Share News

ఈ పాదరక్షలు... విషాదానికి సాక్ష్యాలు

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:30 AM

నది ఒడ్డున ఎవరో ఓపిగ్గా పేర్చినట్టుగా ఉన్న చెప్పులను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. పురుషుల బూట్లు, మహిళల పాదరక్షలు, చిన్న పిల్లల చెప్పులు... వరుసగా ఎవరు పెట్టారా? అనే అనుమానం కలుగుతుంది.

ఈ పాదరక్షలు... విషాదానికి సాక్ష్యాలు
Shoes on the Danube Bank

నది ఒడ్డున ఎవరో ఓపిగ్గా పేర్చినట్టుగా ఉన్న చెప్పులను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. పురుషుల బూట్లు, మహిళల పాదరక్షలు, చిన్న పిల్లల చెప్పులు... వరుసగా ఎవరు పెట్టారా? అనే అనుమానం కలుగుతుంది. అయితే ఆ చెప్పుల వెనక అత్యంత విషాదకరమైన చరిత్ర దాగుంది. గుండెలను మెలిపెట్టే విషాదానికి ఆ చెప్పులు సాక్ష్యాలుగా నిలుస్తాయి. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లోని డాన్యూబ్‌ నది ఒడ్డున కనిపిస్తుందీ అరుదైన దృశ్యం...

రెండో ప్రపంచయుద్ధ సమయంలో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లోనూ అలాంటి అరాచకమే జరిగింది. 1944 మార్చిలో జర్మనీ హంగేరీపై దండెత్తింది. ఆ తర్వాత ఫెరెన్క్‌ సాలాషీ నాయకత్వంలోని ఫాసిస్టు, యూదు వ్యతిరేక యారో క్రాస్‌ పార్టీ హంగేరీలో అధికారంలోకి వచ్చింది. యుద్ధం ముగుస్తున్న సమయంలో హంగేరీ ఫాసిస్టు దళం ఎన్నో దోపిడీలు చేసింది. అనేకానేక అఘాయిత్యాలకు పాల్పడింది. వేలాదిమంది యూదులను అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఆ కాలంలో బుడాపెస్ట్‌ యూరప్‌లోనే అతిపెద్ద యూదు జనాభా కలిగిన నగరాలలో ఒకటి. శతాబ్దాలుగా అనేక యూదు కుటుంబాలు అక్కడే నివసిస్తూ వచ్చాయి. అయితే యారో క్రాస్‌ పాలన వచ్చిన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. హక్కులన్నీ హరించిపోయాయి. వాళ్లంతా తీవ్రమైన హింసను అనుభవించారు.


నది ఒడ్డున నిలుచోబెట్టి....

హంగేరీ ఫాసిస్టు దళం యూదులను డాన్యూబ్‌ నది ఒడ్డుకు తెచ్చి నిలబెట్టేది. ముందుగా చెప్పులు తీసేయమని ఆదేశించే వారు. ఆ తరువాత వారిని కాల్చి, శవాలను నదిలో వేసేవారు. శవాలు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి జాడ కూడా దొరికేవి కావు. ఆ కాలంలో చెప్పులు విలువైనవి కావడంతో సైనికులు వాటిని సేకరించి, బజారులో అమ్మేవారు. తూటాలు వృథా కావద్దనే ఉద్దేశంతో ముగ్గురు చొప్పున తాళ్లతో కట్టేసేవారు. ఒకరిని కాల్చి చంపి నదిలో తోసేవారు. చల్లటి డాన్యూబ్‌ నదిలో మిగతా ఇద్దరూ కూడా విగతజీవులుగా మారేవారు. కొన్ని వేల కుటుంబాలను డాన్యూబ్‌ నదిలో వేసి చంపేశారని చరిత్రకారులు చెబుతారు.


book7.2.jpgస్మారక చిహ్నం

డాన్యూబ్‌ నది ఒడ్డున హతమైన హంగేరియన్‌ యూదుల కోసం ఒక స్మారకాన్ని నిర్మించారు. నది ఒడ్డున సుమారు 40 మీటర్ల పొడవైన రాతి బెంచ్‌ ఉంటుంది. దానిపై మూడు చోట్ల హంగేరియన్‌, ఆంగ్లం, హీబ్రూ భాషల్లో ‘యారో క్రాస్‌ సైన్యం చేతిలో కాల్చి వేయబడి,

డాన్యూబ్‌ నదిలో కొట్టుకు పోయిన బాధితుల స్మృతి చిహ్నంగా నిర్మించబడింది’ అని రాసి ఉంటుంది. ఈ స్మారకాన్ని ‘షూస్‌ ఆన్‌ ది డాన్యూబ్‌ ప్రొమెనేడ్‌’ అని పిలుస్తారు. యూరప్‌లోని అత్యంత హృదయ విదారకమైన స్మారక చిహ్నాలలో ఒకటి. బాధితుల్లో ఎక్కువమంది యూదులే అయినప్పటికీ, హంగేరీలోని ఫాసిస్టు పాలనలో హింసకు గురైన ఇతరత్రా పౌరులు కూడా ఉన్నారు.


సినిమా దర్శకుడు కాన్‌ టోగాయ్‌ ఆలోచనతో, శిల్పి గ్యులా పౌయర్‌ ఈ స్మారకాన్ని రూపొందించారు. నది ఒడ్డున కొన్ని ఇనుప చెప్పులు అమర్చారు. అందులో ప్రతీ జత ఒక జీవితాన్ని సూచిస్తుంది. ఒక కుటుంబం, ఒక కల, ఒక భవిష్యత్తు అక్కడే ఆగిపోయిందనే భావనను కలిగిస్తాయి. అత్యంత హేయమైన చర్యకు సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రదేశాన్ని పర్యాటకులు ఆసక్తిగా సందర్శిస్తుంటారు.

చాలామంది చెప్పుల దగ్గర పూలు, కొవ్వొత్తులు ఉంచి శ్రద్ధాంజలి ఘటిస్తుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి:

శుభప్రదం... సౌభాగ్యదాయకం... శ్రావణం

నెగిటివ్‌ పాత్రలైనా చేస్తా!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 11:31 AM