జహీరాబాద్ స్మార్ట్ సిటీతో 2 లక్షల కొలువులు
ABN , Publish Date - Aug 18 , 2026 | 09:44 AM
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ తెలంగాణ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునివ్వనుందని, పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
రూ.15 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్: జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ తెలంగాణ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునివ్వనుందని, పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న స్మార్ట్ సిటీకి సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్‌లు సంయుక్తంగా న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవల్‌పమెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ వీడియో కాన్ఫరెన్స్‌లో శ్రీధర్‌బాబు సచివాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, పరిశ్రమల మంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. జహీరాబాద్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నింటినీ 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ విధానంలో చేపడుతున్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ స్మార్ట్ సిటీలో భూమి రూపంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం ఉందని, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని చెప్పారు.
పారిశ్రామిక సంస్థలకు అవసరమైన మౌలిక వసతులను సిద్ధం చేసి పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) కింద దేశవ్యాప్తంగా కేంద్రం ప్రకటించిన 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల్లో నాలుగింటిని తెలంగాణకు కేటాయించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌ను శ్రీధర్‌బాబు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News