Share News

లైసెన్సు లేకున్నా బీమా సొమ్ము ఇవ్వాల్సిందే!

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:16 AM

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక రైతుకు డ్రైవింగ్‌ లైసెన్సు లేదన్న కారణంతో ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ బీమా సొమ్మును ఇవ్వటానికి నిరాకరించటాన్ని వరంగల్‌ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ తప్పుబట్టింది.

లైసెన్సు లేకున్నా బీమా సొమ్ము ఇవ్వాల్సిందే!
Warangal Consumer Commission

  • డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనం నడిపి పాలసీదారు మృతి

  • ఆ కారణంతో బీమా క్లెయిమ్‌ నిరాకరించిన ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌

  • వరంగల్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో బాధిత కుటుంబం సవాల్‌

  • బాధితులకు రూ.18 లక్షలు చెల్లించాలని ఆదేశించిన కమిషన్‌

హనుమకొండ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక రైతుకు డ్రైవింగ్‌ లైసెన్సు లేదన్న కారణంతో ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ బీమా సొమ్మును ఇవ్వటానికి నిరాకరించటాన్ని వరంగల్‌ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ తప్పుబట్టింది. బాధిత కుటుంబానికి రూ.18 లక్షల బీమా సొమ్మును 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఆ తేదీలోగా చెల్లించకపోతే డిఫాల్ట్‌ అయిన తేదీ నుంచి 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. హనుమకొండ జిల్లా దామెర మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన రైతు బూస కుమారస్వామికి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పొదుపు ఖాతా ఉంది. ఆయనకు వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు బ్యాంకు.. కుమారస్వామి ఖాతాను ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌తో అనుసంధానించింది.


పంట రుణం తీసుకోవాలంటే ప్రమాద బీమా పాలసీ తీసుకోవలసిందేనని బ్యాంకు ముందస్తు షరతు విఽధించడంతో పాటు ఆయన ఖాతా నుంచి వార్షిక ప్రీమియం కూడా మినహాయించుకుందని కుమారస్వామి భార్య బూస కోమల తెలిపారు. 2025, మార్చి 25న బీమా ప్రీమియం కింద రూ.1,000 మినహాయించుకున్నట్లు చెప్పారు. 2025 మార్చి 24వ తేదీ నుంచి 2026 మార్చి 24 వరకు చెల్లుబాటు అయ్యేలా రూ.20 లక్షల పాలసీని కుమారస్వామికి ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ జారీ చేసింది. అయితే, 2025 మే 24న కుమారస్వామి తన బంధువుతో కలిసి ద్విచక్ర వాహనంపై వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం నర్సయ్యపల్లిలో బంధువుల వివాహ రిసెప్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా రుద్రగూడెం వద్ద లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుమారస్వామి కుటుంబం బీమా సొమ్ముకోసం ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ను సంప్రదించగా.. పాలసీదారుడు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోయినా వాహనం నడపటం చట్టవ్యతిరేకమని చెప్పి బీమాను క్లెయిమ్‌ చేసేందుకు నిరాకరించింది.


దీంతో బీమా ఒప్పందంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధన లేదని పేర్కొంటూ.. బూస కోమల జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ వివాదం కొనసాగుతుండగానే రూ.18 లక్షల బీమా చెల్లించేలా బాధిత కుటుంబంతో బీమా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరుపక్షాలు కమిషన్‌లో జాయింట్‌ మెమో దాఖలు చేశాయి. దానిని పరిశీలించిన కమిషన్‌ చైర్మన్‌ జీ నాగరాజు, సభ్యుడు వీ జనార్ధన్‌రెడ్డి ఇటీవల తీర్పు ఇచ్చారు. ఇరుపక్షాల ముందస్తు అంగీకారం మేరకు పాలసీదారుడి కుటుంబానికి రూ.18 లక్షలు చెల్లించాలని కంపెనీని ఆదేశించారు. కమిషన్‌ బయట జరిగిన ఈ ముందస్తు ఒప్పందం కోసం ఇరుపక్షాలపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టంచేశారు. బీమా సంస్థ పాలసీ క్లెయిమ్‌ను నిరాకరించటానికి బలమైన కారణం లేదని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 06:19 AM