Share News

వంటలు: సొర ఆకుల కూర..

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:10 PM

ఆనప్పాదు’ అనేది తెలుగులో అందమైన పదబంధం. శాకరాజం అనదగిన సొరకాయకి ఇది పర్యాయపదం.

వంటలు: సొర ఆకుల కూర..

‘ఆనప్పాదు’ అనేది తెలుగులో అందమైన పదబంధం. శాకరాజం అనదగిన సొరకాయకి ఇది పర్యాయపదం. ఆహార కొరతను తీర్చే ఓ ప్రకృతి వరప్రసాదం కూడా! ఇంటి పైకప్పు మీదకి సొరతీగ పాకి, పైనుంచి కాయ ఒకటి తెగి, జారివచ్చి కింద ఉన్న మేక నెత్తిన పడిందట... ‘పుటుక్కు జరజర డుబుక్కుమే’ అని జానపదులు సరదాగా చెప్పుకుంటారు దీన్ని. రావి కొండలరావు ఆనప్పాదు గురించి తెలుగు మేష్టారి పాత్రలో సైలెన్స్‌ అంటూ చేసిన కామెడీ పాతతరానికి ఇంకా గుర్తుండే ఉంటుంది.

పొడవుగా ఉండే వాటిని సొరకాయలనీ, గుండ్రంగా చిన్నకుండలా ఉండే వాటిని ఆనప/ఆనబ అంటారని కొందరు చెప్తారు గానీ సొర, ఆనబ అని రెండింటినీ పిలుస్తుంటారు. తుంబీ, కుంభతుంబీ అని సంస్కృతంలో పిలుస్తారు.

వేద కాలానికన్నా ముందునుండే మనకు సొరకాయ వాడకం తెలుసు. 2024లో అమెరికాలోని కార్నెల్‌ విశ్వవిద్యాలయంలో 197 రకాల సొరకాయల జన్యువుల్ని పరిశీలించారు. దక్షిణాఫ్రికాలో సుమారు 12 వేల సంవత్సరాల క్రితం పుట్టి, అక్కడి నుంచి ఆసియా, అమెరికా ఖండాలకు సొరమొక్క వ్యాపించిందని తేల్చారు.


సొరమొక్క కాయగూరే కాదు, ఆకుకూర కూడా! వానాకాలంలోనూ ఆ తర్వాత వచ్చే కార్తీక మాసం ఆహార కరువు కాలంలోనూ ఈ పూర్వం మనవాళ్లు ఈ ఆనబాకుల్ని వండుకుని కమ్మగా తినేవాళ్లు. తినటానికి పనికొచ్చేది, పోషకాలు కలిగి పుష్టిని తుష్టిని రుచిని కూడా ఇచ్చేదీ అయినప్పుడు దాన్ని తినటానికి మనకు నామోషీ దేనికీ?

ఆనబాకుల్ని సన్నగా తరిగి ఓ భాండీలోకి తీసుకుని, తగినంత ఉప్పు వేసి నీళ్లమూత పెట్టి మగ్గనిచ్చి, ఉల్లి ముక్కలు, వగైరా చేర్చి దాని పైన కొంచెం పెరుగు, కొద్దిగా చింత పండు రసం, కాసింత మినప్పిండి, కొద్దిగా పొడిబెల్లం కలిపి నెయ్యి వేసి మూతపెట్టి బాగా మగ్గనివ్వాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, నువ్వులు మినప్పప్పు లాంటివి విడివిడిగా వేగించి మెత్తగా దంచిన పొడిని తగినంతగా ఈ కూరలో కలిపి బాగా మగ్గనివ్వాలి. చివర్లో ఇంగువ తాలింపు పెడితే సొరాకుల కమ్మని కూర సిద్ధం అయినట్టే!


సొరలాంటి తీయ కూరల్ని అనవసరమైన మషాలాలు, అధికంగా చింతపండు రసాలూ కలపకుండా తీపి, పులుపు, ఉప్పు కారం వగరు చేదు ఆరురుచులూ ఉండేలాగా నలుడు సూచించిన విధానం ఇది!

పాలకూరతో చేసుకున్నట్టే పప్పు, పులుసుకూర, రోటి పచ్చడి చేసుకోవచ్చు. పాలక్‌ లాంటివిగానీ, పకోడీలు, పరోటాలు గానీ వండుకోవచ్చు. బచ్చలాకులాగా జిగురూ, తోటకూరలాగా వగరూ ఉండవు కాబట్టి సొరాకులతో అన్నీ వండుకోవచ్చు. కంద-బచ్చలి లాగానే, ఆవపెట్టిన కూర బాగుం టుంది. సొరాకుల సలాడ్‌ తింటే, ఎసిడిటీ, కడుపులో మంట, ఇరిటేషన్లు తగ్గుతాయి.


book8.2.jpgచింతపండు వెయ్యకుండా పెసర లేదా కందిపప్పుతో కాచిన కట్టులో సన్నగా తరిగిన సొరముక్కల్ని, సొరాకుల్ని కూడా కలిపి కాచిన పప్పు చారు లేదా సూపు పొట్టకు మేలు చేస్తుంది. సొరాకుల్ని జ్యూసు తీసి అందులో చారుపొడి వేసి కాచిన చారు చాలా రుచికరం గానూ జీర్ణశక్తిని పెంచేదిగానూ ఉంటుంది.

సొరకాయకున్న గుణాలన్నీ సొర ఆకులకూ ఉన్నాయి. ఈ ఆకుల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము దండిగా ఉన్నాయి. ఖనిజ లోపాలతో బాధపడేవారికి సొరాకులు వరప్రసాదం! అమితంగా చలవ చేస్తాయి. శరీరానికి మృదుత్వాన్ని కలిగిస్తాయి.


పశ్చిమ బెంగాల్‌లో దీపావళికి ముందు జరిగే భూత చతుర్దశి సందర్భంగా చేసే చొద్దో శాక్‌ అనే సంప్రదాయ వంటకంలో పద్నాలుగు రకాల ఆకుకూరలతో పాటు సొరాకును కూడా తప్పనిసరిగా కలుపుతారు.

సొరాకు ముదిరే కొద్దీ దాని మీద నూగు, ముళ్లలాంటి రోమాలు ఏర్పడతాయి వాటిని తొలగించటం పెద్ద పని. అందుకని బాగా లేత ఆకుల్ని మాత్రమే ఎంచుకోండి. ఎండ పడే చోట కుండీలో సొర విత్తులు నాలుగు పాతండి చాలు. వారానికి ఒకట్రెండు సార్లు మీ ఇంటిల్లి పాదీ సొరాకుల్ని కమ్మగా వండుకుని తినవచ్చు.

  • డా. జి.వి పూర్ణచందు, 94401 72642


ఈ వార్తలు కూడా చదవండి:

మాన్‌సూన్‌ కాకర!

నెగిటివ్‌ పాత్రలైనా చేస్తా!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 12:11 PM