వైభవ్ టీమిండియాలో అరంగేట్రానికి పొంచి ఉన్న ముప్పు..
ABN , Publish Date - Jun 12 , 2026 | 10:00 AM
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సీనియర్ టీమిండియా అరంగేట్రంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెలాఖరున ఐర్లాండ్ వెళ్లే భారత టీ20 జట్టులోఈ 15 ఏళ్ల కుర్రాడు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. వైభవ్ అరంగేట్రానికి ఐర్లాండ్‌లో జరుగుతున్న అంతర్గత గొడవలు పెద్ద అడ్డంకిగా మారాయి.
స్పోర్ట్స్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ సీనియర్ టీమిండియా అరంగేట్రంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెలాఖరున ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లే భారత టీ20 జట్టులో చోటు దక్కించుకుని సచిన్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ వైపు అందరి చూపు ఉంది. ప్రస్తుతం ఇండియా-ఎ జట్టుతో ఉన్న వైభవ్.. శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. వైభవ్ అరంగేట్రానికి ఐర్లాండ్‌లో జరుగుతున్న అంతర్గత గొడవలు పెద్ద అడ్డంకిగా మారాయి. బెల్‌ఫాస్ట్ నగర పరిసరాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఇప్పటికే అక్కడ జరగాల్సిన దేశవాళీ 'ఇంటర్ ప్రొవిన్షియల్ టీ20 ఫెస్టివల్' రద్దైంది.
పరిస్థితి ఇలాగే ఉంటే భారత్ ఐర్లాండ్ టీ20 సిరీస్ కూడా ముప్పులో పడే అవకాశం ఉంది. దీనిపై క్రికెట్ ఐర్లాండ్ స్పందిస్తూ.. తాము స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఆటగాళ్ల భద్రతకే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ఐరిష్ సీనియర్ కప్, నేషనల్ కప్ మ్యాచ్‌ల విషయమై రాబోయే 48 గంటల్లోగా ఒక నిర్ణయం తీసుకుంటుందని క్రికెట్ ఐర్లాండ్ పేర్కొంది. మరోవైపు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. ఒకవేళ గొడవలు సర్దుమణగకపోతే మ్యాచ్‌లను బెల్‌ఫాస్ట్ నుంచి వేరే ప్రాంతానికి మార్చే యోచనలో బీసీసీఐ ఉంది.
వన్డేల్లో శైలి మార్చిన వైభవ్
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్ సూర్యవంశీ.. వన్డేల్లో మాత్రం కాస్త భిన్నంగా ఆకట్టుకుంటున్నాడు. శ్రీలంక వేదికగా గురువారం అఫ్గానిస్థాన్-ఎ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో వైభవ్ ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండానే 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇండియా ఎ జట్టు పరాజయం పాలైంది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం.. 4 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026 విజయం తర్వాత విరాట్ కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్
ఫిఫా వరల్డ్ కప్ 2026: దక్షిణాఫ్రికాపై మెక్సికో ఘన విజయం