Minister Seethakka: మేడారం దేవాలయాన్ని సీఎం రేవంత్ ప్రారంభిస్తారు: మంత్రి సీతక్క
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:01 PM
మేడారం సమ్మక్క, సారాలమ్మ జాతర సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో జాతర పనులను రాష్ట్ర మంత్రి సీతక్క మంగళవారం పరిశీలించారు.
వరంగల్, డిసెంబర్ 13: మేడారంలో జరుగుతున్న సమ్మక్మ-సారలమ్మ జాతర ఏర్పాట్లను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. జాతర పనులు తుది దశకు చేరుకున్నాయని ఆమె వెల్లడించారు. ఆ తల్లుల దర్శనం కోసం అన్నివర్గాల ప్రజలు ఈ జాతరకు తరలివస్తారన్నారు. దాదాపు రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని సీతక్క చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నామని వివరించారు. మేడారం భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డికి.. సమ్మక్క సారలమ్మ తల్లులతో ఎంతో భావోద్వేగ బంధం ఉందని గుర్తుచేశారు. అందుకే రూ.260 కోట్లతో మేడారం అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పుకొచ్చారు. జనవరి 18న మేడారంలో దేవాలయాన్ని ప్రారంభించేందుకు సీఎం విచ్ఛేయనున్నారని తెలిపారు. ఇక్కడే కేబినెట్ సమావేశం సైతం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అంటే.. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వమే మేడారంనకు తరలి వస్తుందన్నారు.
మేడారం వచ్చే భక్తులకు త్వరితగతిన అమ్మవార్ల దర్శనం జరిగేలా చర్యలు తీసుకోవాలని దేవాలయ అధికారులను ఆదేశించారు సీతక్క. కనీసం మూడు రోజుల పాటు సంప్రదాయ భక్తులు మేడారంలోనే బస చేస్తారని వివరించారు. అందుకు వారికి అవసరమైన వసతులను కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రవాణా, తాగునీరు, శానిటేషన్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారామె.
అలాగే.. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు స్పష్టం చేశారు మంత్రి. సామాన్య భక్తులు ఆర్టీసీ బస్సుల్లో తరలివస్తారని.. ఈ మార్గంలో నడిచే బస్సుల పర్యవేక్షణ ఉండాలని ఆర్టీసీ సంస్థ ఉన్నతాధికారులకు సూచించారు. సమ్మక్క సారలమ్మ మహా మేడారం జాతరను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే అన్ని చర్యలు పూర్తి చేశామని మంత్రి సీతక్క వివరించారు.
అన్ని సేవలకు ఒకే సెల్ నంబర్..
మేడారం జాతర అధికారిక వెబ్‌సైట్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. అలాగే.. మేడారం వాట్సప్ చాట్ బాత్‌తోపాటు మొబైల్ యాప్‌నూ విడుదల చేశారు. వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో హెల్త్ క్యాంప్, టాయిలెట్ బాక్సులు, రూట్ మ్యాప్‌లు, ట్రాఫిక్ అప్‌డేట్‌లు, సహాయ కేంద్రాల ఫోన్ నంబర్లు, ఫిర్యాదుల నమోదుకు ప్రత్యేక వ్యవస్థ, నీటి సౌకర్యం తదితర అన్ని సౌకర్యాల సమాచారం కోసం వాట్సాప్ నంబర్ 7658912300 అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆమె వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దారుణం.. రైలు పట్టాలపై గర్భిణీ ప్రసవం
బెట్టింగ్ యాప్ బారిన పడి యువకుడి బలి
Read Latest TG News And Telugu News