Share News

‘వేపచిగుళ్ల’ వేపు చూడండి

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:29 AM

తినదగినవాటిలో శక్తివంతమైన వాటిని తినాలనే ధ్యాస, వండాలనే తపన ఉండాలే గానీ, కూరగా వండుకోవటానికి పనికిరాని దేదీ లేదు... ఆఖరికి వేప చిగురు కూడా!

‘వేపచిగుళ్ల’ వేపు చూడండి
Vantalu

తినదగినవాటిలో శక్తివంతమైన వాటిని తినాలనే ధ్యాస, వండాలనే తపన ఉండాలే గానీ, కూరగా వండుకోవటానికి పనికిరాని దేదీ లేదు... ఆఖరికి వేప చిగురు కూడా!

చిగురాకుల్లో వేపచిగురు శక్తివంతమైంది. అమృతానికి వేపచిగురు మారుపేరు.

ప్రకృతి సంపదలో ఆహార యోగ్యమైన ఔషధాలను వంటగదిలోకి తెచ్చిన పాకశాస్త్ర కోవిదుడు నలుడు. మేడికాయలతోనూ కలబందతోనూ, వేపచిగుళ్లతోనూ ఆఖరికి జిల్లేడాకులతో కూడా ఆయన ఆరోగ్యదాయక వంటకాలను చేసి చూపించాడు.

వేప సర్వరోగనివారిణి అని ఇవ్వాళ కొత్తగా చెప్పాల్సింది లేదు. లేత వేపచిగుళ్లలో చేదు తక్కువగా ఉండటమే కాకుండా తేలికగా అరిగేదిగా ఉంటుంది. చలవ నిస్తుంది. జఠరాగ్ని పెంచుతుంది. తద్వారా షుగర్స్‌, కొవ్వు పదార్థాలు తేలికగా వంటబట్టి శరీరానికి శక్తిగా మారతాయి. దప్పిక తీరుస్తాయి. దగ్గు, కఫాలను ఆపుతాయి. జ్వరాన్ని నివారిస్తాయి. నోటికి అన్నహితవుని కలిగిస్తాయి. సూక్ష్మజీవుల దోషాలను పోగొడతాయి. అల్సర్లు త్వరగా మాడేలా చేస్తాయి. వాంతి వికారాలను తగ్గిస్తాయి. అతిసార వ్యాధి ఏర్పడినప్పుడు విరేచనం నీటి శాతాన్ని తగ్గించి శోషరాకుండా కాపాడతాయి. చర్మరోగాలను, ఎలర్జీవ్యాధులను పోగొడతాయి. షుగరు వ్యాధికి శత్రువుగా పనిచేస్తాయి.


book7.jpgఇంతకన్నా ఏం కావాలి...? ‘‘త్రిదోషశమనం పథ్యం సర్వవ్యాధిహరం శుభమ్‌’’ ఒక గొప్ప ఔషధాన్ని ఆహారంగా తీసుకుంటే అన్ని దోషాలనూ వ్యాధులనూ తగ్గించటమే కాదు, అవి రాకుండా కూడా కాపాడుతుందంటాడు నలుడు. ‘శుభం’ అనటం ద్వారా వేపచిగుళ్లను తినటం అనేది మంగళకరమైన శుభప్రదమైన అంశంగా పేర్కొన్నాడు. సర్వ పాపహరం అనటం లాంటిది.


వేపచిగుళ్ల కూర: లేత వేపచిగుళ్లలోని ఈనెలు, కాడలు తొలగించి సన్నగా తరిగి ఉప్పు, పసుపు కలిపిన నీటిలో వేయాలి. వాటితో పాటు కొద్దిగాగలిజేరు (పునర్నవ- అటికమావిడి) ఆకులు, లేదా కామంచికాయలు, లేదా పత్తి ఆకులు కలిపి అరగంట నానబెట్టి, తరువాత శుభ్రమైన నీటితో కడగాలి.

ఒక పాత్రలో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేడి చేసి తాలింపు ద్రవ్యాలు వేసి, ఈ ఆకులన్నింటినీ మెల్లగా మగ్గించాలి. తరువాత ఇష్టమైన సంబారాలను నూరి కలిపి కొద్దిసేపు ఉమ్మగిల్లనివ్వాలి. సంబారాలుకలిసిన తరువాత వేపలోని చేదు గణనీయంగా తగ్గి, కూరకు మృదుమధురమైన రుచి వస్తుంది. చివరగా స్వల్పంగా పచ్చ కర్పూరం వంటి పరిమళద్రవ్యాలు చేర్చి వేడివేడిగా వడ్డించాలి.


వేపచిగుళ్ళ కారప్పొడి: లేత ఎర్రగలిజేరు ఆకుల్ని, వేపచిగుళ్ళని, సమానంగా తీసుకుని పసుపు నీళ్లలో కొద్దిసేపు నానబెట్టి తువ్వాలతో తడి తుడిచి గాలికి ఆరనిచ్చి ఒక భాండీలో వేసి పైపైన వేగనిచ్చి చల్లారాక మిక్సీ పట్టు కోవాలి. శనగపప్పు, మినపపప్పు, ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు, కొద్దిగా నువ్వులు, తగినన్ని ఎండుమిరప కాయలు, తగినంత చింతపండు, ఇంగువ .. విడివిడిగా వేగించి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే కమ్మని వేపచిగుళ్ల కారప్పొడి. రోజూ ఒక చెంచాడు మోతాడులో వేడన్నంలో మొదటి ముద్దగా తినేవారికి ఆరోగ్యం స్వంతం.

బిట్టర్‌ టానిక్కుల్లో వేపచిగుళ్ళది ఒకటవ స్థానం! షుగరుని, కొవ్వుని కరిగించి శక్తిగానూ శరీర నిర్మాణానికి సహకరించేవి గానూ చేస్తాయి. పెరట్లో వేపచెట్టు ఉన్నవాళ్లు సీజన్లో వేప చిగుళ్లను సేకరించుకుని ఆరబెట్టి, వేగించి భద్రపరచుకోవచ్చు కూడా!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


ఈ వార్తలు కూడా చదవండి:

మంచుకొండల నుంచి... సరిహద్దు గ్రామాల్లోకి...

మొజ్తాబా బతికే ఉన్నారు.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 09 , 2026 | 11:29 AM