Medaram: మేడారం.. భక్తజన గూడారం
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:25 PM
మేడారం.. భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఆ సమయంలో భక్తులు ఎక్కువగా ఉంటారనే భావనతో చాలామంది ముందస్తుగా విచ్చేసి తమతమ మొక్కులను సమర్పించుకుంటున్నారు. దీంతో మేడారం.. భక్తజన గూడారంగా మారుతోంది.
- భారీగా తరలివచ్చిన భక్తజనం
- గురు, శుక్రవారాల్లో లక్షలాది మంది రాక
- జోరుగా ముందస్తు మొక్కులు
తాడ్వాయి(ములుగు): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం(Medaram)లో శుక్రవారం భక్తజన ప్రవాహం కొనసాగింది. సంక్రాంతి సెలువుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చి తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. జాతర పరిసరాలన్నీ భక్తజనంతో కిటకిటలాడాయి. లక్షలాది మంది భక్తులు తల్లుల పుణ్యక్షేత్రానికి చేరుకొని సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. కల్యాణ కట్టల వద్ద తలనీలాలు సమర్పించుకున్నారు.
ఎత్తు బంగారం(బెల్లం) నెత్తిన మొసుకొని తల్లుల గద్దెలకు చేరుకున్నారు. వడి బియ్యం, చీర సారె, పసుపు కుంకుమ, యాట మొక్కులను సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి జాతర పరిసరాల్లోని చెట్ల కింద పిల్లాపాపలతో సందడి చేస్తూ విందు భోజనాలు చేశారు. గురువారం లక్ష మందికి పైగా భక్తుల రాగా శుక్రవారం 8 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అధికారులు అంచనాలు వేశారు. దీంతో రహదారులు, పార్కింగ్ స్థలాలు వాహనాలతో రద్దీగా మారాయి. అదేవిధంగా దేవస్థానం పరిసరాలు, క్యూలైన్లు, గద్దెలు భక్తులతో కిటకిటలాడాయి.

ఆకర్షణీయంగా ల్యాండ్ స్కేపింగ్..
తాడ్వాయి: మేడారంలోని పలు ప్రాంతాలు, రోడ్ల ప్రధాన కూడళ్లు, దేవస్థానం పరిసరాల్లో సుందరీకరణ పనులు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ల్యాండ్ స్కేపింగ్ పనులు భక్తులకు కనువిందు కలిగిస్తున్నాయి. సమ్మక్క- సారలమ్మలకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులు ప్రధాన కూడళ్ల వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. మారుమూల అటవీ ప్రాంతంలో శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రకృతి దేవతలు కొలువైన మేడారం అభివృద్ధి కావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.
అవును.. శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది
Read Latest Telangana News and National News