Share News

కాంగ్రెస్ లక్ష్యం దేశాన్ని ముక్కలు చేయడమే.. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 19 , 2026 | 03:27 PM

కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో రాహుల్ గాంధీ మహిళలను మోసం చేశారని, తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని, ఆయనపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ లక్ష్యం దేశాన్ని ముక్కలు చేయడమే.. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సంచలన వ్యాఖ్యలు
union minister shobha karandlaje remarks

హైదరాబాద్, ఏప్రిల్ 19: కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఏప్రిల్ 17ను భారత మహిళా లోకానికి ఒక 'బ్లాక్ డే'గా ఆమె అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో రాహుల్ గాంధీ మహిళలను మోసం చేశారని, మహిళా బిల్లు ఆగిపోయేలా చేసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. శోభా కరంద్లాజే ఇవాళ (ఆదివారం) హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ పాలనలో మహిళా సాధికారత

ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళల కోసం అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని శోభ పేర్కొన్నారు. మహిళా గౌరవం కోసం ప్రధాని 'నారి వందన్' పథకాన్ని తెచ్చారని, మహిళా బిల్లు వెనుక పదేళ్ల కఠోర కృషి ఉందని చెప్పారు. మోదీ ప్రవేశపెట్టిన లోన్ల ద్వారా దేశంలో 3 కోట్ల మంది మహిళలు 'లక్షాధికారి దీదీ'లుగా ఎదిగారని చెప్పారు.

ఒకప్పుడు పెళ్లికే పరిమితమైన బాలికలు, నేడు విదేశీ విద్యను అభ్యసిస్తున్నారని, పైలట్లుగా విమానాలు నడుపుతున్నారని.. ఇదంతా మోదీ హయాంలోనే సాధ్యమైందని స్పష్టం చేశారు.


కాంగ్రెస్, ఇండియా కూటమిపై ధ్వజం

మహిళా బిల్లు విషయంలో అమిత్ షా లోక్‌సభలో గంట సమయం కేటాయించి సందేహాలు తీరుస్తానన్నా, ప్రతిపక్షాలు ఎందుకు ముందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. 'ఇండియా కూటమి నల్ల బట్టలతో నిరసన తెలపడం దేనికి సంకేతం? మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలు కాకూడదన్నదే మీ ఉద్దేశమా?' అని నిలదీశారు. రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేతగా ఏం మాట్లాడాలో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.

CM రేవంత్ రెడ్డిపై 'చీటింగ్' విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శోభా కరంద్లాజే తీవ్ర పదజాలంతో విమర్శించారు. తెలంగాణలో మహిళలకు ఇస్తానన్న రూ. 2,500, విద్యార్థినులకు స్కూటీలు, పెళ్లికానుకగా తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని, ఆయనపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణను రేవంత్ రెడ్డి 'పిక్ పాకెట్' చేశారని, ఆయన ఒక 'పిక్ పాకెటర్' అని ఘాటుగా విమర్శించారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని, ఉచిత బస్సు హామీలు 20 శాతం కూడా నెరవేరలేదని ఆమె ఉదహరించారు.

దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోందని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, వాస్తవానికి మహిళా బిల్లు విషయంలో దక్షిణ భారతీయులకే పెద్ద ద్రోహం చేసిందని మంత్రి శోభా కరంద్లాజే విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..

క్రాస్ బ్రీడ్ ఎవరు..? కేటీఆర్‌పై సంజయ్ కుమార్ సెటైర్లు

Updated Date - Apr 19 , 2026 | 03:47 PM