ఏం జరుగుతుందో?
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:03 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లండన్ నుంచి సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఉదయం 5.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎంకు పలువురు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు స్వాగతం పలకనున్నారు.
కొండా ఎపిసోడ్‌పై సర్వత్రా ఉత్కంఠ
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లండన్ నుంచి సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఉదయం 5.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎంకు పలువురు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు స్వాగతం పలకనున్నారు. అయితే రేవంత్ రాక నేపథ్యంలో కొండా సురేఖ ఎపిసోడ్‌లో ఏం జరగనుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లడానికి కొన్ని గంటల ముందు కొండా సుస్మితా పటేల్.. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కావడంతో రాజకీయ వర్గాల్లో ఆమె వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రి కుమార్తె అయివుండి.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగి సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే సుస్మితా పటేల్ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమంటూ సురేఖ వివరణ ఇచ్చారు. నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు. దీనిని ప్రభుత్వ విప్‌లు, పలువురు ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. సీఎం రేవంత్‌ను, ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా సొంత కూతురు వ్యాఖ్యలు చేస్తే.. బాధ్యత గల మంత్రిగా ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. మంత్రి సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ లైన్ తప్పితే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకోవాల్సిందేనని అధిష్ఠానాన్ని కోరారు. అయితే దీనిపై కొండా సురేఖ ఎదురుదాడికి దిగారు. తనపై మాట్లాడుతున్న ఎమ్మెల్యేల వెనుక అదృశ్య హస్తాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ శనివారం క్రమశిక్షణ కమిటీకి మరో లేఖ రాశారు. వాస్తవానికి కొండా సురేఖ, ఆమె కుటుంబం పదే పదే వివాదాలకు కేంద్రబిందువు అవుతుండడంపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉంది. ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించాలన్న ఆలోచన చేస్తోంది. అయితే పార్టీకి నష్టం జరగకుండా తమ నిర్ణయాన్ని ఎలా అమలు చేయాలన్న దానిపైనే తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం కీలకంగా మారింది.
సీఎం.. స్పందిస్తారా!?
లండన్ నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ అనుమతి నిరాకరించడంపైనే స్పందించనున్నారు. ఈ విషయంలో బీజేపీ నేతల విమర్శలకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. కానీ, కొండా సురేఖ ఎపిసోడ్‌పై ఈ సమావేశంలో స్పందిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే మంత్రి కొండా సురేఖ సైతం సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాతే ఈ అంశంపైన మాట్లాడతానని ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు సీఎం రాక నేపథ్యంలో ఆమె కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఇప్పటికే పార్టీ ముఖ్యులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఆమె హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆమె వచ్చిన తర్వాత ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ వివాదం నుంచి కొండా సురేఖను కాపాడేందుకు పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సీనియర్ నాయకుడి నేతృత్వంలో పరిశీలన కమిటీని నియమించి .. ఆ కమిటీ సిఫారసుల ఆధారంగా చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదన ముందుకు తెస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..
అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..