Share News

బంగ్లాదేశ్ సంచలనం.. ఆసీస్‌పై తొలి సిరీస్ విజయం

ABN , Publish Date - Jun 12 , 2026 | 10:56 AM

బంగ్లాదేశ్‌ వన్డే జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆరు సార్లు వరల్డ్‌ ఛాంపియన్స్‌ అయిన ఆస్ట్రేలియాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌లో విజయం సాధించింది.

బంగ్లాదేశ్ సంచలనం..  ఆసీస్‌పై తొలి సిరీస్ విజయం
Bangladesh vs Australia ODI series

స్పోర్ట్స్ డెస్క్: బంగ్లాదేశ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌ గెలిచింది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఈ ఘనత సొంతం చేసుకుంది. తొలి వన్డే లోనూ ఆసీస్‌ను చిత్తు చేసింది. తొలి వన్డే విజయంతో 21 ఏళ్ల నిరీక్షణ తర్వాత కంగారు జట్టుపై బంగ్లాదేశ్ విజయం సాధించింది. తాజాగా రెండో వన్డేలోనూ గెలవడంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను బంగ్లా హస్తగతం​ చేసుకుంది.


2005లో తొలిసారి ఆస్ట్రేలియాపై ఓ వన్డేలో విజయం సాధించిన బంగ్లాదేశ్‌.. తాజాగా రెండు వరుస విజయాలు సాధించడంతో ఆ దేశ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. సొంతగడ్డపై వన్డే సిరీస్‌ల విజయాలను పరంపరను బంగ్లాదేశ్ కొనసాగించింది. ఇప్పటికే సొంతగడ్డపై శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్థాన్, న్యూజిలాండ్‌లపై వన్డే సిరీస్‌లు గెలిచింది. తాజాగా ఆసీస్‌పై విజయం సాధించి.. వరుసగా ఐదు వన్డే సిరీస్‌లను బంగ్లాదేశ్ తన ఖాతాలో వేసుకుంది.


ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. వరుణుడు అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 42 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించడంతో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 192 పరుగులకు మార్చారు. ఛేదనలో సౌమ్య సర్కార్‌ (42), నజ్ముల్‌ హుస్సేన్‌ (42), తౌహిద్‌ హృదోయ్‌ (40 నాటౌట్‌) రాణించడంతో 35 ఓవర్లలోనే బంగ్లా లక్ష్యాన్ని అందుకుంది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి వన్డే హీరో మొసద్దెక్‌ హొసేన్‌ 15 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో బార్ట్‌లెట్‌, మెరిడిత్‌, జంపా, రెన్షా, గ్రీన్‌ తలో వికెట్‌ తీశారు.


అంతకుముందు కంగారు జట్టు ఖాతా తెరవకుండానే 3 వికెట్లు కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేని అపవాదును మూటగట్టుకుంది. లబూషేన్‌ (55 నాటౌట్‌), బార్ట్‌లెట్‌ (52) అర్ద సెంచరీలతో రాణించడంతో ఈ మాత్రం స్కోరైనా దక్కింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌, తస్కిన్‌ అహ్మద్‌ చెరో మూడు వికెట్లు సాధించారు. తన్వీర్‌ ఇస్తాం రెండు వికెట్లు తీశాడు. ఇక ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో వన్డే జూన్‌ 14న జరుగనుంది.


ఇవి కూడా చదవండి:

వైభవ్‌ టీమిండియాలో అరంగేట్రానికి పొంచి ఉన్న ముప్పు..

ఐపీఎల్ 2026 విజయం తర్వాత విరాట్‌ కోహ్లీ కొత్త హెయిర్‌ స్టైల్‌

Updated Date - Jun 12 , 2026 | 11:33 AM