Share News

‘నల్సార్‌’లో గంజాయి కలకలం

ABN , Publish Date - Mar 29 , 2026 | 07:36 AM

జాతీయ స్థాయిలో ఎంతో గొప్ప పేరున్న నల్సార్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు కొంత కాలంగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పరిధిలో దాదాపు 30ఏళ్ల క్రితం నల్సార్‌ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు.

‘నల్సార్‌’లో గంజాయి కలకలం

  • మత్తుకు బానిసలవుతున్న విద్యార్థులు

  • రోడ్డు ప్రమాదం ఘటనతో వెలుగులోకి..

  • నలుగురు విద్యార్థులపై కేసు

శామీర్‌పేట, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో ఎంతో గొప్ప పేరున్న నల్సార్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు కొంత కాలంగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పరిధిలో దాదాపు 30ఏళ్ల క్రితం నల్సార్‌ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. రెండేళ్లుగా వర్సిటీ విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటుపడి బానిసలవుతున్నట్లు పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి. డ్రగ్స్‌కు బానిసైన ఓ విద్యార్థి మూడు నెలల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోజూ రాత్రి 10 గంటల తర్వాత పలువురు విద్యార్థులు వర్సిటీ నుంచి బయటకు వెళ్తున్నారని తెలిసింది. ఫిబ్రవరి 21న రాత్రి నల్సార్‌ వర్సిటీ నుంచి నలుగురు విద్యార్థులు ప్రియాన్ష్‌ కుమార్‌ మీనా, సాక్షం, గోపిచంద్‌ బయటకు వెళ్లి గంజాయితో పాటు ఇతర మతు పదార్థాలు సేవించారు. రాత్రి 11గంటల సమయంలో బైక్‌పై ముగ్గురు విద్యార్థులు తిరిగి వర్సిటీకి వస్తుండగా పెద్దమ్మ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు విద్యార్థుల్లో సాక్షం దుర్మరణం చెందగా మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాద ఘటనపై వర్సిటీ ప్రొఫెసర్‌ మల్లికార్జున్‌ శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా విద్యార్థులు గంజాయి సేవించినట్లు ఈగల్‌ టీమ్‌ అధికారులు గుర్తించారు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజు విద్యార్థులు ద్రిషక్‌రాజ్‌, నిధాన్‌, దేశ్‌ పాండే, గోపిచంద్‌, ప్రియాన్ష్‌ కుమార్‌, సాక్షం కలిసి రెండు బైక్‌లపై వర్సిటీ నుంచి బయటకు వెళ్లినట్లు తెలిసింది. ఈగల్‌ టీమ్‌ అధికారులు ఆ విద్యార్థులను ఈనెల 24న శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. విద్యార్థులకు డ్రగ్స్‌ టెస్టు చేయగా ద్రిషక్‌రాజ్‌కు పాజిటివ్‌ వచ్చింది.


విచారణలో విస్తుపోయే నిజాలు..

విద్యార్థి ద్రిషక్‌రాజ్‌ పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడించాడు. 2024నుంచి తాను గంజాయి సేవిస్తున్నట్లు తెలిపాడు. మరో విద్యార్థి రుషి వద్ద గంజాయిని కొనుగోలు చేసినట్లు తెలిపాడు. తన మిత్రులు అభిషేక్‌, ఆర్యన్‌, ప్రభు కూడా గంజాయి సేవిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. తాజా ఘటనలో పోలీసులు నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 29 , 2026 | 07:38 AM