Share News

అరటితో ‘ఆహా’రాలు

ABN , Publish Date - May 24 , 2026 | 12:08 PM

పండుగా తినే అరటిని బనానా అని, కూరగా వండుకునే అరటిని ప్లాంటేన్‌ అని పిలుస్తారు. కూరలకు ఉపయోగించే బొంత అరటి కూడా పండితే తియ్యగానే ఉంటుంది.

అరటితో ‘ఆహా’రాలు
Banana Recipes

పండుగా తినే అరటిని బనానా అని, కూరగా వండుకునే అరటిని ప్లాంటేన్‌ అని పిలుస్తారు. కూరలకు ఉపయోగించే బొంత అరటి కూడా పండితే తియ్యగానే ఉంటుంది. అలాగే, పండుగా తినే అరటిపండు పచ్చిగా ఉన్నప్పుడు కూరగా వండుకో దగినదిగా ఉంటుంది. అందుకే తెలుగువారికి ప్లాంటేన్‌, బనానా అనేవి పర్యాయ పదాలుగా కనిపిస్తాయి.

తెలుగులో అరటిని ‘అంటి’ అంటారు. అంటి పండు, అంటాకు, అంటిచెట్టు, అంటిదుంప అనే పిలుపులు నేటికీ ఉన్నాయి. అడ్డాకు, లేదా, బాదం ఆకుల్ని ఒకదానితో ఒకటి అంటించి కుడతారు కాబట్టి విస్తరిని ‘అంట’ అంటారు. కుట్టకుండానే విస్తరిగా ఉపయోగిస్తుంది. కాబట్టి, అరటిని అంటి అని పిలిచారు. ప్రజల వాడుకలో ’అంటి’ అనటిగా, ‘అరటి’గా మారి ఉండవచ్చు.

ఆదిమకాలంలో మానవుడు మొదటగా పచ్చి అరటికాయల్ని కాల్చుకుతినటం ద్వారా ఆహార జైత్రయాత్ర ప్రారంభించాడు! అరటితో చేసు కోదగిన ఆహార పదార్థాలు అనేకం ఉన్నాయి.


బనానా చిప్స్‌: తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ, ఫిలిప్పీన్స్‌లోనూ బనానా చిప్స్‌ ప్రసిద్ధి.

బజ్జీ: తెలుగువాళ్లకు పచ్చి అరటికాయ బజ్జి ప్రసిద్ధి. అయితే, కేరళ వాసులు ‘పఝంపోరి’ పేరుతో అరటి పండుని నిలువుగా కోసి శనగ పిండిలో ముంచి పచ్చిమిరపకాయ బజ్జీల్లాగా పొడవైన బజ్జీలు వేసుకుంటారు.

హల్వా: అరటిపండు గుజ్జుని ఒక భాండీలోకి తీసుకుని మునిగేదాకా నెయ్యి వేసి వేగించాలి. కరిగించిన బెల్లపు నీటిని ఈ గుజ్జుమీద పోసి, బాగా కలిసేలా కలుపుతూ కొద్దికొద్దిగా నెయ్యి ఎక్కిస్తూ ముద్దగా దగ్గరకొచ్చేలా వండినది అరటి హల్వా.


బ్రెడ్‌: బనానా బ్రెడ్‌ని క్విక్‌ బ్రెడ్‌ అని కూడా పిలుస్తారు. మైదాపిండిలో తియ్యని అరటిపండు గుజ్జు, కోడిగుడ్డు సొన వగైరా చేర్చి ఇంట్లో ఓవెన్‌లో ఈ బ్రెడ్లను చేసుకుంటారు. ఎగ్‌ లేకుండా వేగాన్‌ బనానా బ్రెడ్లు కూడా ఉన్నాయి.

దోసె: మైదాపిండిలో అరటిపండ్ల గుజ్జు, చక్కెర, బేకింగ్‌ పౌడర్‌, తగినంత ఉప్పు, కోడి గుడ్డు సొన, కాసిన్ని పాలు, నూనె లేదా నెయ్యి చేర్చి పిండిని గరిటజారుగా కలిపి మందంగా, గుండ్రంగా చిన్న దోసెలు పోసి కాలుస్తారు.ఈ దోసెల్ని దొంతరగా పేర్చుకుని, పైన తేనె పోసి, దోసెకీ దోసెకీ మధ్య స్పైసెస్‌ చల్లుకుంటూ, మొత్తం దొంతరని కేక్‌ లాగా ముక్కలు కోసి తింటారు.


book6.2.jpgస్ల్పిట్‌: కండ కలిగిన తియ్యని అరటిపండును నాలుగు పక్షాలుగా కోసి, వెనిల్లా, చాక్లెట్‌, స్ర్టాబెర్రి ఐస్‌క్రీమ్‌లు ఒక దాని పక్కన ఒకటి ఉండేట్లు మూడింటినీ ఈ పక్షాల మధ్యన పొదుగుతారు. పైన టాపింగ్‌ కోసం రంగు రంగుల డ్రై నట్స్‌, చాక్లెట్‌ ఐస్‌క్రీమ్‌ లాంటివి పరచి అందంగా అలంకరిస్తారు. ఇది కూడా పాశ్చాత్యుల డిజర్ట్‌.

క్లుయ్‌ బువట్‌ చి: థాయిలాండ్‌లో దొరికే తియ్యని పసుపుపచ్చ అరటిపండ్లను ‘క్లుయ్‌ బువట్‌ చి’ అంటారు. ఈ అరటిపండును ముక్కలుగా కోసి నీళ్ళలో వేసి మొదట మరిగి స్తారు. తరువాత కొబ్బరిపాలు, చక్కెర, చిటికె డంత ఉప్పు వేసి దగ్గరగా వచ్చేవరకూ మరి గించి అప్పుడు అందులో ఇందాకటి అరటి పండు ముక్కలు కలిపి కొద్దిసేపుఉడికిస్తారు.


బనానా మిల్క్‌ షేక్‌, స్మూతీ, బఫ్ఫిన్స్‌ అనే కప్‌ కేకులు ఇలా అరటిపండుతో వంటకాలు 40కి పైగానే ఉన్నాయి.

తెలుగువారికి కూర అరటికాయ వాడకం ఎక్కువ. వ్యాపారులు అరటి పండ్లను విషరసా యనాలు వేసి పండిస్తున్న కారణంగా చాలామంది అరటిపండు తినటానికి భయపడి, తగిన పొటాషియం ఫైబర్‌ల కోసం కూర అరటి వైపు మళ్లుతున్నారు. అరటి వేపుడు కూర, ముద్ద కూర, పులుసుకూర, కాయను కాల్చి చేసిన పచ్చిపులుసు, బజ్జీపచ్చడి, ముక్కలుగా తరిగి ఉడికించి పెరుగు కలిపి తాలింపుపెట్టిన పెరుగుపచ్చడి (రైతా) లాంటి వంటకాలు తెలుగు ఇళ్ళలో ప్రసిద్థి. మన ఆహార విధానానికి అరటి పండుకన్నా కాయే ఎక్కువ ఇమిడేలా ఉంటుంది.

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


ఈ వార్తలు కూడా చదవండి:

దారుణం.. మహిళను కొరికి చంపిన పెంపుడు కుక్కలు..

వడదెబ్బతో ఒక్కరోజే 40 మంది మృతి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 24 , 2026 | 12:08 PM