Share News

‘స్నెయిల్‌ మెయిల్‌’... ఉత్తరాల క్లబ్‌

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:02 AM

‘పోస్ట్‌’ అనే మాట ఈకాలంలో చాలా అరుదుగా వినిపిస్తోంది. చాలా ఏళ్లుగా ఉత్తరాలకు బదులు వాట్సాప్‌ మెసేజ్‌లతోనే ప్రపంచం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటోంది.

‘స్నెయిల్‌ మెయిల్‌’... ఉత్తరాల క్లబ్‌

‘పోస్ట్‌’ అనే మాట ఈకాలంలో చాలా అరుదుగా వినిపిస్తోంది. చాలా ఏళ్లుగా ఉత్తరాలకు బదులు వాట్సాప్‌ మెసేజ్‌లతోనే ప్రపంచం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటోంది. అయితే జెన్‌ జీ మాత్రం ‘పోస్ట్‌’ అనే మాటను సరికొత్తగా వినాలని కోరుకుంటోంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ కాకుండా ఉత్తరాల అనుభూతిని ఆస్వాదించాలని ఆరాటపడుతోంది. వారి అభిరుచికి తగ్గట్టుగా ‘స్నెయిల్‌ మెయిల్‌’ క్లబ్బులు పుట్టుకొస్తున్నాయి. వీటిల్లో సభ్యత్వం తీసుకున్నవారికి పోస్ట్‌లో లేఖలు పంపించడం లేటెస్ట్‌ ట్రెండ్‌గా మారింది.

అమెజాన్‌, స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్‌, బిగ్‌బాస్కెట్‌... వీటిల్లో ఏదైనా బుక్‌ చేస్తే... నిమిషాల్లో ఇంటి దగ్గరకు తీసుకొచ్చి అందిస్తున్నాయి. వాట్సాప్‌, జీమెయిల్‌ వంటివి సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తున్నాయి. ఇన్‌స్టా, స్నాప్‌చాట్‌ వంటివి వీడియోలను అందిస్తున్నాయి. ఒకరకంగా ఈ ఇన్‌స్టంట్‌ సంస్కృతి జెన్‌ జీ తరానికి నచ్చడం లేదు. పోస్టులో వచ్చే ఉత్తరం కోసం వేచి చూసే అనుభూతిని వాళ్లు కోరుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ‘స్నెయిల్‌ మెయిల్‌’ క్లబ్‌లలో సభ్యత్వం తీసుకుంటున్నారు. ఇంతకీ ఏం చేస్తారంటే...


book6.2.jpg‘స్నెయిల్‌ మెయిల్‌’ క్లబ్‌లో సభ్యత్వం తీసుకుంటే ప్రతీ నెలా ఇంటికి అందంగా అలంకరించిన లెటర్లు పంపిస్తారు. వాటిలో చేతితో రాసిన ఉత్తరం, స్టిక్కర్లు ఉంటాయి. ఇన్‌స్టాలో ‘స్నెయిల్‌ మెయిల్‌’ అని వెతికితే రంగురంగుల కవర్లు, చేత్తో రాసిన ఉత్తరాలు, పాతకాలపు స్టాంపులు, పూలతో అలంకరించిన లేఖలు కనిపిస్తాయి. ఇలాంటి క్లబ్బులు పాశ్చాత్య దేశాల్లో చాలాకాలంగా ఉన్నాయి. మన దగ్గర ఈ మధ్యకాలంలో వేగంగా పెరుగుతున్నాయి. ఈ కొత్త తరహా క్లబ్బుల్లో సభ్యత్వాలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వీటి నిర్వాహకులు అంటున్నారు.


book6.3.jpgఎప్పుడూ ఒకేలా కాకుండా ప్రతీ నెల ఒక థీమ్‌ను ఎంచుకుంటారు. కథలు, సందేశాలు, జోక్స్‌ లెటర్స్‌, చిన్నచిన్న కానుకలు.. ఇలా లేఖలు తమ వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. లేఖలో ఏముంటుందో ముందుగా చెప్పరు. వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లు, ఇన్‌స్టాలో వచ్చే రీల్స్‌, నోటిఫికేషన్లు చూసి చూసి జెన్‌ జీ తరం విసుగు చెందుతోంది. ఒక ఉత్తరాన్ని చేత్తో పట్టుకుని, నెమ్మదిగా చదవడం, తరువాత ఆ ఉత్తరాన్ని దాచుకోవడంలో ప్రత్యేక అనుభూతి ఉంటుందని అంటున్నారు. ఈ క్లబ్బులు వాట్సాప్‌, ఇన్‌స్టాను భర్తీ చేయవు.


book6.4.jpgఒక ఉత్తరం వల్ల కలిగే చిన్న ఆనందాన్ని మాత్రం అందిస్తాయి. అస్తమానం మొబైల్‌ స్ర్కీన్‌పై మెసేజ్‌లు చూసే ప్రపంచంలో ఉన్నవారికి... పోస్టులో ఒక అందమైన చేతిరాతతో ఉన్న ఉత్తరం రావడం ఆనందాన్నిస్తుంది. కాసేపు ఆగి చదవాలని, ఆలోచించాలని, ఆ అనుభూతిని ఆస్వాదించాలని అనిపిస్తుంది. ఆ అనుభూతిని అందిచేందుకు ‘స్నెయిల్‌ మెయిల్‌’ క్లబ్బులు సిద్ధంగా ఉంటున్నాయి. నవతరానికి సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

శుభప్రదం... సౌభాగ్యదాయకం... శ్రావణం

నెగిటివ్‌ పాత్రలైనా చేస్తా!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 11:02 AM