Share News

తెలంగాణలో 5 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌..

ABN , Publish Date - Apr 19 , 2026 | 02:55 PM

తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 'ఆరెంజ్, ఎల్లో అలెర్ట్' జారీచేసింది.

తెలంగాణలో 5 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌..
Telangana Weather Alert

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అటు భానుడి భగభగలు, ఇటు అకాల వర్షాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉదయం ఎండ.. సాయంత్రం వాన!

ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. అయితే సాయంత్రం అయ్యేసరికి వాతావరణం పూర్తిగా చల్లబడి, ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగళ్ల వానలు ముంచెత్తుతున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసే అవకాశం ఉంది.

జిల్లాల వారీగా హెచ్చరికలు:

1. ఆరెంజ్ అలెర్ట్ (వడగళ్ల వానలు):

ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉండటంతో అధికారులు 'ఆరెంజ్ అలెర్ట్' జారీ చేశారు.

2. ఎల్లో అలెర్ట్ (ఈదురుగాలులు):

కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు 'ఎల్లో అలెర్ట్' జారీ చేశారు.


మరోవైపు ఎండల తీవ్రత..

వర్ష సూచన ఉన్నప్పటికీ, పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీమ్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో అధిక ఎండలు ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎండ తీవ్రత దృష్ట్యా కూడా ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

ప్రజలకు సూచనలు:

ఈదురుగాలులు వీస్తున్నప్పుడు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర గానీ ఉండకూడదు. రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం ఉత్తమం. మారిన ఈ వాతావరణ పరిస్థితుల వల్ల అటు ఉక్కపోత, ఇటు అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..

క్రాస్ బ్రీడ్ ఎవరు..? కేటీఆర్‌పై సంజయ్ కుమార్ సెటైర్లు

Updated Date - Apr 19 , 2026 | 03:15 PM