Share News

నవతరం.. ‘అనలాగ్‌’ జపం!

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:55 AM

దేశంలోని మెట్రో నగరాలతో పాటు, ప్రముఖ పట్టణాల్లో ఈమధ్య ‘వింటేజ్‌ స్టోర్ల’లో గిరాకీ పెరుగుతోంది.

నవతరం.. ‘అనలాగ్‌’ జపం!

‘డిజిటల్‌’ అష్టదిగ్బంధనంలో చిక్కుకుని అల్లాడుతున్న ప్రపంచం... దాని ఒత్తిడి, మెరుపుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోందా? సరికొత్తగా ‘అనలాగ్‌’ జీవన శైలిని అలవాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తోందా? డిజిటల్‌ సాధనాలపై తక్కువ ఆధారపడుతూ... వాస్తవ ప్రపంచపు కార్యకలాపాలపై దృష్టిపెట్టడమే ‘అనలాగ్‌’ లివింగ్‌. నెటిజన్లు తమ అనలాగ్‌ ప్రయాణాన్ని ఉత్సాహంగా షేర్‌ చేసుకుంటున్న పోస్టులు ఈ ఏడాది ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లువెత్తుతున్నాయి. ఈ ట్రెండ్‌పైనే ఈవారం కవర్‌స్టోరీ.

దేశంలోని మెట్రో నగరాలతో పాటు, ప్రముఖ పట్టణాల్లో ఈమధ్య ‘వింటేజ్‌ స్టోర్ల’లో గిరాకీ పెరుగుతోంది. అలవోకగా ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్‌ ఆర్డర్లు పెట్టే డిజిటల్‌ తరం ఆలోచనా ధోరణిలో, వారి అలవాట్లలో చెప్పుకోదగ్గ మార్పు మొదలవటమే దీనికి కారణం. నవతరం క్రమక్రమంగా పెనువేగపు వర్తమానంపై పాజ్‌ బటన్‌ నొక్కుతూ... నిన్న మొన్నటి తీరుబడి తీరుపై ఇష్టం పెంచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.


అందుకే దేశంలోని ‘అనలాగ్‌’ మార్కెట్‌ గత ఏడాది చివర్లోనే రూ. 500 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది మరింత వేగంగా దూసుకుపోతుందనే అంచనాలున్నాయి. ఎఫ్‌ఐసీసీఐ- ఈవై మీడియా నివేదిక ప్రకారం... వినైల్‌ విక్రయాలు 40 శాతానికి పెరిగాయి. ఫిల్మ్‌ ఫొటోగ్రఫీ ప్రాసెస్డ్‌ రోల్స్‌ 2023 గణాంకాలతో పోలిస్తే రెట్టింపయ్యాయి (ఇండియా ఫొటో కౌన్సిల్‌). 18-25 ఏళ్ల మధ్య వయసున్న జెన్‌జీలో 70 శాతం మానసిక ఉపశాంతి కోసం ఆఫ్‌లైన్‌ అభిరుచులను కోరుకుంటున్నారని ‘డెలాయిట్స్‌ 2025 యూత్‌ ట్రెండ్స్‌ సర్వే’ వెల్లడించింది.

ఎందుకీ తేడా?

సమాచార నిల్వకూ, ప్రసారానికీ రెండు వేర్వేరు సాంకేతికతలున్నాయి. అనలాగ్‌ (నిరంతర సంకేతం)... డిజిటల్‌ (అంకెల సంకేతం). ముళ్లున్న గడియారాలు, పాత రేడియోలు, పాదరసం థర్మామీటర్లు, క్యాసెట్‌ టేప్‌ రికార్డులు... అనలాగ్‌కు ఉదాహరణలు. దీనికి భిన్నంగా డిజిటల్‌ అనేది విడివిడిగా డేటాను 0, 1 (బైనరీ) రూపంలో నిల్వ చేస్తుంది. డిజిటల్‌ కెమెరాలు, వాచ్‌లు, స్మార్ట్‌ఫోన్లను ఉదాహరణలుగా చెప్పవచ్చు. డిజిటల్‌ అంటే... బైనరీ డిజిట్స్‌, స్ర్కీన్లు, వేగం. అనలాగ్‌ అంటే.. పరమాణువులు, భౌతిక ఉనికి, కోరుకున్న స్థాయిలో నెమ్మదితనం.


book6.jpgఅదే పనిగా స్ర్కోలింగ్‌ ...

ఎవరు ఔనన్నా కాదన్నా... మొబైల్‌ ఫోన్‌ల స్ర్కీన్లు అందరి జీవితాలనూ నిర్దేశిస్తున్నాయి. చాలామంది నోటిఫికేషన్ల శబ్దాలతోనే నిద్ర నుంచి మేలుకుంటున్నారు. ఇక రోజులో ఎక్కువభాగం డూమ్‌ స్ర్కోలింగ్‌ (ప్రతికూల, ఆందోళనకర వార్తలు తెలుసుకోవాలనే ఆతృతతో గంటల తరబడి స్ర్కోలింగ్‌ చేయడం)తో భయం, నిరాశ... తద్వారా మానసిక ఒత్తిడి, నిద్రలేమి ఎక్కువవుతున్నాయి.

రోజంతా నిరంతర స్ర్కోల్స్‌, రీల్స్‌, ఈ- మెయిల్స్‌, సోషల్‌ మీడియా, న్యూస్‌ ఫీడ్స్‌... రోజును ముగించడం కూడా ఓటీటీలో మరో ఎపిసోడ్‌ చూశాకే. ఇలా అందరిపై మొత్తంగా డిజిటల్‌ ఆధిపత్యమే! ఇలా ఎడతెగని స్ర్కీన్‌ టైమ్‌ మూలంగా ప్రతీ ఒక్కరిలో సృజనాత్మకత తరిగిపోతోంది. ఏకాగ్రత సమయం దెబ్బతింటోంది. చురుకైన కార్యాచరణ స్థానంలో నిష్ర్కియాత్మక వినియోగం పెరిగితే మిగిలేది ఒత్తిడే కదా.


ప్రమాదకర సవాళ్లు...

మితిమీరిన డిజిటల్‌ వినియోగం ఆర్థిక, సామాజిక రంగాల్లో, మానసిక ఆరోగ్యపరంగా ప్రమాదకర సవాలుగా మారుతోందని 2025- 26 భారత్‌ ఆర్థిక సర్వే హెచ్చరించింది. మానసిక ఒత్తిడి, వ్యాకులతలకూ... డిజిటల్‌ వ్యసనానికీ సంబంధముందని తెలిపింది. పరిష్కారంగా డిజిటల్‌ డైట్స్‌, ఆఫ్‌లైన్‌ యూత్‌ హబ్స్‌, డివైజ్‌ ఫ్రీ జోన్‌లను సూచించింది.

అందుకే 2026లో యువతరం (జెన్‌జీ, మిలీనియల్స్‌) తమపై డిజిటల్‌ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు... జీవనశైలిని మార్చుకోవాలని భావిస్తోంది. ఆత్రుతకూ, హడావుడికీ దూరంగా నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండేలా... పూర్వపు పద్ధతులతో అనుసంధానమయ్యేలా దినచర్యను మలుచుకుంటున్నారు. స్పర్శానుభూతులకు వీలైన ‘అనలాగ్‌’ పంథాకు మారుతూ... ఆఫ్‌లైన్‌లో ఉండటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కామిక్స్‌ చదువుతూ, పెయింటింగ్‌ లాంటి అభిరుచులతో గడుపుతున్నారు. ఒక పాట తర్వాత ఏ పాట వినాలో చెప్పే అల్గారిథమ్‌ ట్రాప్‌లో చిక్కుకోకుండా... తమకిష్టం వచ్చిన పాటను ఎంచుకొని మరీ వింటేజ్‌ ఎల్పీ రికార్డుల్లో, క్యాసెట్లలో పాటల్ని వింటూ ఆనందిస్తున్నారు. కావునే మార్కెట్లో సరికొత్తగా ‘అనలాగ్‌’ వస్తువులు, స్టోర్లు ప్రత్యక్షమవుతున్నాయి.


book6.4.jpgమైక్రో ట్రెండ్స్‌తో ముందుకు...

ఆఫ్‌లైన్లో ఎక్కువ ఉండాలనే యువతరం అభిలాష కొన్నిరకాల మైక్రో ట్రెండ్స్‌కు దారితీస్తోంది. అవేమిటంటే...

  • డిజిటల్‌ సూర్యాస్తమయం: అంటే నిద్రకు ముందు ఫోన్‌ను స్విచాఫ్‌ చేయడం. నిర్దిష్ట సమయంపాటు డిజిటల్‌ పరికరాలకు దూరంగా ఉండే డిజిటల్‌ ఉపవాసం అన్నమాట! నిద్రపోవడానికి కనీసం గంట ముందు ఫోన్లూ, ట్యాబ్‌లూ, కంప్యూటర్లూ, టీవీ స్ర్కీన్‌ చూడటం తగ్గిస్తే... ఇది కళ్లకు విశ్రాంతినివ్వడమే కాకుండా మానసిక అలసటను తగ్గిస్తుంది. శరీరం రిలాక్స్‌ అయ్యేలా చేస్తుంది.

  • భలే బ్యాగులు: యువతలో ‘డూమ్‌ స్ర్కోలింగ్‌’ వ్యసనానికి విరుగుడుగా రూపొందిన ‘అనలాగ్‌ బ్యాగ్స్‌’ ప్రాచుర్యం పొందుతున్నాయి. వీటిలో ఉండే థింక్‌ మినీ నిట్టింగ్‌ కిట్స్‌, మ్యాగజైన్లు, పజిల్స్‌, జర్నల్స్‌, కాన్వాస్‌లు, లెగోలు వివిధరకాల ఆసక్తికర వస్తువులు తీరుబడి కాలక్షేపానికి వీలు కల్పిస్తున్నాయి.


  • ఆఫ్‌లైన్‌ పరిచయాలు: మారుపేర్లతో మోసగించే ఆస్కారమున్న ఆన్‌లైన్‌ పరిచయాల స్థానే తిరిగి ఆఫ్‌లైన్‌ కమ్యూనిటీలు పెరుగుతున్నాయి. జామ్‌ సెషన్లు, బోర్డ్‌ గేమ్‌ క్లబ్బులు, ఇంటిమేట్‌ లెక్చర్‌ గేదరింగ్‌ల్లాంటి కార్యకలాపాలు ప్రజలను దగ్గర చేస్తున్నాయి. ఈ మీటింగ్స్‌ ప్రత్యక్ష పరిచయాలకూ, అభిప్రాయాలు పంచుకోవడానికీ వేదికలవుతున్నాయి. ముఖాముఖి సంభాషణల వల్లా, కుటుంబంతో, స్నేహితులతో నేరుగా సమయం గడపడం వల్లా భావోద్వేగ బంధాలు బలపడుతున్నాయి.


book6.5.jpg

  • క్విట్‌... క్విక్‌ కామర్స్‌: ఎక్కడికీ కదిలే అవసరం లేకుండా... మొబైల్‌ యాప్‌లో ఆర్డర్‌ పెట్టిన పది నిమిషాల్లోనే సరుకులు ఇంట్లోకి వచ్చేయడం నగరాలు, పట్టణాల్లో ఓ ఆకర్షణ. ఈ సౌలభ్యాన్ని పక్కనపెట్టి, స్థానిక దుకాణాలకు స్వయంగా వెళ్లి పచారీ సామాన్లు కొనే అలవాటుకు మరలటం ‘అనలాగ్‌ లివింగ్‌’లో భాగమే. ‘‘క్విక్‌ కామర్స్‌ వినియోగాన్ని బాగా తగ్గించేశా. ఏదైనా వస్తువు కావాలంటే, ఇంటి నుంచి బయటకు కదులుతా. పరిసరాలను గమనిస్తూ కిరాణా దుకాణానికి నడుస్తూ వెళ్తా. కాస్త ముందుగా ప్లాన్‌ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది అత్యవసరమైనవి అనుకునేవి చాలావరకూ అంత అర్జెంటైనవి ఏమీ కాదు’’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చిందో సోషల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌. కొన్ని తేలికైన చిట్కాలు స్క్రీన్‌ సమయం తగ్గించుకుని, పరిమిత డిజిటల్‌ జీవనశైలితో ముందుకు సాగాలనుకునేవారికి కొన్ని చిట్కాలివి..


  • చేత్తో రాయడం: మదిలో మెదిలే ఆలోచనలను ఫోన్లోనో, కంప్యూటర్లోనో టైప్‌ చేయకుండా ఓ నోట్‌బుక్‌లో రాసుకోవాలి. కాగితమ్మీద పెన్ను/పెన్సిల్‌తో రాయడం అలవాటైతే సృజనాత్మకత వెల్లివిరుస్తుందనేది చాలామంది అనుభవం. ఇంట్లో ఉమ్మడిగా వాడే హాల్‌లో నోట్‌బుక్‌, స్టికీ నోట్స్‌, పెన్ను ఉంచుకుంటే ముఖ్యమైన తేదీలూ, లిస్టులను తేలిగ్గా రాసిపెట్టుకోవచ్చు.

  • ఉత్తరాలు: దూరప్రాంతాల్లో ఉండే మిత్రులకూ, కుటుంబ సభ్యులకూ ఆత్మీయంగా చక్కని ఉత్తరాలు రాయొచ్చు. రోజూ కలిసి మాట్లాడే వ్యక్తులకు కూడా సందర్భానుసారంగా అభినందనో, కృతజ్ఞతో తెలుపుతూ ఇలా లేఖలు రాస్తే ప్రత్యేకంగా ఉంటుంది. వాట్సాప్‌లో పెట్టే సందేశాన్ని మించి ఇది ప్రభావవంతంగా ఉంటుంది. వాటిని అందుకునేవారికీ సరికొత్త అనుభూతినిస్తుంది.


book6.6.jpg

  • అలారమ్‌ గడియారం: సెల్‌ఫోన్లలో బిల్టిన్‌ అలారమ్‌ క్లాక్‌లుంటాయి. ఫోనులో అలారమ్‌ సెట్‌ చేయాలనుకున్నపుడు ఇతర కంటెంట్‌పై చూపు మళ్లి, దానిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే అలారమ్‌ గడియారం వాడటం మేలు. మొబైల్‌ను నిద్రపోయేముందూ, ముఖ్యంగా లేచీలేవంగానే వాడకుండా చేస్తుందిది.

  • వార్తాపత్రికల పఠనం: సోషల్‌ మీడియాలో డూమ్‌ స్ర్కోలింగ్‌ చేస్తూ అర్థసత్య, అసత్య వార్తలూ, వాటిపై వచ్చే తీవ్ర స్పందనల మూలంగా ఒత్తిడికి గురవుతారు. అందుకే విశ్వసనీయమైన వార్తలు, విశ్లేషణల కోసం దినపత్రికలు, మ్యాగజైన్లు చదవడం శ్రేయస్కరం. ఇంట్లో అందరూ ఎవరికి వీలైన సమయంలో వారు వీటిని చదవొచ్చు.


  • ఫిజికల్‌ మీడియా: బోర్‌ కొట్టినపుడు సెల్‌ఫోనులో బటన్‌ క్లిక్‌ చేసి పాటలు వింటాం కదా? ఫోనులో కాకుండా ఫిజికల్‌ మీడియా (సీడీ, డీవీడీ)కు మారటం వల్ల వాణిజ్య ప్రకటనలు లేకుండా సంగీతాన్ని ఆస్వాదించొచ్చు. సెల్‌ఫోన్‌లో మాదిరి మధ్యలో కాల్స్‌, మెసేజుల అంతరాయాలూ ఉండవు. పఠనానికీ ఇది వర్తిస్తుంది. ఎలక్ర్టానిక్‌ రీడర్‌లో డిజిటల్‌గా చదవటం కన్నా ఒరిజినల్‌ పుస్తకాలకు ప్రాధాన్యం ఇవ్వడం మెరుగు.

  • వినోదానికి వేరే దారి: స్ర్టీమ్‌ అయ్యే టీవీ షోనో, సినిమానో కాకుండా డిజిటల్‌ డివైజ్‌తో సంబంధం లేని వినోదానికి మొగ్గు చూపాలి. వ్యక్తిగత అభిరుచిని బట్టి బోర్డ్‌ గేమ్స్‌, పజిల్స్‌, సంగీత వాద్య పరికరాల వంటి సాధనాలు ఉపయోగించవచ్చు. ఇలాంటివి ఇంట్లోనే అందుబాటులో ఉంచుకుంటే... టైంపాస్‌ కోసం ఫోన్‌ను అదేపనిగా స్ర్కోల్‌ చేయటం తగ్గిపోతుంది.


book6.7.jpgఇప్పుడే ఎందుకిలా?

  • డిజిటల్‌ అలసట: కంటికి శ్రమనూ, మానసిక చిందరవందరనూ తగ్గించుకోవడానికి అందరూ ‘డిజిటల్‌ డిటాక్స్‌’ కోసం ఎదురుచూస్తున్నారు.

  • జ్ఞాపకాల పట్ల మమకారం: నేటి యువతరం తాము పూర్తిగా ఆస్వాదించని పరికరాలూ, సామగ్రి పట్ల మోజుతో 1970, 80, 90 దశకాల కళాత్మకతను ఆకర్షణీయంగా, ప్రామాణికంగా భావిస్తున్నారు.

  • యాజమాన్య హక్కు: ఈ సబ్‌స్ర్కిప్షన్ల ప్రపంచంలో (మూవీ గానీ, మ్యూజిక్‌ గానీ వాస్తవికంగా ఏదీ మన సొంతం కాదు) ఒక భౌతిక కాపీని సొంతం చేసుకోవడం సగర్వంగానూ, సురక్షితంగానూ అనిపిస్తుంది.

  • సహజత్వం... వాస్తవికం: డిజిటల్‌ దృశ్యం మృదువుగా, అత్యంత పరిపూర్ణంగా ఉంటుంది. దీనికి భిన్నంగా ఉండే ఫిల్మ్‌ ఫొటోగ్రఫీలోని చిన్నచిన్న చుక్కల ఆకృతి సహజంగా, వాస్తవికంగా ఉంటూ ఆకట్టుకుంటుంది.


సాంకేతికతకు సరిహద్దులు...

అనలాగ్‌ లివింగ్‌.. వెనకడుగేమీ కాదు. ఇది సానుకూల దిశలో వ్యూహాత్మక మార్పు. ఈ ధోరణి వల్ల సాంకేతికతను పూర్తిగా విడిచిపెట్టెయ్యటం ఎంతమాత్రం జరగదు. ఈ రోజుల్లో అది ఆచరణ సాధ్యమూ కాదు. అనలాగ్‌ లివింగ్‌.. టెక్నాలజీ వినియోగానికి సరిహద్దులను నిర్దేశిస్తుంది. వృథాగా కోల్పోతున్న సమయాన్ని తిరిగి పొందేలా చేస్తుంది. జ్ఞానేంద్రియాలపై ఒత్తిడితో మెదడు అలసిపోవడాన్ని పరిమితిలో పెట్టి, సమతూకాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంది. అర్థవంతమైన పంథా పెంపొందేలా చేస్తుంది.

కేవలం యువతే కాదు, ఏ వయసువారైనా ‘అనలాగ్‌’ జీవన శైలిని వీలైనంత పెంచుకోవడం మేలు. పుస్తకాలు, మ్యాగజైన్స్‌ చదవడం... తోటపని, బొమ్మల స్కెచింగ్‌, ఎంబ్రాయిడరీ లాంటి నైపుణ్యాలు పెంచుకోవడం... సీడీల్లో, టేపుల్లో సంగీతం వినడం మొదలుపెట్టవచ్చు. నగదు చెల్లింపులు కొంతైనా చేయడం, డిజిటల్‌ క్యాలెండర్‌కు బదులు పేపర్‌ ప్లానర్‌, ఫోన్‌గేమ్స్‌ పక్కనపెట్టి క్రాస్‌వర్డ్స్‌, పజిల్స్‌ పూరించడం... సాంప్రదాయిక అలారం క్లాక్‌తో నిద్ర లేవడం, ఉత్తరాలు రాసి పోస్టు చేయడం.. ఇలాంటివన్నీ ఆచరణకు అసాధ్యమేమీ కాదు కదా?!


కొత్త పద్ధతుల్లో ప్రేరణ...

భారతీయ యువ జంటలు ఇప్పుడిప్పుడే చాలావరకు అనలాగ్‌ అలవాట్లను సృష్టిస్తున్నాయి. ఇతరులకు ప్రేరణనిస్తున్నాయి.

  • దిల్లీకి చెందిన జంట అంజలి, విక్రమ్‌లు ‘నో స్ర్కీన్‌ డిన్నర్‌’ అనే కొత్త పంథాను పాటిస్తున్నారు. భోజనం చేసేటప్పుడు ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు లాంటి అంతరాయాల్లేకుండా ఆలోచనలు పంచుకుంటూ ఒకరితో ఒకరు నాణ్యమైన సమయం గడిపేందుకు స్మార్ట్‌ ఫోన్లూ, ఇతర గ్యాడ్జెట్లనూ దూరం పెడుతున్నారు.

  • కోల్‌కతా జంట రీనా, సమీర్‌లు ‘వీక్లీ డిజిటల్‌ ఫ్రీ సాయంత్రాల’ను ప్రవేశపెట్టారు. వారానికోసారి ఇలా చేస్తూ చిన్నచిన్న ఆనందపు అనుభూతులు పొందుతున్నారు. కలిసి కొంతదూరం నడవటం, బోర్డ్‌ గేమ్స్‌ ఆడటం, వంట చేయడానికి ఈ సమయాన్ని వినియోగిస్తూ... తమ బంధాన్ని మరింత దృఢంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


  • జైపూర్‌కు చెందిన అనన్య, కరణ్‌లు ప్రయోగాత్మకంగా ఓ రోడ్‌ ట్రిప్‌ వేశారు. ఫోన్లను కావాలనే తమ వెంట తీసుకెళ్లలేదు. సందర్శించే ప్రదేశాల విశేషాలూ, అర్థవంతమైన వ్యక్తిగత సంభాషణలపై దృష్టి కేంద్రీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రశాంతమైన పచ్చని పల్లెలను చూసి, అక్కడి వంటల రుచులను ఆస్వాదించారు. సంతృప్తినీ, సంతోషాన్నీ పొందారు.


‘ఫోన్‌ ఫ్రీ’ పర్యటనలు...

జీవ వైవిధ్యానికీ, కనువిందు చేసే ప్రకృతి సోయగానికీ, ప్రశాంత వాతావరణానికీ పేరుపొందిన కేరళలోని వయనాడ్‌ ‘ఫోన్‌ ఫ్రీ వెకేషన్స్‌’కు కూడా గమ్యస్థానమే. ఇక్కడ ట్రెక్కింగ్‌, బర్డ్‌ వాచింగ్‌, అటవీ అందాల వీక్షణం సందర్శకులను మైమరపిస్తుంటాయి. ఫోన్లలో మునిగిపోకుండా ప్రకృతితో గాఢంగా అనుసంధానమవటానికీ, తీరుబడిగా, మనస్ఫూర్తిగా నిమగ్నమై విహారం సాగించటానికీ ఇలాంటి సందర్శనలు తోడ్పడుతున్నాయి.


కుటుంబ సభ్యులో, మిత్రులో ఒకచోట చేరినప్పుడు సరదా కబుర్లతో గడుపుతుంటారు కదా? ఆ సంభాషణల్లో పాలుపంచుకోకుండా కొందరు మాత్రం తమ ఫోన్లలో తలదూరుస్తూ వేరే లోకంలో విహరిస్తుండటం ఈ రోజుల్లో సాధారణ దృశ్యమైపోయింది. మన ఎలక్ర్టానిక్‌ డివైజ్‌ లోపల ఉండే అనంతమైన డిజిటల్‌ ప్రపంచం ఓ పక్క.. మనం భాగమై మన చుట్టూ ఉండే సజీవమైన.. వాస్తవికమైన అనలాగ్‌ ప్రపంచం మరో పక్క! ఈ రెండిట్లో దేనికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి.

మొత్తానికి డిజిటల్‌ ప్రపంచం హద్దుమీరడంతో, దానితో ఒత్తిడికి, అనారోగ్యానికి గురవుతున్న ఈతరం నెమ్మదిగా ‘అనలాగ్‌’ జీవితం వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. మార్కెట్లో కూడా ఈ సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఒకరకంగా ఈ మార్పు మంచిదే కదా!

- సండే డెస్క్‌


సోషల్‌ మీడియా నిషేధం

డిసెంబర్‌ 2025లో పిల్లలకు సోషల్‌మీడియాను నిషేధించిన తొలి దేశంగా ఆస్ర్టేలియా చరిత్రకెక్కింది. 16 ఏళ్లలోపువారు సోషల్‌మీడియా వినియోగించకుండా అడ్డుకోవడానికి మనదేశంలో కర్ణాటక రాష్ట్రం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌, గోవాలు ఈ తరహా నిబంధనలు ప్రవేశపెడతామంటూ ప్రకటించాయి. డిజిటల్‌ మీడియా వినియోగంపై బాలలకు ఆరోగ్యకరమైన హద్దులు పెట్టేదెలాగో ‘చైల్డ్‌హుడ్‌ అన్‌ప్లగ్డ్‌’ పుస్తకం ఆచరణాత్మకంగా వివరిస్తుంది. డిజిటల్‌ మినిమలిజం ఆవశ్యకతను తెలిపే ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. రచయిత్రి కేథరిన్‌ జాన్సన్‌ మార్టింకో. ఆమె ఈ-మెయిల్‌ న్యూస్‌ లెటర్‌ ‘ద అనలాగ్‌ ఫ్యామిలీ’ కూడా ప్రాచుర్యం పొందింది.

zz.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

‘మతం’ చిక్కుల్లో జగన్‌!

ఎస్ఐఆర్ వర్సెస్ అల్లర్లు.. బెంగాల్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 29 , 2026 | 11:55 AM