తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి విగతజీవులుగా మారిన విద్యార్థులు..
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:04 PM
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి డబిల్‌పూర్‌లో ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. సరదాగా ఈత కొట్టేందుకు చెరువులో దిగి ప్రాణాలు కోల్పోయారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి డబిల్‌పూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన ఉమన్ (14) 9వ తరగతి చదువుతున్నాడు. మరో బాలుడు ఇర్ఫాన్(12) 7వ తరగతి విద్యార్థి. ఒంటిపూట బడులు కావడంతో వీరిద్దరూ సరదాగా ఆడుకునేందుకు ఇవాళ(ఆదివారం) మధ్యాహ్న సమయంలో కలిశారు.
అనంతరం సరదాగా ఈత కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఎవరికీ చెప్పకుండా ఇస్కాన్ టెంపుల్ పక్కనున్న చెరువు వద్దకు వెళ్లారు. స్నానం చేసేందుకు మెల్లిగా లోపలికి దిగారు. లోతును సరిగా అంచనా వేయలేకపోవడంతో ముగినిపోయారు. ప్రాణాలు రక్షించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కాపాడాలంటూ హాహాకారాలు చేశారు. అయితే, సమీప ప్రాంతంలో ఎవ్వరూ లేకపోవడంతో చివరికి నీటిలో మునిగి ఉమన్, ఇర్ఫాన్ మృతిచెందారు.
అటుగా వెళ్లిన రైతులు, రైతు కూలీలు వారిని గుర్తించి విషయాన్ని గ్రామస్థులకు చేరవేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఉమన్, ఇర్ఫాన్ మృతదేహాలను వెలికితీశారు పోలీసులు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామస్థులు, మృతుల కుటుంబసభ్యులు చెరువు వద్దకు చేరుకుని కన్నీటిపర్యంతం అయ్యారు. చిన్నారుల తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ ఘటనతో డబిల్‌పూర్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
భవన నిర్మాణ రంగ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి వివేక్..
కాంగ్రెస్ లక్ష్యం దేశాన్ని ముక్కలు చేయడమే.. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సంచలన వ్యాఖ్యలు