అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. రూ.2.5 కోట్ల విలువైన హాష్ ఆయిల్ సీజ్
ABN , Publish Date - Apr 21 , 2026 | 01:24 PM
వరంగల్ నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున హాష్ ఆయిల్ తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను డ్రగ్ కంట్రోల్ పార్టీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు..
వరంగల్, ఏప్రిల్ 21: వరంగల్ నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున హాష్ ఆయిల్ తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను డ్రగ్ కంట్రోల్ పార్టీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ. 2 కోట్ల 50 లక్షల విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నలుగురు నిందితులు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఒడిశాకు చెందిన హంటల్ సన్ను(23), హంటల్ సన్యాసి(23), కండెల చిన్నబాబు (56), కృష్ణా హంటల్ (56) గంజాయి మొక్కల నుంచి సుమారు 40 కిలోల హాష్ ఆయిల్ సేకరించారు. ఇటీవల ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో హాష్ ఆయిల్‌ను తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. తయారు చేసిన ఈ నిషిద్ధ ద్రవ్యాన్ని 5 కిలోల చొప్పున ప్యాక్ చేసి, ముంబైకి తరలించి.. భారీ ధరలకు విక్రయించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా కనిపిస్తున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులపై ఎన్.డి.పి.ఎస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నగరంలో డ్రగ్స్ సరఫరా చేసినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత
Read Latest Telangana News and National News