మహిళా రిజర్వేషన్ బిల్లు.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు..
ABN , Publish Date - Apr 19 , 2026 | 05:03 PM
మహిళా రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎంపీ కడియం కావ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి తాజాగా స్పందించారు. ఈ అంశంపై బీజేపీ తీరును ఎండగడుతూ విమర్శలు గుప్పించారు.
హనుమకొండ: లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని వారికి ద్రోహం చేశారంటూ ఎన్డీయే నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్ల పంపిణీలో అన్యాయం చేయాలని చూశారని ఇండి కూటమి నేతలు మండిపడుతున్నారు. మహిళా బిల్లును డీలిమిటేషన్‌కు ముడిపెట్టడంపైనా ఆగ్రహిస్తున్నారు. దీనిపై తెలంగాణలో నిరసనలు, ఆందోళనలతో ఈ వ్యవహారం రసవత్తరంగా మారింది.
మహిళా రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎంపీ కడియం కావ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి తాజాగా స్పందించారు. ఈ అంశంపై బీజేపీ తీరును ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. రాజ్యాంగానికి కమలం పార్టీ తూట్లు పొడుస్తోందని ఎంపీ కడియం కావ్య మండిపడ్డారు. ఆ పార్టీ నాయకులు ఆడవారిపై ప్రేమ ఉన్నట్లు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహించారు. మహిళల పక్షపాతి కాంగ్రెస్ మాత్రమేనని, బీజేపీకి ఓటు అడిగే కనీస హక్కు లేదన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే కుట్ర చేశారని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణ ధ్వజమెత్తారు. ఆడవారిపై అఘాయిత్యాలను అరికట్టడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్నారు. దేశ సమగ్రత దెబ్బ తీయటం కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని మేయర్ గుండు సుధారాణి ఆరోపించారు. మహిళా రిజర్వేషన్‌కు కాంగ్రెస్ వ్యతిరేకమంటూ దుష్ర్పచారం చేయటం సరికాదని హెచ్చరించారు. థర్డ్ క్లాస్ పార్టీ టికెట్లు, దొంగల ముఠాకు కేరాఫ్ బీజేపీ అంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులెన్నో చెప్పాలని బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. ఓట్ల కోసం ప్రధాని మోదీ దొంగ నాటకాలు ఆడుతున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర చేశారని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. వారి కుట్రలను ఇండి కూటమి తిప్పికొట్టిందని సంతోషం వ్యక్తం చేశారు. దక్షిణాదికి, చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. కాగా, ఈనెల 17న 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2/3 వంతు మెజారిటీ లేకపోవడంతో అది వీగిపోయింది. దీంతో డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగ్రెస్ లక్ష్యం దేశాన్ని ముక్కలు చేయడమే.. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సంచలన వ్యాఖ్యలు
తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి విగతజీవులుగా మారిన విద్యార్థులు..