నవారికి ఇది మేలు చేస్తుందని, రక్తస్రావాన్ని అరికడుతుందని, రక్తంలో షుగరు స్థాయిని నియంత్రిస్తుందని ఆయుర్వేద గ్రంథాలు పేర్కొన్నాయి. గాయాలను మాన్పే హీలింగ్ గుణం దీనికుంది. దీని బెరడు, ఆకులు, పండ్లను ఔషధాల్లో వాడతారు. ఆకుల్ని, పండ్లనీ ఆహారంగా తీసుకోవచ్చు.
రావిపండ్లలో నరాలబలాన్నిచ్చే సెరటోనిన్ వలన అవి మెంటాట్ లాంటి ఔషధాలతో సమానంగా పనిచేస్తాయని కూడా గుర్తించారు. ఈ పండ్లు తియ్యగా ఉంటాయి. చలవ చేస్తాయి. ఉద్రేకాన్ని తగ్గిస్తాయి. పైత్యాన్ని, అసిడిటీని, అల్సర్లను, వాంతి వికారాల్నీ తగ్గిస్తాయి. పండ్లను ఎండబెట్టి మెత్తగా దంచి రోజూ టీ లాగా కాచుకుని తాగితే ఉబ్బసం తగ్గుతుంది. స్త్రీలలో గర్భాశయ దోషాల్ని, పురుషుల్లో వీర్యదోషాల్ని పోగొట్టి సంతానయోగ్యతనిస్తాయి. గింజలక్కూడా ఇవే గుణాలున్నాయి.
గుండె ఆకారంలో ఉండే రావి ఆకులకు మెదడు వ్యాధులతోపాటు హృదయ దౌర్బల్యాన్ని తొలగించే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ ఆకులు కూడా ఆహార పదార్థంగా తీసుకోదగినవే!
లేత రావి ఆకులకు సమానంగా చింతచిగురు లేదా చుక్కకూర కలిపి, సన్నగా తరిగి మెత్తగా ఉడికించి పప్పు లేదా పొడికూరగా చేసుకోవచ్చు. రావి ఆకుల్ని ఇడ్లీ ప్లేటు మీద పరచి, వాటి మీద ఇడ్లీపిండి వేసి, పైన రావి ఆకులతో మూసి ఆవిరి మీద ఉడికిస్తే, రావి ఆకు గుణాలు అబ్బుతాయి.
రావి లేదా వేపచెట్టు కింద నాగదేవతా విగ్రహాలు ప్రతిష్ఠించుకుని పూజించటానికి రావి విషదోషహరం కావటం ఓ కారణం. మన సాంప్రదాయాల్లోని సాంకేతికతను, శాస్త్రీయతను అర్థం చేసుకుని వాటిని మెరుగు పరచుకోగలగటం విజ్ఞత.
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
పెసరపప్పు క్యారెట్ సలాడ్
కావలసిన పదార్థాలు: పెసరపప్పు - అర కప్పు, క్యారెట్ తురుము - అర కప్పు, పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు, కొత్తిమీర తరుగు - స్పూను, దానిమ్మ పళ్లు - రెండు స్పూన్లు, నిమ్మ రసం - అర స్పూను, పచ్చి మిర్చి ముక్కలు - అర స్పూను, కరివేపాకు రెబ్బలు - కొన్ని, నూనె, ఉప్పు - తగినంత, పోపు గింజలు - స్పూను.
తయారుచేసే విధానం: పెసరపప్పును గంటసేపు నీళ్లలో నానబెట్టి వడకట్టి, కాసేపు ఆరబెట్టాలి. ఐదు నిమిషాల తరవాత ఓ గిన్నెలో పెసరపప్పు, క్యారెట్, పచ్చికొబ్బరి, మిర్చి కలపుకోవాలి. కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసాన్ని చేర్చి, పోపుపెడితే సరి. కప్పుల్లో వేసి అందరికీ అందించే ముందు అలంకరణగా దానిమ్మ గింజల్ని వేయడం మరచిపోకూడదు.
వెజిటబుల్ పకోడా
కావలసిన పదార్థాలు: క్యాబేజీ ముక్కలు - ముప్పావు కప్పు, క్యారెట్ ముక్కలు - పావు కప్పు, క్యాప్సికమ్ ముక్కలు - పావు కప్పు, ఉల్లి - పావు కప్పు, స్వీట్ కార్న్ - రెండు స్పూన్లు, పచ్చి మిర్చి - ఒకటి, అల్లం ముక్కలు - స్పూను, కొత్తిమీర తరుగు - పావు కప్పు, గరం మసాలా - అర స్పూను, ఆమ్‌చూర్ - పావు స్పూను, శనగపిండి - కప్పు, బియ్యం పిండి - రెండు స్పూన్లు, వాము - పావు స్పూను, నూనె, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: అన్ని పదార్థాలని ఓ గిన్నెలో కలుపుకోవాలి. తగినంత నీళ్లనీ కలపాలి. చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని నూనెలో వేయిస్తే వెజిటబుల్ పకోడా సిద్ధం.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎస్ఐఆర్ వర్సెస్ అల్లర్లు.. బెంగాల్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం
Read Latest Telangana News and National News