టీఎంసీలో చీలిక.. లేఖపై 19 మంది ఎంపీల సంతకాలు?
ABN , Publish Date - Jun 12 , 2026 | 10:28 AM
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పార్టీకి చెందిన 19 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగరేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పార్టీకి చెందిన 19 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగరేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిలో పలువురు సీనియర్ నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో మరో కీలక నేత కూడా రెబల్ వర్గంలో చేరనునట్టు సమాచారం. మమతపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వారిలో కాకోలీ ఘోష్ దస్తీదార్, శతాబ్దీ రాయ్, జూన్ మాలియా, సయోనీ ఘోష్, యూసఫ్ పఠాన్ వంటి వారు ఉన్నట్టు సమాచారం. వీరందరూ సంతకాలు చేసిన లేఖ కూడా బయటపడ్డట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పరాజయం పాలైన విషయం తెలిసిందే. బీజేపీ 208 సీట్లు సాధించగా టీఎంసీ కేవలం 80 సీట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో మమతపై పార్టీలో అసంతృప్తి చెలరేగింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని మమత గుర్తించలేకపోయారని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అవినీతి పెరిగిందని చెబుతున్నారు. ముఖ్యంగా దీదీ తమను పక్కనపెట్టి తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అనవసర ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.
దీదీ ఎంతో మారిపోయారని ఎంపీ శతాబ్దీ రాయ్ అన్నారు. దీంతో, బీజేపీకి మద్దతు తెలపాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ‘మా అభిప్రాయాలను వినే వారు లేకపోవడంతో పార్టీని వీడాల్సి వస్తోంది. దీదీతో అభిప్రాయాలను పంచుకునే అవకాశం కొందరికి మాత్రమే ఉంటోంది’ అని అన్నారు. తాను మాత్రం మమత వెన్నంటే ఉంటానని ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా తెలిపారు. ‘ఈ క్లిష్ట సమయంలో నేను ఆమెకు మద్దతుగా ఉంటాను. పార్టీని వీడే ప్రసక్తే లేదు. పట్నా ఎన్నికల్లో ఓటమి అనంతరం నేను కష్టకాలంలో ఉన్నప్పుడు మమతా అండగా ఉన్నారు. కాబట్టి టీఎంసీ అధినేత్రికి మద్దతుగా కొనసాగాలని నిర్ణయించుకున్నాను. తమతో చేరాలని రెబల్ వర్గం ఆహ్వానిస్తోంది. ఈ ఆహ్వానాన్ని గౌరవంగా భావిస్తాను తప్ప నా మార్గాన్ని మార్చుకోను’ అని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
అహ్మదాబాద్ విమాన ప్రయాణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వృద్ధ దంపతుల స్టోరీ..
కేంద్రం కీలక ఆదేశాలు.. ఇకపై రిటైల్ పెట్రోల్ బంకుల్లో..